‘ఉపాధి’ కోసం ఊపిరి తీశారు..! | 'Employment' was choking for ..! | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ కోసం ఊపిరి తీశారు..!

Published Thu, Jan 29 2015 2:14 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

‘ఉపాధి’ కోసం ఊపిరి తీశారు..! - Sakshi

‘ఉపాధి’ కోసం ఊపిరి తీశారు..!

సస్పెండైన ఫీల్డు అసిస్టెంట్ దారుణ హత్య
 
డోన్‌టౌన్: అధికారం తమ చేతిలో ఉంది కదా అని టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారు. తమ మాట వినని వారిపై దాడులకు పాల్పడుతున్నారు. తాము చెప్పినట్టే వినాలని, తమ వారికే ఉద్యోగాలు, పదవులు ఉండాలని పట్టుబడుతున్నారు. ఉపాధి పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు కోసం ఏకంగా ఓ వ్యక్తినే హత్య చేశారు. ఈ ఉదంతం డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో చోటుచేసుకుంది. ఓ చిరుద్యోగం కోసం అధికారం అడ్డుపెట్టుకొని ఇంతటి దారుణానికి ఒడిగట్టడం ఇదే ప్రథమమని పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. భవిష్యత్తులో ఇంకెంతటి దారుణాలు చూడాల్సి వస్తుందోనని ఆందోళన  చెందుతున్నారు.
 
పథకం ప్రకారమే..
డోన్ మండలంలోని కొత్తబురుజు గ్రామంలో సస్పెండైన ఫీల్డు అసిస్టెంట్ శాంతరాజ్ అలియాస్ మద్దిలేటి(37)ని మంగళవారం రాత్రి ప్రత్యర్థులు పట్టుడు కట్టెలతో దాడి చేసి, వేటకొడవళ్ల పిడులతో గుద్ది అతి కిరాతంగా హతమార్చారు. గ్రామంలోని ఇద్దరు అధికార పార్టీ నాయకుల కుట్రతోనే ఈ హత్య జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు ప్రతి పదివిలో తామే ఉండాలని పట్టుబడుతున్నారు. ఉపాధి హామీ పథకంలోని గ్రామ ఫీల్డు అసిస్టెంట్ పోస్టులో తమ వారినే నియమించుకోవాలని నిశ్చయించుకున్నారు.

ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన డోన్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సామాజిక తనిఖీ (ఓపెన్ ఫోరం)ను వేదికగా చేసుకున్నారు. పలువురు ఫీల్డు అసిస్టెంట్లను తొలగించాలనే దురుద్దేశంతో నిరాధారమైన ఆరోపణలు చేశారు. దీంతో కొత్తబురుజు, చనుగొండ్ల, వెంకటనాయునిపల్లె, వెంకటాపురం, కన్నపుకుంట, మల్లెంపల్లె, దొరపల్లె, కోట్రాయి తదితర గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. ఆరోపణలు పూర్తి స్థాయిలో రుజువు కాకముందే రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వీరిని సస్పెండ్ చేయడం విమర్శలకు తావిచ్చింది.

ఫోరంలో నివేదించిన ఆరోపణలు రుజువైతే విధుల నుంచి ఫీల్డు అసిస్టెంట్లను తప్పించాల్సిన నిబంధన ఉంది. అయితే ఆరోపణలు రుజువు కాకపోతే ఉద్యోగంలో కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్తబురుజు ఫీల్డు అసిస్టెంట్ శాంతరాజ్ అలియాస్ మద్దిలేటిపై ఆరోపణలు రుజువు కాకపోతే విధుల్లో ఎక్కడ కొనసాగుతాడేమోనన్న అక్కసుతో అదే గ్రామంలోని మరో వర్గాన్ని సృష్టించి ఈ హత్యకు పథకం పన్నినట్లు తెలుస్తోంది.
 
ఓపెన్ ఫోరంలోనే..
గత డిసెంబర్ 6వ తేదీన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఓపెన్ ఫోరంలోనే శాంతరాజ్‌పై కొత్తబురుజు గ్రామానికి చెందిన ఈరన్న అధికారుల సాక్షిగా గొంతుపట్టుకొని దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో పుటేజిలు, ఫొటోలు సైతం ఉపాధి హామీ సిబ్బంది చేతిలో ఉన్నట్లు తెలిసింది. ఎలాగైనా తమ వారికే ఫీల్డు అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పించుకోవాలంటే శాంతరాజ్‌ను తప్పించాలనే లక్ష్యంతోనే ప్రత్యర్థులను ఉసి గొల్పి ఈ దారుణానికి తెగబడినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా శాంతరాజ్ కదిలికలను గమనిస్తూ వచ్చిన ప్రత్యర్థులు చిన్న వివాదాన్ని సాకుగా పెట్టుకొని పట్టుడు కట్టెలు, వేటకొడవళ్లతో దాడి చేసి అంతమొందించారు.
 
భయం భయంగా ఫీల్డు అసిస్టెంట్‌లు..
చిరుద్యోగం ఉందన్న భరోసాతో జీవనం సాగిస్తున్న ఫీల్డు అసిస్టెంట్లు జరిగిన దారుణాన్ని చూసి హడలెత్తిపోతున్నారు. ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బతకొచ్చు..అకారణంగా హత్యలు చేయడమేంటని ఫీల్డు అసిస్టెంట్లు కలవర పడుతున్నారు. 1080 జీవో మేరకు సస్పెండ్ చేసే నిబంధనలు లేకున్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో సస్పెండ్ చేయడం అన్యాయమని ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరెడ్డి అన్నారు. ఉపాధి హామీ సిబ్బందికి భద్రత కల్పించాలని మండల పరిషత్ కార్యాలయం ఎదుట వీరు బుధవారం నిరసన తెలిపారు. కాగా.. ఎస్పీ రవికృష్ణ బుధవారం కొత్తబురుజు గ్రామానికి వెళ్లి ఇరువర్గాల వారితో మాట్లాడారు. ఘర్షణలకు దిగితే గ్రామ బహిష్కరణ ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement