
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు 179 మంది ఖైదీలు మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారని జైళ్ల శాఖ డీజీ తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.శ్రీనివాసరెడ్డి హైకోరుకు మంగళవారం నివేదించారు. జైళ్లలో 6,620 మంది ఖైదీలుంటే కేవలం 179 మంది మాత్రమే మధ్యంతర బెయిల్‌పై విడుదల కావడం ఏమిటని హైకోర్టు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఖైదీల విడుదలకు అనుసరించిన విధానం, మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యేందుకు ఎవరు అనర్హులో తెలియజేస్తూ మెరుగైన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా జైళ్లలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలంటూ సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. దీనిపై ఏర్పాటైన ఓ ఉన్నత స్థాయి కమిటీ పలు తీర్మానాలు చేసింది. కమిటీ తీర్మానం ప్రకారం.. 90 రోజులపాటు ఖైదీలకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది.