విపక్షాలకు మంత్రి జూపల్లి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగం సమస్యలపై అసెంబ్లీలో జరగాల్సినంత చర్చ జరిగిందని, మరి ఎవరికోసం భరోసా యాత్ర చేపడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. అరవై ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీల పాలనలో రైతులకు జరిగిన మేలు కంటే 15 నెలల టీఆర్‌ఎస్ పాలనలో ఎక్కువే చేశామన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రణాళికలతో వారి పునాదులు కదులుతుంటే కేవలం ఉనికి కోసమే రైతు భరోసా యాత్ర చేస్తామని ప్రకటించారని, ప్రతిపక్షాలకు కనీసం సిగ్గూ శరం లేవని మండిపడ్డారు.
జూరాల ప్రాజెక్టు కట్టడానికి వారికి పాతికేళ్లు పట్టిందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సర్వే చేయలేక పోయారని, సర్వే కోసం రూ.7 కోట్లు ఇవ్వడానికి ఇరవై ఏళ్లు పట్టిందని జూపల్లి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో యువతీ యువకుల ఆత్మహత్యలు జరిగినప్పుడు ఎందుకు భరోసా యాత్రలు చేపట్టలేదని నిలదీశారు. నాగం చేపట్టింది కిసాన్ బచావో యాత్రకాదని, నాగం బచావో యాత్రని ఎద్దేవాచేశారు. ప్రతిపక్షాల చర్యలకు కచ్చితంగా తమ ప్రతిచర్యలు ఉంటాయని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.
మీ భరోసా ఎవరి కోసం?
Published Tue, Oct 6 2015 1:48 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
Advertisement