* సర్వే, గీతారెడ్డిలను కోరిన టీజీవో నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్‌లో పెట్టేలా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఒత్తిడి తేవాలని కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, రాష్ట్ర మంత్రి గీతారెడ్డిలను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) నాయకులు శ్రీనివాసగౌడ్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం కోరింది. ఇందుకోసం ఈనెల 19లోపు ఢిల్లీ వెళ్లిరావాలని విన్నవించింది. సర్వే సత్యనారాయణను మహేంద్రహిల్స్‌లోని ఆయన నివాసంలో, మంత్రి గీతారెడ్డిని మారేడ్‌పల్లిలోని ఆమె నివాసంలో గురువారం కలిసిన టీజీవో బృందం ఈ మేరకు విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ రాష్ట్ర పక్రియ వేగవంతమవుతోందని, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని గీతారెడ్డి చెప్పారు. తెలంగాణపై ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో సీమాంధ్రుల కుట్రలను తిప్పికొడతామని చెప్పారు. సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. 2013లోనే తెలంగాణ ఏర్పడుతుందని చెప్పారు. బిల్లు ఆమోదానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
హైదరాబాద్‌లో ఉన్నవారంతా మావారే..
హైదరాబాద్‌లో ఉన్నవారంతా తమవారేనని, ఎవరూ ఎక్కడికీ పోనక్కర్లేదని, తాము రక్షణగా ఉంటామని టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. సర్వే నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు సీమాంధ్ర రాజకీయ బ్రోకర్లు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా వారిలో భయాందోళనలు కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా తెలంగాణ బిల్లును ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోకానీ లేదా శీతాకాల సమావేశాల్లోకానీ ఆమోదించేలా చర్యలు చేపట్టాలని సర్వేను ఆయన కోరారు.
బిల్లుల కోసం సోనియాపై ఒత్తిడి తెండి
Published Fri, Sep 13 2013 2:16 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement