సాక్షి, హైదరాబాద్: ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 207 మంది కరడుగట్టిన నేరగాళ్లు ఆచూకీ లేకుండా పోయారు. వీరంతా జైలు శిక్ష అనుభవించి విడుదలైనవారే. సాధారణంగా జైలుకు వచ్చినప్పుడు ఖైదీల చిరునామానే అధికారులు తీసుకుంటారు. గుర్తింపు కార్డులను ప్రామాణికంగా తీసుకుంటారు. జైల్లో ఉండగానే అధికారులు వీరికి రకరకాల పనుల్లో ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తారు. ఉన్నత విద్యార్హతలు ఉన్నా పెద్ద వ్యాపారాలు చేస్తూ క్షణికావేశంలో నేరాలకు పాల్పడేవారు తిరిగి నేరాలకు పాల్పడటం చాలా అరుదు. కానీ, నేరాల వృత్తిగా జీవించే నేరస్థులు, రౌడీ షీటర్లు పదేపదే జైలుకు వస్తుంటారు. ఇక్కడ కొందరి సావాసంతో మరింత రాటుదేలి బయటికి వెళ్లి తిరిగి నేరాలు చేస్తుంటారు.
ఇలాంటి వారిపై జైలు నుంచి విడుదలైన తరువాత కూడా జైళ్ల శాఖ నిఘా పెడుతుంది. వీరిలో దాదాపు అందరికీ ఏదో ఒక ఉపాధిలో శిక్షణ ఇస్తుంటారు. అదే ఉపాధిపై ఆసక్తి ఉన్నవారికి వ్యాపారం చేసుకోవడానికి లేదా వృత్తి పనులు చేసుకోవడానికి కావాల్సిన పనిముట్లను కొనుగోలు చేసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సాయం కూడా జైళ్ల శాఖ అందిస్తుంది. వీరిలో చాలా మంది జైళ్ల శాఖ చేపట్టిన పరివర్తన కార్యక్రమాలతో తిరిగి నేరాల బాట పట్టకుండా బుద్ధిగా జీవిస్తారు. కానీ, నేరాలే వృత్తిగా చేసుకున్న కరడుగట్టిన రౌడీ షీటర్లు మాత్రం తమ తీరు మార్చుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
జాబితాలో మొత్తం 958 మంది..
2014 ఫిబ్రవరి తరువాత తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 958 మంది నేరస్థుల జాబితాను జైళ్ల శాఖ రూపొందించింది. సాధారణంగా నేరం చేసే వారంతా ఆర్థిక పరిస్థితులు, పేదరికం, సరైన ఉపాధి లేకపోవడం, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవడం, చెడు సావాసం వంటి వాటి వల్ల పదేపదే నేరాలకు పాల్పడుతున్నట్లు జైళ్ల శాఖ గుర్తించింది. ఖైదీల్లో పరివర్తన తీసుకురావడానికి 31 పరివర్తనా బృందాలను ఏర్పాటు చేసింది. వీరిలో ప్రతీ టీము విడుదలైన ఖైదీ ఇంటికి వెళ్లి అతన్ని పలకరిస్తుంది.
అతను నేరం చేయడానికి దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తుంది. వివిధ ఎన్జీవోలు, సంస్థల సాయంతో అతను స్వయం ఉపాధిపై నిలదొక్కుకునేలా అన్ని రకాల సాయం అందిస్తుంది. ఆచూకీ లేకుండా పోయిన 207 మందిలో పలువురు ఇచ్చిన చిరునామాలు మార్చగా, మరికొందరు తప్పుడు చిరునామాలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారి ఆచూకీ కనిపెట్టాలని పోలీసు శాఖకు జైళ్ల శాఖ విజ్ఞప్తి చేసింది.
207 వాంటెడ్
Published Wed, Jun 5 2019 2:16 AM | Last Updated on Wed, Jun 5 2019 2:16 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment