పీలేరు రూరల్ : సన్న, చిన్నకారు రైతులకు ఆదాయ మార్గాలను సమకూర్చడం... జీవనోపాధులకు భద్రత కల్పించడం.. ఉత్పాదక ఆస్తులను పెంపొందిండం.. కరువుపీడత ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షన, శాశ్వత ప్రాతిపదిక భూ అభివృద్ధి, భూసార రక్షణ లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన పండ్ల తోటల పెంపకం అన్నమయ్య జిల్లాలో లక్ష్యాన్ని అధిగమించింది.
2023–24 ఆర్థిక సంవత్సరానికి గానూ మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా 2735 మంది రైతులకు లబ్ధి కలిగింది. జిల్లాలో 5050 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం లక్ష్యం కాగా 5266 ఎకరాల్లో సాగు చేసి లక్ష్యాన్ని అధిగమించినట్లు డ్వామా పీడీ ఎంసీ మద్దిలేటి తెలిపారు. లబ్ధిదారులు ఇప్పటికే 85 శాతం మొక్కలు నాటడం పూర్తయిందని, వర్షాలు కురిస్తే వందశాతం పూర్తి చేస్తామని చెప్పారు.
ప్రభుత్వం ద్వారా సహకారం...
ఎంపిక చేసిన రైతులకు పండ్లతోటల పెంపకం, 3 సంవత్సరాల వరకు వంద శాతం నిర్వహణ వ్యయం ప్రభుత్వం చెల్లిస్తుంది. భూమి దున్నేందుకు, గుంతలు తీసేందుకు, ముళ్ల కంచెల ఏర్పాటుకు, సేంద్రియ, రసాయన ఎరువులు, సస్యరక్షణ మందులకు, పాదుల్లో కలుపు తీసేందుకు, అంతర్‌పంటలకు, 30 శాతం డ్రిప్ పరికరాల ఏర్పాటుకు, మామిడి తోటల పెంపకానికి ఏడాదికి 20 పర్యాయములు నీరు పోయుటకు బిల్లులు మంజూరు అవుతాయి.
పండ్ల తోటల పెంపకానికి ఎకరాకు నిర్వహణ ఖర్చు...
మామిడికి రూ. 10,31,193, చీని రూ. 1,07,459, నిమ్మ రూ. 1,41,515, జామ రూ. 1,27,451, తైవాన్ జామ, రూ. 2,26,783, సపోట రూ. 90,027, కొబ్బరి రూ. 90,610, సీతాఫలం రూ. 59,217, సీతాఫలం (బ్లాక్) రూ. 1,82,840, దానిమ్మ రూ. 2,44,819, నేరేడు రూ. 41,292, చింత రూ. 66,500, ఆపిల్‌రేగు రూ. 1,08,338, 5 లేయర్స్ బహళ పంట రూ. 1,64,863, డ్రాగన్ ఫ్రూట్ రూ. 1,84,533, గులాబీ పూల తోట రూ. 10,795, మల్లెపూట తోట రూ. రూ. 10,295 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది.
85 శాతం మొక్కలు నాటడం పూర్తి...
ఈ ఆర్థిక సంవత్సర పండ్ల తోటల పెంపకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 85 శాతం మొక్కలు నాటడం పూర్తి చేశాం. వర్షాభావ పరిస్థితులతో ఇంకా కొన్ని ప్రాంతాల్లో పూర్తి కాలేదు. వర్షాలు కురిస్తే వందశాతం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. లబ్ధిదారులకు బిల్లులు పెండింగ్ లేకుండా చెల్లించడం జరుగుతోంది.
– ఎం.సి. మద్దిలేటి, డ్వామా పీడీ.
వందశాతం రాయితీ లభిస్తోంది...
ఉపాధి హామీ పథకంలో 16 రకాల పండ్ల తోటలు సాగు చేసుకోవడానికి రైతులకు వందశాతం రాయితీ లభిస్తోంది. వివిధ రకాల పండ్ల తోటల తోపాటు పూల తోటలు పెంపకాన్ని ప్రోత్సహిస్తూ సకాలంలో బిల్లులు ఇస్తున్నాం. అంతర్‌పంటలకు కూడా బిల్లులు ఇవ్వడం జరుగుతోంది. గట్లపై టేకు, ఎర్రచందనం లాంటి మొక్కలు నాటుకోవడానికి బిల్లులు మంజూరవుతున్నాయి. – ఎస్. మధుబాబు, ఏపీడీ, కలికిరి
ఉపాధి హామీతో ఎంతో ప్రయోజనం...
ఉపాధి హామీ పథకంతో ఎంతో ప్రయోజనం పొందాం. ఆర్థిక స్థోమత లేక నాకున్న పొలం మొత్తం ఖాళీగా పెట్టుకున్నాం. అయితే ఉపాధి హామీ పథకంతో నా రెండు ఎకరాల్లో 150 మామిడి మొక్కలు నాటా. అందుకు సంబంధించి బిల్లులు మొత్తం నా ఖాతాకు జమ అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది.
– బి.డి. సిద్ధారెడ్డి, రైతు రామిరెడ్డిగారిపల్లె, పీలేరు మండలం.
బిల్లులు చెల్లించారు
ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటలు సాగు చేసుకోవడానికి బిల్లులు అందించడం తోపాటు అధికారులు సలహాలు కూడా ఇస్తున్నారు. రెండు ఎకరాల పొలంలో మామిడి మొక్కలు నాటా. ఇప్పటి వరకు బిల్లులు పెండింగ్ లేకుండా చెల్లించారు. మా లాంటి పేద వారికి ప్రభుత్వం ఎంతో మేలు చేసింది.
– జి. శ్రీధర్‌నాయుడు, భయ్యారెడ్డిగారిపల్లె, పీలేరు మంలం.
Comments
Please login to add a commentAdd a comment