సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని జైళ్లలో పరిస్థితులు, మధ్యంతర బెయిల్‌పై ఖైదీల విడుదల తదితర అంశాలపై చర్చించేందుకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ (లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్), జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి (హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్), హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, జైళ్ల శాఖ డీజీ మహ్మద్ అసన్ రెజాలతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఇటీవల సమావేశమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమావేశమైన ఈ కమిటీ పలు తీర్మానాలు చేసింది.
ప్రాథమికంగా 90 రోజుల పాటు..
ఏడేళ్లు అంతకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసే సమయంలో అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించేలా డీజీపీకి హోంశాఖ ముఖ్య కార్యదర్శి సూచనలు ఇవ్వాలి. జిల్లా జడ్జీలంతా ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని మేజిస్ట్రేట్, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లకు సూచనలు చేయాలి. గత ఏడాది కమిటీ తీర్మానాల మేరకు మధ్యంతర బెయిల్‌పై విడుదలై తిరిగి జైలుకు చేరిన ఖైదీలు, అండర్ ట్రయల్ ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలి. ఏడేళ్లు, అంతకన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో జైల్లో ఉన్న అర్హులైన ఖైదీలను, అండర్ ట్రయిల్ ఖైదీలను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలి. విడుదలైన తరువాత 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంటామని వారు హామీ ఇవ్వాలి. దీన్ని ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేసి కస్టడీలోకి తీసుకోవచ్చు. కరోనా నేపథ్యంలో సొంత ప్రాంతాలకు చేరుకునేలా హోంశాఖ, జైళ్ల శాఖ తగిన రవాణా సదుపాయం కల్పించాలి. ప్రాథమికంగా మధ్యంతర బెయిల్ 90 రోజులకు మంజూరు చేయాలి. బెయిల్ బాండ్ల మొత్తం సమంజసంగా ఉండాలి.
వెబ్‌సైట్‌లో వివరాలుంచాలి..
దీనికి సంబంధించి హైకోర్టులో ఓ బెంచ్‌ను ఏర్పాటు చేసేందుకు రిజిస్ట్రార్ జనరల్ తీర్మానాల కాపీని ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలి. ఈ మొత్తం వ్యవహారంపై సుమోటో పిటిషన్‌ను సిద్ధం చేయాలి. రాష్ట్రంలో జైళ్ల సామర్థ్యం, ఎంత మంది ఖైదీలున్నారన్న విషయాలను జైళ్ల శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. ఈ వివరాలను ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీతో పంచుకోవాలి. ఉన్నత స్థాయి కమిటీ గత ఏడాది చేసిన అన్ని తీర్మానాలను లీగల్ సర్వీసెస్ అథారిటీ, హోంశాఖ, హైకోర్టు వెబ్‌సైట్‌లలో పొందుపరచాలి.
జైళ్లలో వేగంగా వ్యాక్సినేషన్
ఖైదీలు, సిబ్బంది విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, వైద్య సాయం, రోజూ శానిటేషన్ తదితర వివరాలను ఉన్నత స్థాయి కమిటీకి జైళ్ల శాఖ వివరించింది. ఇప్పటి వరకు 643 మంది ఖైదీలు, సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు జైళ్ల శాఖ డీజీ వివరించారు. మిగిలిన 6 వేల మంది ఖైదీలు, సిబ్బందికి వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 27న మరోసారి సమావేశం కావాలని ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment