పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ‘ఆసరా’
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
సాక్షి, హైదరాబాద్: ‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.200 పింఛన్ రావాలంటే ఇంకొకరి చావుకోసం ఎదురు చూడాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చాక మా ప్రభుత్వ హయాంలో చిన్నచిన్న అవసరాలకు ఎవర్నీ దేహీ అనకుండా ‘ఆసరా’పథకం నిరుపేద వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. మొత్తంగా మూడేళ్ల కేసీఆర్ పాలన తెలంగాణ ప్రజల్లో విశ్వాసాన్ని నింపింది’అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గత మూడేళ్లలో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. 17ఏళ్ల తన రాజకీయ జీవితం 14ఏళ్ల పాటు అసంతృప్తితోనే గడిచిందని, గత మూడేళ్ల పాలనలోనే ఎంతో సంతోషంగా ఉందని మంత్రి అన్నారు. ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టడమే ఇందుకు కారణమని చెప్పారు. ఉద్యమకారుడు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో, నాడు చెప్పిన ప్రతి మాటను ఆచరణలో చూపి, చేతలకు, మాటలకు బేధం లేదని చెప్పగలిగామన్నారు.
రూ.3,775 కోట్లతో గ్రామీణ రహదారులు
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రూ.3,775 కోట్లతో గ్రామీణ రహదారులకు శ్రీకారం చుట్టిందని, గత మూడేళ్లలో 18,169 రహదారి పనులను పూర్తి చేశామని మంత్రి జూపల్లి తెలిపారు. మిగిలిపోయిన రహదారులను కూడా వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేస్తామన్నారు. దాదాపు 37లక్షలమందికి ఆసరా పథకం కింద నెలకు రూ.వెయ్యి చొప్పున అందజేస్తున్నామని, ఇందులో భాగంగా ఈ నెల 4 (ఆదివారం) నుంచి 1.08 లక్షలమంది ఒంటరి మహిళలకు ఆర్థికభృతిని అందించనున్నామని మంత్రి చెప్పారు. సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఉపాధిహామీ పథకం ద్వారా పేదవర్గాలకు ఏటా రూ.2,500 కోట్ల మేరకు పనులను కల్పిస్తూ దేశంలోనే నంబర్‌వన్‌గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. 2018 అక్టోబర్ 2 నాటికి స్వచ్ఛ తెలంగాణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ మరుగుదొడ్ల నిర్మాణం ఉపాధిహామీ పథకం కిందనే చేపట్టామన్నారు.