సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ రాజారావు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నించాలని, అవాస్తవాలతో కట్టుకథలు అల్లి, లేనిని ఉన్నట్టు చెప్పడం సరికాదని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు అన్నారు. జైల్లోని ఖైదీలను ఎమ్మెల్సీ అనంతబాబు కొట్టారని, జైల్లో రాచమర్యాదలు.. అని కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తి అవాస్తవమని పేర్కొంటూ జైళ్ల శాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
హత్య కేసులో ముద్దాయిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబును కేంద్ర కారాగారంలోని ఓ బ్లాకులో సింగిల్ సెల్‌లో ఉంచినట్టు రాజారావు తెలిపారు. సెక్యూరిటీ రీత్యా సెల్‌లో 24 గంటలూ సిబ్బంది పహారా, నిత్య పర్యవేక్షణ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అందువలన తోటి ఖైదీలతో ఎలాంటి వివాదాలు, ఘర్షణలు పడే అవకాశమే లేదన్నారు.
ఇతర ఖైదీలకు కల్పించే సదుపాయాలనే ఆయనకూ కల్పించామని.. పడుకునేందుకు పరుపు ఏర్పాటు చేశామన్నది పూర్తి అబద్ధమన్నారు. నిబంధనల ప్రకారం అందరు ఖైదీల మాదిరే దిండు, డర్రీ, వులెన్ బ్లాంకెట్, దుప్పటి ఇచ్చామని, మెనూ ప్రకారమే ఆహారం అందిస్తున్నామని తెలిపారు.
అనంతబాబును కలిసేందుకు వస్తున్న వారికి నిబంధనల ప్రకారమే ములాఖత్, ఇంటర్వ్యూ అవకాశాలిస్తున్నట్టు చెప్పారు. అలా వచ్చిన వారి పూర్తి వివరాలు, ఆధార్ కార్డు పరిశీలించాకనే అనుమతిస్తున్నట్టు వెల్లడించారు. ములాఖత్‌కు వస్తున్న వారి ఫోన్‌తో అనంతబాబు మాట్లాడారనేది కూడా పూర్తి అవాస్తవమని రాజారావు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment