Telangana Gazetted Officers Association
-
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసొసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసొసియేషన్ ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాల్లో జిల్లా అకౌంట్స్ అధికారులతో పాటు అన్ని శాఖల్లోని మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. తమ ప్రతిభను చాటేలా వినూత్నంగా వివిధ ప్రదర్శనలు ఇచ్చారు. కొందరు డాన్స్‌తో అలరిస్తే.. మరికొందరు పాటలు పాడారు. మహిళలు అన్నింటా సమానమని చాటి చెప్పేలా తమ పాఠవాలను ప్రదర్శించారు. మిగతా కార్యక్రమాలల్లోనూ చురుగ్గా పాల్గొని ఎంజాయ్ చేశారు. తెలంగాణ గెజిటెడ్ అసొసియేషన్ ప్రతినిధి దీపారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా జాయింట్ డైరెక్టర్ రజిని, శైలజా రాణి, చీఫ్ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ గీతా చౌదరీ తదితరులు హాజరయ్యారు. -
టీజీవో అధ్యక్ష, కార్యదర్శులుగా మమత, సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (టీజీవో) నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.మమత, ఎ.సత్యనారాయణ మరోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని సంఘం కార్యాలయంలో మంగళవారం జరిగిన టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారిని మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో వారు 2022 వరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతారు. సంఘం అధ్యక్షురాలు మమత అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యలు, ఇతర అంశాలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. సంఘం చైర్మన్, వ్యవస్థాపక అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్‌కు తెలంగాణ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సంఘం ధన్యవాదాలు తెలిపింది. రాష్ట్రంలోని 31 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సచివాలయం, హైదరాబాద్ సిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సంఘం అనుబంధ శాఖల (54) ఫోరమ్‌ల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యతను కేంద్ర సంఘానికి అప్పగిస్తూ తీర్మానించారు. అలాగే కేంద్ర సంఘం మిగతా కార్యవర్గాన్ని నియమించే అధికారం, అనుబంధ సంఘాలకు నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించే అధికారాన్ని కేంద్ర సంఘానికి అప్పగించారు. ఉద్యోగాలను పణంగా పెట్టారు టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం చైర్మన్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు తమ ఉద్యోగాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని గుర్తు చేశారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా ఏర్పడిన టీజీవో ముందుడి పోరాటం చేసిందన్నారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయడంలో, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి మేలు చేకూర్చడంలో సంఘం ముందుందని తెలిపారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రథ«మ ప్రాధాన్యం ఇస్తోందని, ఉద్యోగుల అవసరాలు, సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన కేసీఆర్ సరైన సమయంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారన్నారు. -
ఉన్నతాధికారిగా తెలంగాణ వాళ్లే ఉండాలి
► ఆంధ్రా ఉద్యోగులను ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించాలి ► తెలంగాణ గెజిటెడ్ అధికారుల సమావేశంలో తీర్మానించిన నేతలు ► త్వరలో ప్రభుత్వానికి నివేదిస్తాం: ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారి బాధ్యతలు తెలంగాణ అధికారులకే కట్టబెట్టాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం తీర్మానిం చింది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రా అధికారులను ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలసి వివరించనున్నట్లు పేర్కొంది. శనివారం టీజీవో భవన్లో తెలంగాణ గెజిటెడ్ అధికారుల కార్యవర్గ సమావేశం జరిగింది. టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు మమత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రభుత్వ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, ఈ క్రమంలో పదోన్నతుల్లోనూ వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయడం మంచిదేనని, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కేడర్లుగా ఏర్పాటు చేయడం ఉద్యోగులకు ప్రయోజ నకరమని చెప్పారు. అయితే నియామకాల విషయంలో స్థానికులకు 90 శాతం అవకాశాలు ఇవ్వాలన్నారు. ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాలో అక్షరాస్యత తక్కువని, దాంతో అక్కడి అభ్యర్థులు అక్షరాస్యతలో ముందువరుసలో ఉన్న జిల్లా అభ్యర్థులతో పోటీ పడలేరని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని నియామకాలన్నీ జిల్లా స్థాయి లోనే 90 శాతం స్థానికులతో చేపట్టాలన్నారు. పోస్టిం గ్ విషయంలో మాత్రం రాష్ట్ర క్యాడర్‌ను పరిగణించి ఇవ్వొచ్చన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉద్యో గులపై పనిభారం పెరిగిందన్నారు. అదేవిధంగా పదవీ విరమణతో ఖాళీలు పెరిగాయని, ఈ క్రమంలో అర్హులైన ఉద్యోగులం దరికీ పదోన్నతులు ఇచ్చి.. ఖాళీలను భర్తీ చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పదవీ కాలాన్ని పెంచొద్దని కోరారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో తీర్మానాలు చేశామని, వీటిని త్వరలో ప్రభుత్వానికి నివేదిస్తామని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. -
ఆంధ్రాలో ఉన్న ఉద్యోగులను రప్పించండి
* సీఎస్ రాజీవ్‌శర్మకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వినతి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి వచ్చే విధంగా చూడాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రతినిధులు సీఎస్ రాజీవ్‌శర్మకు గురువారం వినతిపత్రం సమర్పిం చారు. అలాగే తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను వెంటనే వారి రాష్ట్రానికే పంపించాలని, స్టేట్ కేడర్‌లోని పోలీసు అధికారులలో తెలంగాణ వారిని ఇక్కడే ఉంచి, ఆంధ్రా వారిని అక్కడికే పంపాలని కోరారు. సీఎస్‌ను కలిసిన వారిలో ఆ సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, సంఘం నేతలు సత్యనారాయణ, మధుసూదన్‌గౌడ్, కృష్ణ యాదవ్, జి.వెంకటేశ్వర్లు, ఓం ప్రకాష్ ఉన్నారు. -
సంఘటితమైతేనే సమస్యల పరిష్కారం
♦ ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయం ♦ 4న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వస్తే తమ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భావించామని, కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి ఓ ప్రత్యేక వేదికగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యోగ జేఏసీ పునర్నిర్మాణం కావాలన్నారు. నాంపల్లి టీజీఓ భవన్లో బుధవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత అధ్యక్షతన జరిగిన సమావేశంలో 58 ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 4న ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని తీర్మానించారు. ఒకే వేదికపైకి రావాలి... సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... ‘ఉద్యోగ సంఘాల్లో ఒకప్పుడు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు. సంఘాలన్నీ విడివిడిగా ప్రభుత్వం వద్దకు వెళ్లి వినతులు అందజేస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల పట్ల చులకన భావనతో ఉంది. ఈ తరుణంలో ఉద్యోగ సంఘాల నాయకులందరూ ఒకే వేదికపైకి వచ్చి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’ అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి నారాయణ మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడేలా ఉన్నాయి. సమస్యలు పరిష్కారం కాకున్నా ప్రజల్లో మాత్రం ఉద్యోగులకు ఏవేవో జరిగిపోయాయనే సందేశం వెళ్లింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇందుకు ఉద్యోగ జేఏసీ పునర్నిర్మాణం జరగాలి. ఇప్పటివరకు జేఏసీ చైర్మన్‌గా కారం రవీందర్‌రెడ్డి ఉన్నారని భావిస్తున్నారు. కానీ ఆయన్ను ఏ సభలోనూ చైర్మన్‌గా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో జేఏసీ చైర్మన్‌ను తక్షణమే ఎన్నుకోవాలి’ అన్నారు. మమత మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి ఏడాదన్నరయినా ఇప్పటి వరకు ఉద్యోగుల విభజన పూర్తి కాలేదన్నారు. హెల్త్ కార్డుల అమలు అగమ్యగోచరంగా ఉందన్నారు. సకల జనుల సమ్మె కాలాన్ని వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, టీఆర్టీయూ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి, టీఆర్టీఎఫ్ నాయకుడు మల్లయ్య పాల్గొన్నారు. -
అధికారుల పక్షపాతం సహించం: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర విభజన కీలక దశలో ఉన్న తరుణంలో కొందరు అధికారులు తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగేలా వ్యవహరిస్తున్నారని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేత శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ పదోన్నతుల విషయంలో తెలంగాణ ఉద్యోగులకు ఇప్పటికే అన్యాయం జరిగిందన్నారు. ఇప్పుడు కూడా ప్రమోషన్లు, ఖాళీల భర్తీ విషయంలో తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగేలా కొందరు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారని, ఈ వైఖరిని విడనాడాలని ఆయన హెచ్చరించారు. అర్హులైన తెలంగాణ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడంలో ఆటంకాలు కలగచేయడాన్ని సహించబోమన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఆరు ఐఏఎస్ పోస్టులను ఇక్కడి వారితోనే భర్తీ చేయాలన్నారు. -
బిల్లుల కోసం సోనియాపై ఒత్తిడి తెండి
* సర్వే, గీతారెడ్డిలను కోరిన టీజీవో నేతలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్లో పెట్టేలా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఒత్తిడి తేవాలని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి గీతారెడ్డిలను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) నాయకులు శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కోరింది. ఇందుకోసం ఈనెల 19లోపు ఢిల్లీ వెళ్లిరావాలని విన్నవించింది. సర్వే సత్యనారాయణను మహేంద్రహిల్స్‌లోని ఆయన నివాసంలో, మంత్రి గీతారెడ్డిని మారేడ్‌పల్లిలోని ఆమె నివాసంలో గురువారం కలిసిన టీజీవో బృందం ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్ర పక్రియ వేగవంతమవుతోందని, పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని గీతారెడ్డి చెప్పారు. తెలంగాణపై ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో సీమాంధ్రుల కుట్రలను తిప్పికొడతామని చెప్పారు. సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. 2013లోనే తెలంగాణ ఏర్పడుతుందని చెప్పారు. బిల్లు ఆమోదానికి తన వంతు కృషి చేస్తానన్నారు. హైదరాబాద్‌లో ఉన్నవారంతా మావారే.. హైదరాబాద్‌లో ఉన్నవారంతా తమవారేనని, ఎవరూ ఎక్కడికీ పోనక్కర్లేదని, తాము రక్షణగా ఉంటామని టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. సర్వే నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు సీమాంధ్ర రాజకీయ బ్రోకర్లు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా వారిలో భయాందోళనలు కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా తెలంగాణ బిల్లును ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోకానీ లేదా శీతాకాల సమావేశాల్లోకానీ ఆమోదించేలా చర్యలు చేపట్టాలని సర్వేను ఆయన కోరారు.