ఈయన పేరు హి జియాంగ్. చైనా షాంఘై నగరంలోని పురాతన బౌద్ధ మఠంలో ప్రధాన భిక్షువు. అంతే కాదు.. చైనాలో మూగజీవాలకు ఈయన దేవుడు. ఆయన చేతుల్లో ఉన్న కుక్కపిల్ల రోడ్డుపై దొరికినదే. దానిని సంరక్షించి, అమెరికాలోని ఓ వ్యక్తికి దత్తత ఇచ్చారు. ఆయనే స్వయంగా ఎయిర్‌పోర్టుకు వచ్చి దానిని సాగనంపారు. ఆ సందర్భంగా ఆయన కన్నీరు పెట్టుకున్నారు. జంతువులంటే ఆయనకి అంత ప్రీతి.
51 ఏళ్ల జియాంగ్ చైనాలోని వేలాది మూగ జీవాలకు సంరక్షకుడు. ఇందుకోసం తన మఠంలోనే మూగ జీవాల సంరక్షణాలయం కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వివిధ రకాల జంతువులను, పక్షులను, వీధి శునకాలు వేలాదిగా ఉన్నాయి. శునకాలే 8 వేలు ఉన్నాయి. ఆయనే స్వయంగా వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఒక్కోసారి పశువైద్యుడి అవతారం ఎత్తి ఆ మూగ జీవాలకు వ్యాక్సిన్లు కూడా వేస్తుంటారు. ఇన్ని వేల మూగజీవాలను సంరక్షించడం ప్రపంచంలోనే చాలా అరుదు.
చదవండి: స్నేక్ అటెంప్ట్ మర్డర్ అంటే ఇదేనేమో?
మొదట్లో ఆయన ప్రమాదాల్లో గాయపడ్డ మూగజీవాలకు వైద్య చికిత్స చేయించేవారు. 1994 నుంచి వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రెండేళ్ల క్రితం చైనాలో సుమారు 5 కోట్ల మూగ జీవాలు వీధుల్లో ఉన్నాయని అంచనా. వీటి సంఖ్య ఏటా పెరుగుతోంది. ‘‘చైనా ప్రజలకు ఆదాయం పెరిగింది కానీ, మూగజీవాలను పట్టించుకునే తీరిక లేకుండా పోయింది. అందుకే వారు తమ పెంపుడు జంతువులను వీధుల్లో వదిలేస్తున్నారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కుక్కలకు కొత్త జీవితం
షాంఘై పోలీసులు ఇటీవల ఇరుకుగా ఉన్న బోనుల్లో కొన్ని వీధి కుక్కలను బంధించి ఉంచారు. వాటిలో 20 వరకూ పిల్లలు కూడా ఉన్నాయి. ఈ విషయం జియాంగ్ చెవిన పడింది. వెంటనే ఆయన అక్కడకు చేరుకున్నారు. పోలీసులతో మాట్లాడారు. కొద్ది సమయంలో ఆ శునకాలకు బోనుల నుంచి విముక్తి లభించింది. వాటిని తీసుకుని జియాంగ్ తన సంరక్షణాలయానికి చేరుకున్నారు. ఆ శునకాల్లో గాయపడ్డ వాటికి, జబ్బుతో ఇబ్బంది పడ్డవాటికి సపర్యలు చేశారు. ప్రేమగా లాలించారు. వాటిని రక్షించి కొత్త జీవితాన్ని ఇచ్చారు. జీవుల పట్ల తనకున్న ప్రేమను చాటుకున్నారు. ‘‘నేను వాటిని రక్షించక పోతే.. అవి చనిపోయి ఉండేవి’’ అని జియాంగ్ చెబుతారు.
అప్పు చేసి ఆహారం
కుక్కలతో పాటు పిల్లులు, కోళ్లు, బాతులు, నెమళ్లు కూడా జియాంగ్ మఠంలో ఆశ్రయం పొందుతున్నాయి. వీటన్నిటికీ ఆహారం పెట్టాలంటే ఓ భిక్షువుకు తలకు మించిన భారమే అవుతుంది. ఏటా వీటి ఆహారానికి సుమారు 14 కోట్ల రూపాయలు ఖర్చవుతోందట. ప్రభుత్వం నుంచి ఆయనకు ఏమాత్రం సహకారం అందదు. చందాలతోనూ, అప్పులతోనూ ఇప్పటి వరకూ నెట్టుకొచ్చారు. అయితే ఇకపై అప్పు పుట్టే పరిస్థితి లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఆయన ఇతర దేశాల్లోని సంరక్షకుల వద్దకు, దత్తత తీసుకునే వారికి ఆ శునకాలను ఆయన ఇచ్చేస్తున్నారు.
ఇంగ్లీషు తెలిసిన తన వాలంటీర్లతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటీవల అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలకు సుమారు 300 కుక్కలను పంపారు. అలా పంపడం తనకు ఇష్టం లేదని, అయితే వాటికి కొత్త జీవితాలను ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ పని చేస్తున్నానని ఆయన తెలిపారు. ఏదొక రోజు వెళ్లి వాటిని చూసి వస్తానని చెబుతున్నారు.
– సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment