రోజువారి పనిచేసే కూలీల మస్తర్ నమోదులో కొత్త నిబంధనలు
పనిచేసే చోట తీసే ఫొటోలోని కూలీల సంఖ్య.. మస్తర్‌లో సంఖ్య ఒకేలా ఉండాలి
ఫొటోలో తేడా ఉంటే ఆ మస్తర్ షీట్‌ను పరిగణించరు.. వేతనాలు చెల్లించరు
ఫొటో తీసేటప్పుడు కనీసం ఒక్క కూలి అయినా కళ్లు ఆర్పినట్లు ఉండాలి
అలా ఉంటేనే ఆ ఫొటో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అయ్యేలా యాప్ ఆధునికీకరణ
ఇప్పటిదాకా మస్తర్ షీటుతో నమోదు చేసే ఫొటోలో కూలీలున్నా లేకున్నా పరిగణనలోకి..
ఏపీ సహ 10 రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లోకి..
సాక్షి, అమరావతి : ఉపాధి హామీ పథకంలో కూలీల దొంగ మస్తర్ల నమోదుకు కేంద్రం కళ్లెం వేసింది. ఇందుకోసం అక్రమాలకు తావులేని విధంగా కొత్తగా కఠిన నిబంధనల అమలుకు శ్రీకారం చుట్టింది. కూలీలు పనిచేసే సమయంలో ‘ఉపాధి’ సిబ్బంది తీసే ఫొటోలో ఉండే వ్యక్తుల సంఖ్య.. అక్కడ పనికి హాజరైనట్లు సిబ్బంది నమోదు చేసే కూలీల సంఖ్య ఒక్కటిగా ఉంటేనే ఆ మస్తరులో పేర్కొనే కూలీలు పనికి హాజరైనట్లు పరిగణించి వారికి వేతనాలు చెల్లిస్తారు. అలా కాకుండా.. ఫొటోలో ఉండే కూలీల సంఖ్య, మస్తరు షీట్‌లో పేర్కొనే సంఖ్యకు ఏమాత్రం తేడా ఉన్నా అ మస్తరు షీటును నిర్ద్వందంగా తిరస్కరిస్తారు.
యాప్‌లో కొత్త నిబంధనలు..
దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు రోజువారీ వేతనాల మొత్తాన్ని కేంద్రమే నేరుగా కూలీలకు చెల్లిస్తుంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఏటా ఆరు నుంచి ఏడు కోట్ల కుటుంబాలు సుమారు రూ.75,000 కోట్ల మేర ప్రయోజనం పొందుతున్నాయి.
అలాగే, మన రాష్ట్రంలో 46–47 లక్షల కుటుంబాలు ఏటా రూ.ఆరు వేల కోట్ల మేర లబ్ధి పొందుతున్నాయి. కూలీల హాజరు, వేతనాల బిల్లుల నమోదు తదితర ప్రక్రియ అంతా ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతుంది. ఈ వెబ్ పోర్టల్ పూర్తిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధీనంలో పనిచేస్తుంది.
ఇక పథకం అమలులో రాష్ట్రాల్లో రోజువారీ పనికి హాజరవుతున్న కూలీల వివరాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణకు ఆన్‌లైన్ వెబ్‌పోర్టల్‌కు అనుబంధంగా నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్‌ఎంఎంఎస్) పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ చాలా ఏళ్లుగా వినియోగిస్తోంది. ఇప్పుడీ యాప్ నిర్వహణలో కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అందులో కొన్ని సాంకేతిక మార్పులు చేసింది.
కొత్త నిబంధనలు ఇలా..
మన ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, జమ్ముకశ్మీర్, త్రిపుర, మేఘాలయ.. మొత్తం పది రాష్ట్రాల్లో జనవరి 27 నుంచి ఎన్‌ఎంఎంఎస్ యాప్ ద్వారా కూలీల నమోదులో కేంద్రం కొత్త నిబంధనల అమలును తప్పనిసరి చేసింది. ఈ నూతన ప్రక్రియలో గతంలో ఎప్పుడో తీసిన ఫొటోలను ఆన్‌లైన్‌లో నమోదుకు వీల్లేకుండా అదనపు జాగ్రత్తలు చేపట్టింది.
అంతేకాక.. పని ప్రదేశంలో కూలీల హాజరును యాప్‌లోని మస్తరు పేజీలో నమోదు చేసిన తర్వాత ఫొటో తీసేటప్పుడు అక్కడున్న కూలీల్లో కనీసం ఒక్కరైనా కళ్లు ఆర్పినట్లు చేస్తేనే ఆ ఫొటోను ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో నమోదయ్యేలా యాప్‌ను ఆధునీకరించారు. అలాగే, ఫొటోలో ఉండే కూలీల సంఖ్య.. మస్తరులో కూలీల సంఖ్య ఒక్కటిగా ఉండాలి.
ఇప్పటివరకూ సంఖ్యపై పెద్దగా పట్టింపులేదు..
ఉపాధి పని ఎక్కడ జరిగినా.. ఆ పనికి ఏరోజు ఎంతమంది కూలీలు హాజరయ్యారన్నది క్షేత్రస్థాయిలో పనిచేసే ఫీల్డు అసిస్టెంట్లు లేదా మేట్‌లు ఆన్‌లైన్‌లో మస్తరు నమోదు చేయాలి. అలాగే, పని ప్రదేశంలో కూలీలు పనిచేస్తున్న ఫొటోను కూడా తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
ఈ మస్తర్ల ఆధారంగానే వారానికి ఒకసారి కూలీలందరికీ వేతనాల చెల్లింపులకు సంబంధించిన ఫండ్ ట్రాన్స్‌ఫర్ వోచర్లను (ఎఫ్‌టీఓ) ఆన్‌లైన్‌లో తయారుచేస్తారు. ఈ ఎఫ్‌టీఓల ప్రకారం నేరుగా కూలీల బ్యాంకు ఖాతాలకు వేతనాలు జమవుతుంటాయి. ఇది కొన్నేళ్లుగా జరుగుతున్న విధానమే.
అయితే, ఇందులో ఫొటోలో కూలీల సంఖ్య ఎంతమంది ఉన్నారు.. అదెప్పటిది అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకునే వారు కాదు. కనీసం ఒక్క మనిషి కూడా ఫొటోలో లేకపోయినా మస్తర్లలో పేర్కొనే కూలీల సంఖ్య ఆధారంగా బిల్లులు చెల్లించేసేవారు.
Comments
Please login to add a commentAdd a comment