జైళ్లశాఖ డీజీ జితేందర్‌కు వినతి పత్రం అందజేస్తున్న కాంగ్రెస్ నేతల బృందం
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: చంచల్‌గూడ జైల్లో ఉన్న ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నేతలను కలిసేందుకు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి అనుమతివ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, జైళ్ల శాఖ డీజీ జితేందర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన గురువారం కాంగ్రెస్ నేతల బృందంతో జితేందర్‌ను కలసి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ములాఖత్‌పై విజ్ఞప్తిని పరిశీలించి తమ నిర్ణయం వెల్లడిస్తామని డీజీ తెలిపినట్టు చెప్పారు.
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అధికార పార్టీ ఒత్తిడి తీసుకువస్తోందని, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ చంచల్‌గూడ జైల్లో ఉన్న విద్యార్థి నేతలను కలిసేందుకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని రేవంత్ ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ పర్యటన విషయంలో కూడా టీఆర్‌ఎస్ కుట్రలు చేసిందని ధ్వజమెత్తారు.
కనీసం శనివారం విద్యార్థి నేతలను జైల్లో పరామర్శించాలన్నా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. తాము ఇప్పటికే జైలు సూపరింటెండెంట్‌కు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నామని, అ యితే ఉన్నతాధికారులను కలసి విజ్ఞప్తి చేయాలని ఆయన సూచించడంతో డీజీ జితేందర్‌ను కలసినట్టు వెల్లడించారు. జైళ్ల శాఖ డీజీని కలసిన వారిలో కాంగ్రెస్ నేతలు మధుయాష్కీ, జగ్గారెడ్డి, గీతారెడ్డి, సంపత్, మానవతారాయ్ ఉన్నారు.
ఎంత అడ్డుకుంటే అంత ప్రతిఘటిస్తాం..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్‌ను అడ్డుకునేందుకు చూస్తోందని, కానీ ఎంత అడ్డుకుంటే అంతకన్నా ఎక్కువ బలంగా ఎదుర్కొంటామని రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఓయూ జేఏసీ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌తో పాటు మరో ఏడుగురు ప్రగతిభవన్ ముట్టడికి రాగా వారిని పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని పరామర్శిం చేందుకు రేవంత్‌రెడ్డి తదితరులు ఠాణాకు వచ్చారు.
వైట్ చాలెంజ్‌కు రాహుల్ సిద్ధమా?
రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ ‘వైట్ చాలెంజ్’కు సిద్ధమా అంటూ హైదరాబాద్‌లోని గన్‌పార్క్, ట్యాంక్‌బండ్ సహా పలు చోట్ల ఫ్లెక్సీ లు, పోస్టర్లు వెలిశాయి. రాష్ట్రంలో డ్రగ్స్ రాకెట్ బయటపడ్డ సమయంలో మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి ‘వైట్ చాలెంజ్’విసిరిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల నేపాల్‌లోని ఓ క్లబ్‌లో రాహుల్‌గాంధీ కనిపించడంతో.. ఆయన ఫొటోలతో ‘వైట్ చాలెంజ్’కు సిద్ధమా అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన పలువురు టీఆర్‌ఎస్ నేతలు ‘వైట్ చాలెంజ్‌కు సిద్ధమా?’అంటూ రాహుల్‌ను ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment