custodial deaths
-
Iran: యువతి ప్రాణం తీసిన హిజాబ్ రూల్.. ఆందోళన
కఠిన మత చట్టాలకు పేరుగాంచిన ఇరాన్ గడ్డపై మరో దారుణం చోటు చేసుకుంది. ఈ మధ్యే ఉరి శిక్ష పడ్డ ఓ మహిళకు.. ఆమె కూతురితోనే కుర్చీ తన్నించి తల్లికి ఉరి వేసింది అక్కడి ప్రభుత్వం. తాజాగా హిజాబ్ ధరించనందుకు ఓ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శవంగా ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన ఇరాన్ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. మహ్సా అమినీ(22) అనే యువతి గతవారం తన కుటుంబంతో టెహ్రాన్ ట్రిప్‌కు వెళ్లింది. అయితే ఆమె హిజాబ్ ధరించకపోవడంతో.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పాటించాల్సిన డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘించిందంటూ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ.. ఆమెను హఠాత్తుగా ఆస్పత్రిలో చేర్చారు పోలీసులు. అమినీ కోమాలోకి వెళ్లిందని ప్రకటించిన పోలీసులు.. చివరకు శనివారం ఆమె కన్నుమూసినట్లు ప్రకటించారు. అమినీ మృతిపై పోలీసులు అనుమానాస్పద ప్రకటన చేయకపోవడంతో.. ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు వ్యతిరేకంగా వందల మంది ప్రజలు ఆస్పత్రి బయట ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్‌కు ఆమెను తరలించినప్పటి నుంచి ఆస్పత్రిలో చేర్చే వరకు ఏం జరిగిందో ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే ఓ ప్రైవేట్‌ఛానెల్ మాత్రం.. కస్టడీలో ఆమెను హింసించారని, తలకు బలమైన గాయం అయ్యిందని, ఒంటిపై గాయాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో.. కస్టడీలో ఆమె హింసకు గురై ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే.. గత మంగళవారం అమినీతో పాటు మతపరమైన డ్రెస్ కోడ్ ఉల్లంఘించిన కొందరిని స్టేషన్‌కు తరలించామని, సందర్శకుల హాలులో ఉన్న టైంలో ఆమె ఉన్నట్లుండి కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించామని, అక్కడ ఆమె కోమాలోకి వెళ్లిందని చెప్పిన వైద్యులు.. శుక్రవారం మరణించిందని ప్రకటించారని పోలీసులు ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటన రాజధాని టెహ్రాన్‌ను ఆందోళనకారులతో కుదిపేస్తుండడంతో అధ్యక్షుడు ఎబ్రహీమ్ రైసీ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. జులైలో భద్రతా సిబ్బంది వ్యాన్ ఎదుట తన కూతురిని వదిలేయాలంటూ ఓ తల్లి బతిమిలాడుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యి.. చర్చకు దారి తీసింది. మరో ఘటనలో.. సెఫీడెహ్ రష్నో అనే యువతి హిజాబ్ వ్యవహారం తర్వాత కనిపించకుండా పోయింది. మతపరమైన మోరల్ పోలీసింగ్ పేరిట అక్కడ జరుగుతున్న దారుణాలను మానవ హక్కుల సంఘాలు నిలదీస్తున్నా లాభం లేకుండా పోతోంది. -
పోలీసులు హింసించడం తప్పు కాదట!
సాక్షి, న్యూఢిల్లీ : నేరస్తుల పట్ల హింసాత్మకంగా ప్రవర్తించడంలో తప్పులేదని ప్రతి నలుగురు పోలీసుల్లో ముగ్గురు పోలీసులు భావిస్నున్నారు. అలాగే నేరాన్ని ఒప్పించేందుకు నేరస్తులను హింసించడంలో ఎలాంటి తప్పులేదని ప్రతి ఐదుగురు పోలీసుల్లో నలుగురు పోలీసులు భావిస్తున్నారు. ‘కామన్ కాజ్’ అనే స్వచ్ఛంద పౌర సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఆ సంస్థ తన అధ్యయన వివరాలను ‘స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్–2019’ నివేదికలో వెల్లడించింది. దేశంలోని 21 రాష్ట్రాలకు చెందిన 12 వేల మంది పోలీసులను, పోలీసు కుటుంబాలకు చెందిన పదివేల మందిని ఇంటర్వ్యూలు చేయడం ద్వారా దేశంలో పోలీసు వ్యవస్థ ఎలా కొనసాగుతుందో, ఎలా కొనసాగాలని వారు కోరుకుంటున్నారో, అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు వ్యవస్థ ఎలా ఉండాలనే విషయంపై ఈ సంస్థ తన అధ్యయానాన్ని కొనసాగించింది. పోలీసు వ్యవస్థకు అందుబాటులో ఉన్న వనరులేమిటో, వారు ఎలాంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారో, పరిస్థితుల ప్రభావం వారి విధులపై ఎలా ఉంటుందనే విషయాలను కూడా తీసుకొని సంస్థ తన అధ్యయనాన్ని ముగించింది. 