మంత్రి పదవి వస్తుందనే అక్కసుతోనే..
♦ కొందరు నాపై పనిగట్టుకుని దుష్ర్పచారం చేస్తున్నారు: శ్రీనివాస్‌గౌడ్
♦ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు వసూళ్లు అవసరం లేదు
♦ గీత వృత్తిపై కక్షగట్టిన వారి బండారం బయటపెడతాం
♦ ముడుపుల వ్యవహారాన్ని గౌడ సమ్మేళనాల్లో తేలుస్తాం
సాక్షి, హైదరాబాద్: మంత్రివర్గంలో తనకు స్థానం లభిస్తుందనే అక్కసుతోనే కొందరు పనిగట్టుకుని మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కల్లుగీత వృత్తిపై కొందరు కక్షగట్టారని, వారి బండారం బయటపెడతామని చెప్పారు. కల్లుకు అండగా రాజకీయ నేత అంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఈనెల 27న మహబూబ్‌నగర్‌లో ఆ తర్వాత హైదరాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో గౌడ సమ్మేళనాలు నిర్వహిస్తామని, కల్లుగీత వృత్తిపై కక్షగట్టిన వారి బండారం బయటపెడతామని పేర్కొన్నారు. జిల్లాల వారీగా జరిగే సమ్మేళనాల్లో గతంలో ఎవరికి ముడుపులు ఇచ్చారో, ప్రస్తుతం ఎవరికి ఇస్తున్నారో చెప్పాలని వారిని కోరుతామని చెప్పారు.
చాలా చోట్ల మామూళ్లు తీసుకుని కొందరు కల్తీ దందా చేస్తున్నందునే అరికట్టాలని కోరుతున్నామన్నారు. ఎవరో చేసిన తప్పులకు అందరినీ బాధ్యులను చేయడం సరికాదని... ఒక వర్గాన్ని అణచివేసేందుకు, వృత్తిని అగౌరవ పరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో కల్తీ కల్లును ప్రోత్సహించడం ద్వారా గత ప్రభుత్వాలు గీత కార్మికుల పొట్టకొట్టి, ద్రోహం చేశాయన్నారు. గత పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడంతో ఈత, తాటి చెట్ల పెంపకంపై దృష్టి సారించకుండా కల్తీ కల్లు విక్రయాలను ప్రోత్సహించారని.. కల్తీ కల్లును కుటీర పరిశ్రమగా మార్చి డబ్బు దండుకున్నారని ఆరోపించారు.
కల్లు గీత వృత్తికి పూర్వ వైభవం తెచ్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదని.. ఈత చెట్ల పెంపకానికి ఐదేసి ఎకరాల భూమి కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ప్రమాదవశాత్తూ చెట్టు మీద నుంచి పడి చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించదని.. పరిహారం చెల్లింపునకు రూ. 10 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు.
ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారనే ఉద్దేశంతోనే కల్తీ సారా నిరోధానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని.. కొందరు అధికారులు అత్యుత్సాహం చూపుతూ కల్తీకల్లు పేరిట గీత వృత్తిదారులపై దాడులు చేస్తున్నారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కల్తీకల్లు తాగడం వల్ల ఎవరూ చనిపోరని ఆయన వ్యాఖ్యానించారు. కల్లు గీత వృత్తికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఎండగడతామన్నారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకుడు గట్టు రాంచందర్‌రావు పాల్గొన్నారు.