MLA srinivasgaud
-
సీఎం ఆదేశించినా పట్టదా..
కార్పొరేట్ ఆస్పత్రులపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఫైర్ సాక్షి, ఖమ్మం: ‘హెల్త్‌కార్డులుండీ.. వైద్యం కోసం వచ్చే ఉద్యోగులు, జర్నలిస్టు కుటుంబాలను రాజధానిలోని 9 కార్పొరేట్ ఆస్పత్రులు అడ్మిట్ చేసుకోకుండా నానుస్తున్నాయని, ఇలా చేస్తే వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారని, సీఎం స్వయంగా ఆదేశించినా.. ఇంత జాప్యమా.. తెలంగాణలో ఇది కుదరదు.’ అని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ హెచ్చరించారు. బుధవారం ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ వైద్యాన్ని వ్యాపారంగా చేశారని, ఉద్యోగుల కుటుంబాలతో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. సదరు కార్పొరేట్ ఆస్పత్రులకు 15రోజులు గడువిస్తున్నామని, ఆ తర్వాత చర్యలకు వెనుకాడమన్నారు. గత ప్రభుత్వాలు అపోలో ఆస్పత్రికి రూ.వేలకే రాజధాని నడిబొడ్డున కోట్ల విలువ చేసే భూమిని ఇచ్చాయని, ఉద్యోగులకు వైద్యం అందించాల్సిన విషయంలో చొరవ చూపించాల్సిన బాధ్యత మీది కాదా..? అని ప్రశ్నించారు. -
సీఎంపై అభాండాలు తగవు: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: కొత్త కొత్త సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై అభాండాలు వేస్తున్నారని విపక్షాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది చావులకు కారణమైన వారు ఈ రోజు ఎక్స్‌గ్రేషియా గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లకు కేసీఆర్ వెళ్లి ఒప్పందాలు కుదుర్చుకుంటే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. -
సంఘటితమైతేనే సమస్యల పరిష్కారం
♦ ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయం ♦ 4న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వస్తే తమ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భావించామని, కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి ఓ ప్రత్యేక వేదికగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యోగ జేఏసీ పునర్నిర్మాణం కావాలన్నారు. నాంపల్లి టీజీఓ భవన్లో బుధవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత అధ్యక్షతన జరిగిన సమావేశంలో 58 ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 4న ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని తీర్మానించారు. ఒకే వేదికపైకి రావాలి... సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... ‘ఉద్యోగ సంఘాల్లో ఒకప్పుడు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు. సంఘాలన్నీ విడివిడిగా ప్రభుత్వం వద్దకు వెళ్లి వినతులు అందజేస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల పట్ల చులకన భావనతో ఉంది. ఈ తరుణంలో ఉద్యోగ సంఘాల నాయకులందరూ ఒకే వేదికపైకి వచ్చి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’ అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి నారాయణ మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడేలా ఉన్నాయి. సమస్యలు పరిష్కారం కాకున్నా ప్రజల్లో మాత్రం ఉద్యోగులకు ఏవేవో జరిగిపోయాయనే సందేశం వెళ్లింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇందుకు ఉద్యోగ జేఏసీ పునర్నిర్మాణం జరగాలి. ఇప్పటివరకు జేఏసీ చైర్మన్‌గా కారం రవీందర్‌రెడ్డి ఉన్నారని భావిస్తున్నారు. కానీ ఆయన్ను ఏ సభలోనూ చైర్మన్‌గా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో జేఏసీ చైర్మన్‌ను తక్షణమే ఎన్నుకోవాలి’ అన్నారు. మమత మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి ఏడాదన్నరయినా ఇప్పటి వరకు ఉద్యోగుల విభజన పూర్తి కాలేదన్నారు. హెల్త్ కార్డుల అమలు అగమ్యగోచరంగా ఉందన్నారు. సకల జనుల సమ్మె కాలాన్ని వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, టీఆర్టీయూ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి, టీఆర్టీఎఫ్ నాయకుడు మల్లయ్య పాల్గొన్నారు. -
మంత్రి పదవి వస్తుందనే అక్కసుతోనే..
♦ కొందరు నాపై పనిగట్టుకుని దుష్ర్పచారం చేస్తున్నారు: శ్రీనివాస్‌గౌడ్ ♦ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వసూళ్లు అవసరం లేదు ♦ గీత వృత్తిపై కక్షగట్టిన వారి బండారం బయటపెడతాం ♦ ముడుపుల వ్యవహారాన్ని గౌడ సమ్మేళనాల్లో తేలుస్తాం సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గంలో తనకు స్థానం లభిస్తుందనే అక్కసుతోనే కొందరు పనిగట్టుకుని మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కల్లుగీత వృత్తిపై కొందరు కక్షగట్టారని, వారి బండారం బయటపెడతామని చెప్పారు. కల్లుకు అండగా రాజకీయ నేత అంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఈనెల 27న మహబూబ్‌నగర్‌లో ఆ తర్వాత హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో గౌడ సమ్మేళనాలు నిర్వహిస్తామని, కల్లుగీత వృత్తిపై కక్షగట్టిన వారి బండారం బయటపెడతామని పేర్కొన్నారు. జిల్లాల వారీగా జరిగే సమ్మేళనాల్లో గతంలో ఎవరికి ముడుపులు ఇచ్చారో, ప్రస్తుతం ఎవరికి ఇస్తున్నారో చెప్పాలని వారిని కోరుతామని చెప్పారు. చాలా చోట్ల మామూళ్లు తీసుకుని కొందరు కల్తీ దందా చేస్తున్నందునే అరికట్టాలని కోరుతున్నామన్నారు. ఎవరో చేసిన తప్పులకు అందరినీ బాధ్యులను చేయడం సరికాదని... ఒక వర్గాన్ని అణచివేసేందుకు, వృత్తిని అగౌరవ పరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో కల్తీ కల్లును ప్రోత్సహించడం ద్వారా గత ప్రభుత్వాలు గీత కార్మికుల పొట్టకొట్టి, ద్రోహం చేశాయన్నారు. గత పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో ఈత, తాటి చెట్ల పెంపకంపై దృష్టి సారించకుండా కల్తీ కల్లు విక్రయాలను ప్రోత్సహించారని.. కల్తీ కల్లును కుటీర పరిశ్రమగా మార్చి డబ్బు దండుకున్నారని ఆరోపించారు. కల్లు గీత వృత్తికి పూర్వ వైభవం తెచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని.. ఈత చెట్ల పెంపకానికి ఐదేసి ఎకరాల భూమి కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ప్రమాదవశాత్తూ చెట్టు మీద నుంచి పడి చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించదని.. పరిహారం చెల్లింపునకు రూ. 10 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారనే ఉద్దేశంతోనే కల్తీ సారా నిరోధానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని.. కొందరు అధికారులు అత్యుత్సాహం చూపుతూ కల్తీకల్లు పేరిట గీత వృత్తిదారులపై దాడులు చేస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కల్తీకల్లు తాగడం వల్ల ఎవరూ చనిపోరని ఆయన వ్యాఖ్యానించారు. కల్లు గీత వృత్తికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఎండగడతామన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకుడు గట్టు రాంచందర్‌రావు పాల్గొన్నారు. -
మీ భరోసా ఎవరి కోసం?
విపక్షాలకు మంత్రి జూపల్లి ప్రశ్న సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతాంగం సమస్యలపై అసెంబ్లీలో జరగాల్సినంత చర్చ జరిగిందని, మరి ఎవరికోసం భరోసా యాత్ర చేపడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. అరవై ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీల పాలనలో రైతులకు జరిగిన మేలు కంటే 15 నెలల టీఆర్ఎస్ పాలనలో ఎక్కువే చేశామన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రణాళికలతో వారి పునాదులు కదులుతుంటే కేవలం ఉనికి కోసమే రైతు భరోసా యాత్ర చేస్తామని ప్రకటించారని, ప్రతిపక్షాలకు కనీసం సిగ్గూ శరం లేవని మండిపడ్డారు. జూరాల ప్రాజెక్టు కట్టడానికి వారికి పాతికేళ్లు పట్టిందని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సర్వే చేయలేక పోయారని, సర్వే కోసం రూ.7 కోట్లు ఇవ్వడానికి ఇరవై ఏళ్లు పట్టిందని జూపల్లి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో యువతీ యువకుల ఆత్మహత్యలు జరిగినప్పుడు ఎందుకు భరోసా యాత్రలు చేపట్టలేదని నిలదీశారు. నాగం చేపట్టింది కిసాన్ బచావో యాత్రకాదని, నాగం బచావో యాత్రని ఎద్దేవాచేశారు. ప్రతిపక్షాల చర్యలకు కచ్చితంగా తమ ప్రతిచర్యలు ఉంటాయని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.