
సాక్షి, అమరావతి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 20 నుంచి జరగాల్సిన బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలను కోవిడ్ కారణంతో వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో నాగార్జున వర్సిటీ బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు వాయిదా కోరుతూ ఒడిశా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఫౌండేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ ఏవీ శేషసాయి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపిస్తూ.. ఒడిశా విద్యార్థులు కూడా ఈ పరీక్షకు హాజరవుతున్నారని, కోవిడ్ వల్ల రవాణా సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేవని తెలిపారు.
నాగార్జున యూనివర్సిటీ తరఫు న్యాయవాది కొప్పినీడు రాంబాబు వాదనలు వినిపిస్తూ.. పరీక్షల సందర్భంగా కోవిడ్ ప్రొటోకాల్స్‌ను అమలు చేస్తూ విశ్వవిద్యాలయం అన్ని చర్యలు తీసుకుందని వివరించారు. న్యాయమూర్తి స్పందిస్తూ, కోవిడ్ మన జీవితాల్లో భాగమైపోయిందన్నారు. కోవిడ్‌ను కారణంగా చూపుతూ ఎంత కాలం వేచి చూడగలమని ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ పరీక్షల నిర్వహణకు విశ్వవిద్యాలయం అన్ని ఏర్పాట్లు చేసినందున, పరీక్షల వాయిదా సాధ్యం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని గుర్తు చేశారు. విద్యార్థుల ప్రయోజనాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ పరీక్షల వాయిదా కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment