
హైదరాబాద్: తెలంగాణ జైళ్ల శాఖ రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ప్రవేశించనున్నట్లు ఆ శాఖ డీజీ వినయ్‌కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం చంచల్‌గూడలోని జైళ్ల శాఖ శిక్షణా సంస్థ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, పెట్రోల్ బంకుల ద్వారా 2020 నాటికి రూ.100 కోట్ల ఆదాయం, 2025 నాటికి రూ.200 కోట్ల ఆదాయం గడించడమే లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్‌లు నిర్మిస్తున్న విధంగానే, జైళ్ల శాఖ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి సరసమైన ధరలకే గేటెడ్ కమ్యూనిటీ తరహాలో మధ్య తరగతికి ఇళ్లు కట్టి ఇస్తుందన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల విడుదలైన ఖైదీలకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందని చెప్పారు.
జైళ్ల శాఖ ఏ వ్యాపారం చేపట్టినా విజయవంతమైందని, ఈ ప్రాజెక్టు కూడా విజయం సాధిస్తుందన్నారు. మరో 3 నెలల వ్యవధిలో 20 నూతన పెట్రోల్ బంకులను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను ప్రైవేటు భూముల యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల నిర్వహణ పెద్ద సమస్యగా మారిందని, వాటి నిర్వహణను ప్రభుత్వం జైళ్ల శాఖకు అప్పగిస్తే బాగుంటుందని అన్నారు. మరో 6 నెలల్లో 400 మంది విడుదలైన ఖైదీలకు ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నేరాల అదుపు వల్ల 49 జైళ్లలో 17 మూసివేశామన్నారు. ఆ జైళ్లలో ఆశ్రమాలను నెలకొల్పేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. హౌసింగ్ సొసైటీ ద్వారా వరంగల్, హైదరాబాద్ జైళ్ల సిబ్బందికి సొంత ఇళ్లు అందించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment