పాలకా...ఏలుకో ఇక కొత్తకొలువు | At the district office and replaced by 1267 | Sakshi
Sakshi News home page

పాలకా...ఏలుకో ఇక కొత్తకొలువు

Published Mon, Jun 9 2014 2:44 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

పాలకా...ఏలుకో ఇక కొత్తకొలువు - Sakshi

పాలకా...ఏలుకో ఇక కొత్తకొలువు

  •      జిల్లాలో ఒకేసారి  1267 పైగా పదవుల భర్తీ
  •      27 ఏళ్ల తరువాత ఇదే ప్రథమం
  • ఒకటీ.. రెండూ కాదు.. ఏకంగా 1267 పైగా రాజకీయ పదవులు జిల్లాలో భర్తీ అయ్యాయి. ఎంపీటీసీ సభ్యుల నుంచి ఎంపీ వరకు ఒకేసారి పదవులు భర్తీ కావడంతో ఈ ఏడాది ప్రత్యేక గుర్తింపును కైవశం చేసుకుంది. 1987లో మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపల్ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. మళ్లీ 27 ఏళ్ల తరువాత ఇప్పుడు స్థానిక సంస్థలతో పాటు సార్వత్రిక ఎన్నికలు పూర్తవడంతో కొత్తగా ఎన్నికైన వారు పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
     
    చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో స్థానిక సంస్థల, మునిసిపల్ ఎన్నికలను అధికారులు ఇటీవలే పూర్తి చేశారు. దీనికి తోడు సార్వత్రిక ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఇక మిగిలిందల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్, మేయర్, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టడమే.
     
    ఎంపీలు, ఎమ్మెల్యేలు..
     
    జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మూడు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ మేరకు 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఎన్నికయ్యారు. వీరికి నియోజకవర్గంతోపాటు రాష్ట్ర సమస్యలపై మాట్లాడే అధికారం ఉంటుంది. అలాగే ప్రత్యేక హోదా, నెలవారీ గౌరవ వేతనం, అలవెన్సులు, రక్షణ,రాజధానిలో కొలువు, ఇతర వసతులను ప్రభుత్వమే సమకూర్చుతుంది. ఇక అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎంపీ నిధులు అందుతాయి. ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యకలాపాల్లో వీరి ప్రాతినిధ్యం తప్పనిసరి.
     
    మున్సిపల్ పాలకులు..

     
    జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు,  పలమనేరు, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి మున్సిపాల్టీలతో పాటు చిత్తూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు పూర్తయ్యాయి. గెలిచిన అభ్యర్థులు పదవీ ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 169 వార్డు కౌన్సిలర్లు, 50 కార్పొరేటర్ పదవులు ఉన్నాయి. వీరిలో కొందరు మున్సిపల్ చైర్‌పర్సన్లుగా, కార్పొరేషన్ మేయర్‌గా కొనసాగుతారు.

    అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్ నియోజకవర్గ కేంద్రాల్లోనే ఉండడంతో ఇవి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక కేంద్రాలుగా పిలవబడుతున్నాయి. మున్సిపాల్టీల్లో చైర్‌పర్సన్లతో పాటు కౌన్సిలర్ల హోదాలో వారిని ప్రత్యేకంగా చూపుతుంది. ఇక కార్పొరేషన్‌లో అయితే ఎమ్మెల్యే, ఎంపీకన్నా మేయర్‌కే స్థానబలం ఎక్కువ. ప్రొటోకాల్ ప్రకారం మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా పాలక వర్గంలోని కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. వార్డుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ప్రభుత్వం సానుకూలంగా ఉంటే కావాల్సినంత నిధులు వస్తాయి.
     
    జెడ్పీ చైర్‌పర్సన్... జెడ్పీటీసీ సభ్యులు
     
    జిల్లాలో 65 జెడ్పీటీసీ స్థానాలు ఇప్పటికే భర్తీ అయ్యాయి. జెడ్పీటీసీ సభ్యులుగా గెలిచిన 65 మంది నుంచే ఒకరు జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికవుతారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి క్యాబినెట్ హోదాతో సమానమైంది. స్థానిక పాలనలో పెద్దగా జెడ్పీ చైర్‌పర్సన్ వ్యవహరిస్తారు. జెడ్పీటీసీ సభ్యులు తమ మండలాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తారు. మండలానికి సంబంధించిన ఏ సమస్యనైనా జెడ్పీ సమావేశంలో ప్రస్తావించవచ్చు. మడల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా అభివృద్ధికి సూచనలు చేయవచ్చు. జిల్లాకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేయవచ్చు. వీరికి ప్రభుత్వం గౌరవ వేతనం కూడా ఇస్తుంది.
     
    ఎంపీపీలు.. ఎంపీటీసీ సభ్యులు
     
    జిల్లాలో 901 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నికయ్యా రు. వీరిలో 65 మంది ఎంపీపీలుగా పదవీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) ఆ మండల ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తారు. మండల పరిషత్‌ను నడిపించేది వీరే. మండలాభివృద్ధి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. ఎంపీటీసీ సభ్యునిగా ఎన్నికై మెజారిటీ సభ్యుల మద్దతు కూడగడితే ఎంపీపీ పదవిని చేపట్టవచ్చు. ఎంపీటీసీ సభ్యుడు తాను ప్రాతినిధ్యం వహించే గ్రామాల అభివృద్ధికి పాటుపడవచ్చు. మండల పరిషత్ సమావేశాల్లో గ్రామానికి సంబంధించిన సమస్యల్ని ప్రస్తావించవచ్చు, వాటి పరిష్కారానికి మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో కృషి చేయవచ్చు.
     
    ఇదే ప్రథమం..
     
    జిల్లాలో ఒకేసారి ఇన్ని రాజకీయ పదవులు భర్తీ కానుం డడం ఇదే ప్రథమం. ప్రత్యక్షంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన వారు అదృష్టం ఉంటే మంత్రులు, జెడ్పీలో వైస్ చైర్మన్లు, స్థాయి సంఘాల అధ్యక్షులు, మున్సిపాల్టీల్లో వైస్ చైర్మన్లు, కార్పొరేషన్‌లో డెప్యూటీ మేయర్లు, స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా కొనసాగుతారు. మొత్తం మీద జయనామ సంవత్సరంలో 1267 మందికి పైగా వివిధ రాజకీయ పదవుల్లో ఆశీను లు కానున్నారు.

    వీరిలో ఎమ్మెల్యేలు 14 మంది, ఎంపీ లు ముగ్గురు, జెడ్పీ చైర్‌పర్సన్ ఒకరు, మునిసిపల్ చైర్మ న్లు ఆరుగురు, జెడ్పీటీసీ సభ్యులు 65 మంది, మండలాధ్యక్షులు 65 మంది, ఎంపీటీసీ సభ్యులు 901మంది, కార్పొరేషన్ మేయర్‌గా ఒకరు, వార్డు కౌన్సిలర్లు 169 మంది, కార్పొరేటర్లుగా 50 మంది ఉన్నారు. వీరంతా ప్రజా సమస్యలను ఏ మేరకు పరిష్కరించి గ్రామాలు, పట్టణాలు, నగరాలను అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement