Iran: యువతి ప్రాణం తీసిన హిజాబ్‌ రూల్‌.. ఆందోళన | Hijab Row: Iranian Woman Mahsa Amini Dies After Arrest By Police | Sakshi
Sakshi News home page

హిజాబ్‌ ధరించలేదని పోలీసుల టార్చర్‌?.. కోమాలోంచే కన్నుమూసిన యువతి

Published Sat, Sep 17 2022 9:44 AM | Last Updated on Sat, Sep 17 2022 10:33 AM

Hijab Row: Iranian Woman Mahsa Amini Dies After Arrest By Police - Sakshi

కఠిన మత చట్టాలకు పేరుగాంచిన ఇరాన్‌ గడ్డపై మరో దారుణం చోటు చేసుకుంది. ఈ మధ్యే ఉరి శిక్ష పడ్డ ఓ మహిళకు.. ఆమె కూతురితోనే కుర్చీ తన్నించి తల్లికి ఉరి వేసింది అక్కడి ప్రభుత్వం. తాజాగా హిజాబ్‌ ధరించనందుకు ఓ యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శవంగా ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన ఇరాన్‌ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. 

మహ్‌సా అమినీ(22) అనే యువతి గతవారం తన కుటుంబంతో టెహ్రాన్‌ ట్రిప్‌కు వెళ్లింది. అయితే ఆమె హిజాబ్‌ ధరించకపోవడంతో.. పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పాటించాల్సిన డ్రెస్‌ కోడ్‌ను ఉల్లంఘించిందంటూ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుగానీ.. ఆమెను హఠాత్తుగా ఆస్పత్రిలో చేర్చారు పోలీసులు. 

అమినీ కోమాలోకి వెళ్లిందని ప్రకటించిన పోలీసులు.. చివరకు శనివారం ఆమె కన్నుమూసినట్లు ప్రకటించారు. అమినీ మృతిపై పోలీసులు అనుమానాస్పద ప్రకటన చేయకపోవడంతో.. ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు వ్యతిరేకంగా వందల మంది ప్రజలు ఆస్పత్రి బయట ఆందోళనకు దిగారు.

పోలీస్‌ స్టేషన్‌కు ఆమెను తరలించినప్పటి నుంచి ఆస్పత్రిలో చేర్చే వరకు ఏం జరిగిందో ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే ఓ ప్రైవేట్‌ఛానెల్‌ మాత్రం.. కస్టడీలో ఆమెను హింసించారని, తలకు బలమైన గాయం అయ్యిందని, ఒంటిపై గాయాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో.. కస్టడీలో ఆమె హింసకు గురై ఉంటుందని అనుమానిస్తున్నారు.  

అయితే.. గత మంగళవారం అమినీతో పాటు మతపరమైన డ్రెస్‌ కోడ్‌ ఉల్లంఘించిన కొందరిని స్టేషన్‌కు తరలించామని, సందర్శకుల హాలులో ఉన్న టైంలో ఆమె ఉన్నట్లుండి కుప్పకూలిపోవడంతో ఆస్పత్రికి తరలించామని, అక్కడ ఆమె కోమాలోకి వెళ్లిందని చెప్పిన వైద్యులు.. శుక్రవారం మరణించిందని ప్రకటించారని పోలీసులు ఒక స్టేట్‌మెంట్‌ విడుదల చేశారు. 

ఇదిలా ఉండగా.. ఈ ఘటన రాజధాని టెహ్రాన్‌ను ఆందోళనకారులతో కుదిపేస్తుండడంతో అధ్యక్షుడు ఎబ్రహీమ్‌ రైసీ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. జులైలో భద్రతా సిబ్బంది వ్యాన్‌ ఎదుట తన కూతురిని వదిలేయాలంటూ ఓ తల్లి బతిమిలాడుతున్న వీడియో ఒకటి వైరల్‌ అయ్యి.. చర్చకు దారి తీసింది. మరో ఘటనలో.. సెఫీడెహ్‌ రష్నో అనే యువతి హిజాబ్‌ వ్యవహారం తర్వాత కనిపించకుండా పోయింది. మతపరమైన మోరల్‌ పోలీసింగ్‌ పేరిట అక్కడ జరుగుతున్న దారుణాలను మానవ హక్కుల సంఘాలు నిలదీస్తున్నా లాభం లేకుండా పోతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement