సంఘటితమైతేనే సమస్యల పరిష్కారం
♦ ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయం
♦ 4న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వస్తే తమ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భావించామని, కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి ఓ ప్రత్యేక వేదికగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యోగ జేఏసీ పునర్‌నిర్మాణం కావాలన్నారు. నాంపల్లి టీజీఓ భవన్‌లో బుధవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత అధ్యక్షతన జరిగిన సమావేశంలో 58 ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 4న ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని తీర్మానించారు.
ఒకే వేదికపైకి రావాలి...
సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... ‘ఉద్యోగ సంఘాల్లో ఒకప్పుడు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు. సంఘాలన్నీ విడివిడిగా ప్రభుత్వం వద్దకు వెళ్లి వినతులు అందజేస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల పట్ల చులకన భావనతో ఉంది. ఈ తరుణంలో ఉద్యోగ సంఘాల నాయకులందరూ ఒకే వేదికపైకి వచ్చి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’ అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి నారాయణ మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడేలా ఉన్నాయి. సమస్యలు పరిష్కారం కాకున్నా ప్రజల్లో మాత్రం ఉద్యోగులకు ఏవేవో జరిగిపోయాయనే సందేశం వెళ్లింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇందుకు ఉద్యోగ జేఏసీ పునర్‌నిర్మాణం జరగాలి. ఇప్పటివరకు జేఏసీ చైర్మన్‌గా కారం రవీందర్‌రెడ్డి ఉన్నారని భావిస్తున్నారు. కానీ ఆయన్ను ఏ సభలోనూ చైర్మన్‌గా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో జేఏసీ చైర్మన్‌ను తక్షణమే ఎన్నుకోవాలి’ అన్నారు. మమత మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి ఏడాదన్నరయినా ఇప్పటి వరకు ఉద్యోగుల విభజన పూర్తి కాలేదన్నారు.
హెల్త్ కార్డుల అమలు అగమ్యగోచరంగా ఉందన్నారు. సకల జనుల సమ్మె కాలాన్ని వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, టీఆర్‌టీయూ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి, టీఆర్‌టీఎఫ్ నాయకుడు మల్లయ్య పాల్గొన్నారు.