2016 సంవత్సరం నుంచి 2019 సంవత్సరాల మధ్య 427 మంది పోలీసు లాకప్‌లో మరణించారు. రాజ్యసభకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గత జూన్ నెలలో అధికారికంగా వెల్లడించిన సంఖ్య ఇది. ఒక్క కేసులో మాత్రమే లాకప్ డెత్‌కు కారణమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. గత మూడేళ్లలో జుడీషియల్ కస్టడీలతో మారణించిన వారి సంఖ్యను కూడా పరిగణనలోకి తీసుకొంటే లాకప్‌లో మొత్తం మరణించిన వారి సంఖ్య 5,476కి చేరుకుంటుంది. జడ్జీ ఆదేశం మేరకు జైలుకు పంపిస్తే అది జుడీషియల్ కస్టడీ కిందకు వస్తుంది. కేసును కోర్టు వరకు తీసుకెళ్లకుండా కేసు దర్యాప్తులో భాగంగా ఎవరినైనా లాకప్‌లో నిర్బంధిస్తే అది పోలీసు కస్టడీ కిందకు వస్తుంది. పోలీసు కస్టడీలో ఎవరైనా మరణిస్తే అందుకు సదరు పోలీసు స్టేషన్ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేరం రుజువై శిక్ష పడే వరకు నేరస్తులంతా పోలీసు లేదా జుడీషియల్ కస్టడీలోనే ఉంటారు. 2015 సంవత్సరాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఆ ఏడాది 4.3 లక్షల మంది నిందితులు జైళ్లలో మగ్గుతున్నారు. వారిలో మూడింట రెండు వంతుల మంది మాత్రమే న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. చివరకు వారిలో మూడోవంతు మంది నిందితులే నేరస్తులుగా రుజువై శిక్షలు పడుతాయి. ఆత్మహత్యలు, అనారోగ్యం, ఇతర ప్రాకృతిక కారణాల వల్లనే లాకప్ డెత్‌లు సంభవిస్తున్నాయని పోలీసులు సహజంగా వాదిస్తారు. వారిని హింసించడం వల్లనే చనిపోయారని బాధితుల బంధు, మిత్రులు చెబుతుంటారు. సమాజం శ్రేయస్సు కోసం పోలీసులు ఇలాంటి హింసకు పాల్పడవచ్చా ? అని ప్రశ్నించగా, 74 శాతం మంది అవునని అంగీకరించారు. 30 శాతం మందే పూర్తిగాను లేదా పాక్షికంగాను వ్యతిరేకిస్తున్నారు. వాళ్లను ఇంటర్వ్యూ చేసేటప్పుడు అధ్యయనకారులు ఉద్దేశపూర్వకంగా క్రిమినల్స్ అనే పదాన్నే వాడారు. వారిలో నేరం రుజువైన వారు ఉండవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు మాత్రమే ఉండవచ్చు. క్రిమినల్స్‌తో నేరాన్ని ఒప్పించేందుకు వారిని హింసించినా తప్పులేదని ప్రతి ఐదుగురులో నలుగురు పోలీసులు అంగీకరించారు. నేరస్థుల పట్ల హింస కూడదని ప్రజల్లో యాభ శాతం మంది వాదిస్తున్నారు. 2010లో కేంద్రం ‘ప్రివెన్షన్ ఆఫ్ టార్చర్ బిల్’ను తీసుకొచ్చిగా పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. మొత్తం పోలీసు వ్యవస్థలో 6 శాతం మందికి మాత్రమే మానవ హక్కుల గురించి శిక్షణ అందడం, పోలీసులు రోజుకు సగటున 14 గంటలు పని చేస్తుండటం, కొన్ని వారాల వరకు వారికి వీక్లీ ఆఫ్‌లు దొరక్క పోవడం వల్లనే ప్రధానంగా వారికి నేరస్థుల పట్ల హింసాత్మక ధోరణి బలపడుతోంది. -
‘మంత్రిమండలి సమావేశంలోనే నిర్ణయించండి’
సాక్షి, ముంబై: రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే నిర్ణయం మంత్రివర్గంలో తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఠాణాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలంటూ రాష్ర్ట ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించిన సంగతి విదితమే. అయితే ఆ దిశగా ఇప్పటివరకూ ఓ అడుగు కూడా పడలేదు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పారంభించాలని, ఇదే ఆఖరు అవకాశమని ధర్మాసనం పేర్కొంది. ఆయా పోలీస్ స్టేషన్లలో లాకప్ మరణాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వడాల రైల్వే పోలీస్ స్టేషన్లో పోలీసులు తీవ్రంగా కొట్టడంవల్ల ఓ బాలుడు చనిపోయాడు. దీంతో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు అంశం మరోసారి తెర పైకి వచ్చింది. బాలుడి తండ్రి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఇందుకు కారకులైన పోలీసులపై చర్యలు మొదలయ్యాయి. తమ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని బాధిత తండ్రి కోర్టును వేడుకున్నాడు. ఇలా అనేక లాకప్ మరణాల కేసులు పెండింగులో ఉన్నాయి. వారికి న్యాయం జరగడం లేదు. సరైన ఆధారాలు లేకపోవడంవల్ల దోషులైన పోలీసులకు శిక్ష పడడం లేదు. దీంతో అన్ని పోలీసు స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని హైకోర్టు అదేశించింది. గతంలోనే ఈ ఆదేశాలు జారీచేసినప్పటికీ ఇంతవరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు.