సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (టీజీవో) నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.మమత, ఎ.సత్యనారాయణ మరోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని సంఘం కార్యాలయంలో మంగళవారం జరిగిన టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారిని మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో వారు 2022 వరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతారు. సంఘం అధ్యక్షురాలు మమత అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యలు, ఇతర అంశాలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు.
సంఘం చైర్మన్, వ్యవస్థాపక అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్‌కు తెలంగాణ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సంఘం ధన్యవాదాలు తెలిపింది. రాష్ట్రంలోని 31 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సచివాలయం, హైదరాబాద్ సిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సంఘం అనుబంధ శాఖల (54) ఫోరమ్‌ల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యతను కేంద్ర సంఘానికి అప్పగిస్తూ తీర్మానించారు. అలాగే కేంద్ర సంఘం మిగతా కార్యవర్గాన్ని నియమించే అధికారం, అనుబంధ సంఘాలకు నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించే అధికారాన్ని కేంద్ర సంఘానికి అప్పగించారు.
ఉద్యోగాలను పణంగా పెట్టారు
టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం చైర్మన్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు తమ ఉద్యోగాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని గుర్తు చేశారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా ఏర్పడిన టీజీవో ముందుడి పోరాటం చేసిందన్నారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయడంలో, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి మేలు చేకూర్చడంలో సంఘం ముందుందని తెలిపారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రథ«మ ప్రాధాన్యం ఇస్తోందని, ఉద్యోగుల అవసరాలు, సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన కేసీఆర్ సరైన సమయంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment