పోలీసులు హింసించడం తప్పు కాదట! | High Approval For Police Violence In India | Sakshi
Sakshi News home page

పోలీసులు హింసించడం తప్పు కాదట!

Published Mon, Sep 9 2019 6:55 PM | Last Updated on Mon, Sep 9 2019 7:34 PM

High Approval For Police Violence In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నేరస్తుల పట్ల హింసాత్మకంగా ప్రవర్తించడంలో తప్పులేదని ప్రతి నలుగురు పోలీసుల్లో ముగ్గురు పోలీసులు భావిస్నున్నారు. అలాగే నేరాన్ని ఒప్పించేందుకు నేరస్తులను హింసించడంలో ఎలాంటి తప్పులేదని ప్రతి ఐదుగురు పోలీసుల్లో నలుగురు పోలీసులు భావిస్తున్నారు. ‘కామన్‌ కాజ్‌’ అనే స్వచ్ఛంద పౌర సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆ సంస్థ తన అధ్యయన వివరాలను ‘స్టేటస్‌ ఆఫ్‌ పోలీసింగ్‌ ఇన్‌ ఇండియా రిపోర్ట్‌–2019’ నివేదికలో వెల్లడించింది. 

దేశంలోని 21 రాష్ట్రాలకు చెందిన 12 వేల మంది పోలీసులను, పోలీసు కుటుంబాలకు చెందిన పదివేల మందిని ఇంటర్వ్యూలు చేయడం ద్వారా దేశంలో పోలీసు వ్యవస్థ ఎలా కొనసాగుతుందో, ఎలా కొనసాగాలని వారు కోరుకుంటున్నారో, అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు వ్యవస్థ ఎలా ఉండాలనే విషయంపై ఈ సంస్థ తన అధ్యయానాన్ని కొనసాగించింది. పోలీసు వ్యవస్థకు అందుబాటులో ఉన్న వనరులేమిటో, వారు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారో, పరిస్థితుల ప్రభావం వారి విధులపై ఎలా ఉంటుందనే విషయాలను కూడా తీసుకొని సంస్థ తన అధ్యయనాన్ని ముగించింది. 

2016 సంవత్సరం నుంచి 2019 సంవత్సరాల మధ్య 427 మంది పోలీసు లాకప్‌లో మరణించారు. రాజ్యసభకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గత జూన్‌ నెలలో అధికారికంగా వెల్లడించిన సంఖ్య ఇది. ఒక్క కేసులో మాత్రమే లాకప్‌ డెత్‌కు కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఆదేశించింది. గత మూడేళ్లలో జుడీషియల్‌ కస్టడీలతో మారణించిన వారి సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకొంటే లాకప్‌లో మొత్తం మరణించిన వారి సంఖ్య 5,476కి చేరుకుంటుంది. జడ్జీ ఆదేశం మేరకు జైలుకు పంపిస్తే అది జుడీషియల్‌ కస్టడీ కిందకు వస్తుంది. కేసును కోర్టు వరకు తీసుకెళ్లకుండా కేసు దర్యాప్తులో భాగంగా ఎవరినైనా లాకప్‌లో నిర్బంధిస్తే అది పోలీసు కస్టడీ కిందకు వస్తుంది. పోలీసు కస్టడీలో ఎవరైనా మరణిస్తే అందుకు సదరు పోలీసు స్టేషన్‌ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 

నేరం రుజువై శిక్ష పడే వరకు నేరస్తులంతా పోలీసు లేదా జుడీషియల్‌ కస్టడీలోనే ఉంటారు. 2015 సంవత్సరాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఆ ఏడాది 4.3 లక్షల మంది నిందితులు జైళ్లలో మగ్గుతున్నారు. వారిలో మూడింట రెండు వంతుల మంది మాత్రమే న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. చివరకు వారిలో మూడోవంతు మంది నిందితులే నేరస్తులుగా రుజువై శిక్షలు పడుతాయి. ఆత్మహత్యలు, అనారోగ్యం, ఇతర ప్రాకృతిక కారణాల వల్లనే లాకప్‌ డెత్‌లు సంభవిస్తున్నాయని పోలీసులు సహజంగా వాదిస్తారు. వారిని హింసించడం వల్లనే చనిపోయారని బాధితుల బంధు, మిత్రులు చెబుతుంటారు. 

సమాజం శ్రేయస్సు కోసం పోలీసులు ఇలాంటి హింసకు పాల్పడవచ్చా ? అని ప్రశ్నించగా, 74 శాతం మంది అవునని అంగీకరించారు. 30 శాతం మందే పూర్తిగాను లేదా పాక్షికంగాను వ్యతిరేకిస్తున్నారు. వాళ్లను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అధ్యయనకారులు ఉద్దేశపూర్వకంగా క్రిమినల్స్‌ అనే పదాన్నే వాడారు. వారిలో నేరం రుజువైన వారు ఉండవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు మాత్రమే ఉండవచ్చు. క్రిమినల్స్‌తో  నేరాన్ని ఒప్పించేందుకు వారిని హింసించినా తప్పులేదని ప్రతి ఐదుగురులో నలుగురు పోలీసులు అంగీకరించారు. నేరస్థుల పట్ల హింస కూడదని ప్రజల్లో యాభ శాతం మంది వాదిస్తున్నారు. 

2010లో కేంద్రం ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ టార్చర్‌ బిల్‌’ను తీసుకొచ్చిగా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. మొత్తం పోలీసు వ్యవస్థలో 6 శాతం మందికి మాత్రమే మానవ హక్కుల గురించి శిక్షణ అందడం, పోలీసులు రోజుకు సగటున 14 గంటలు పని చేస్తుండటం, కొన్ని వారాల వరకు వారికి వీక్లీ ఆఫ్‌లు దొరక్క పోవడం వల్లనే ప్రధానంగా వారికి నేరస్థుల పట్ల హింసాత్మక ధోరణి బలపడుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement