
సాక్షి, తిరుపతి : టికెట్ ఇస్తారో లేదో తెలియదు.. అభిప్రాయ సేకరణ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి ఆశావహులు, నాయకులు, కార్యకర్తలను అమరావతికి పిలిపించుకున్నారు. ఈ రోజు, రేపు అంటూ డైలీ సీరియల్‌ని తలపించేలా జిల్లా నాయకులను తిప్పించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో చిత్తూరుకు నారమల్లి శివప్రసాద్, తిరుపతికి జూపూడి ప్రభాకర్‌ని ఎంపీ అభ్యర్థులుగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో కుప్పం, పుంగనూరు, పీలేరు తప్ప మిగిలిన అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఆయా అసెంబ్లీ టికెట్లను ఆశిస్తున్న ఆశావహులు, నియోజకవర్గ స్థాయి, ద్వితీయ శ్రేణి నాయకుల అభిప్రాయ సేకరణకు అమరావతికి పిలిపించుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నగరి, పూతలపట్టు, జీడీ నెల్లూరు, చిత్తూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, సత్యవేడు నియోజవర్గాల నేతలు కొన్ని రోజులుగా అమరావతికే పరిమితమయ్యారు.
నగరి విషయానికి వస్తే వారం రోజులుగా ఎన్నికల పరిశీలకులు, సీఎం రోజూ సమావేశం కావటం, మరుసటి రోజుకు వాయిదా వేయటం జరుగుతోంది. నాయకుల మధ్య సమన్వయం లేదని సాకు చూపి వారికి సీరియస్ వార్నింగ్‌లు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మదనపల్లె విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, రాందాస్ చౌదరి, బాబురెడ్డి, బోడిపాటి శ్రీనివాస్ టికెట్ కోసం అమరావతిలోనే ఎదురుచూస్తున్నారు. పూతలపట్టు నుంచి లలితకుమారితో పాటు మరికొందరు టికెట్ ఆశిస్తున్న వారు సీఎం నివాసం, సచివాలయం, పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తంబళ్లపల్లె, సత్యవేడు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని ప్రచారం జరుగుతుండటంతో మంత్రులు, సీనియర్ నాయకుల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా తిరిగి శివప్రసాద్ పేరును ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా జూపూడి ప్రభాకర్ పేరును ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment