ఇటీవల మరణించిన కార్యకర్తలకు కార్యవర్గ సమావేశంలో నివాళులర్పిస్తున్న బీజేపీ నేతలు. చిత్రంలో సునీల్ బన్సల్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ మార్క్ రాజకీయాలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు రాష్ట్ర పార్టీ సన్నద్ధం కావాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జి సునీల్‌బన్సల్ పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపించే కొద్దీ కేసీఆర్ తనదైన పద్ధతుల్లో బీజేపీని జాతీయ, రాష్ట్రస్థాయిల్లో ఇరుకున పెట్టేందుకు చేసే ప్రయత్నాలను నీరుగార్చాలని సూచించారు. వచ్చే నెల 10 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలో నిర్వహించనున్న 9 వేల వీధి సమావేశాల (స్ట్రీట్‌కార్నర్ మీటింగ్స్)ను విజయవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో సునీల్ బన్సల్ మాట్లాడారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు జాతీయ నాయకత్వం నిర్దేశించిన కార్యక్రమాలన్నింటినీ తు.చ. తప్పకుండా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అంతకుముందు మాట్లాడిన నేతలంతా కేసీఆర్ రాజకీయాలు చేస్తారని ప్రస్తావించగా, బీజేపీ కూడా రాజకీయ పార్టీయేనని కేసీఆర్‌కు తగ్గట్టుగా మన వ్యూహాలు ఉండాలని చెప్పారు.
అవిశ్రాంత పోరాటం.. బీజేపీ తీర్మానం
కేసీఆర్ సర్కార్ అవినీతి, అరాచకపాలనపై బీజేపీ అవిశ్రాంత పోరాటం చేస్తుందని రాష్ట్ర కార్యవర్గం స్పష్టంచేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర, ప్రజాగోస–బీజేపీ భరోసా వంటి కార్యక్రమాలతో బీఆర్‌ఎస్‌పై జరిపే పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచి్చంది. అన్ని రంగాల్లో విఫలమైన బీఆర్‌ఎస్ సర్కార్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేలా బీజేపీని గెలిపించాలని కోరింది. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్‌ఎస్ తెలంగాణవాదాన్ని విడిచిపెట్టి బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిందని పేర్కొంది. ప్రజాక్షేత్రంలో తమ వైఫల్యాలు చర్చకు రాకుండా చేసేందుకు కేసీఆర్ రాజకీయ కుట్రకు తెరలేపారని బీజేపీ మండిపడింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టినట్టుగా చెప్పుకునే పార్టీ పేరులోంచి తెలంగాణ పదాన్ని తొలగించి ప్రజలను దారుణంగా వంచించిందని ధ్వజమెత్తింది. జీహెచ్‌ఎంసీ, పౌరసరఫరాలు, విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టేశారని, ప్రభుత్వరంగ కార్పొరేషన్లు అప్పులతోనే నడుస్తున్నాయని ఆరోపించింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈమేరకు ప్రతిపాదించిన రాజకీయతీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ ప్రతిపాదించగా, పార్టీ నేతలు ఏపీ జితేందర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి బలపరిచారు.
కాళేశ్వరంలో అవినీతి..
కేసీఆర్ నేతృత్వంలోని అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలనతో ఎనిమిదిన్నరేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు తమ విధులు నిర్వహించకుండా ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై తప్పుడు కేసులు బనాయించే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. మహిళలపై హత్యాచారాలు పెరగడంతోపాటు ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన వెలిబుచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి ముమ్మాటికి నిజమని, ఇది బీఆర్‌ఎస్ నేతలకు ఏటీఎంగా మారిందనే ఆరోపణకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం తీరు తెన్నులపై రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.గంగిడి మనోహర్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా, ఈటల రాజేందర్, డీకే అరుణ, సంకినేని వేంకటేశ్వర రావు బలపరిచారు. స్వతంత్ర భారతంలో తొలిసారిగా జీ–20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం తెచ్చినందుకు ప్రధాని మోదీకి అభినందనలు తెలుపుతూ మరో తీర్మానం ఆమోదించారు.
బడుగు వర్గాలను మోసం చేశారు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాల ప్రజలను బీఆర్‌ఎస్ మోసం చేస్తోందని ఈ భేటీలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, డా.జి.విజయరామారావు, రవీంద్రనాయక్‌లు ఆయా వర్గాల వారీగా ప్రస్తావించారు. ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు దళితులు, బీసీలు, ఎస్టీలు గుర్తుకొస్తారని మండిపడ్డారు. హుజురాబాద్ ఎన్నికలప్పుడు ఆర్భాటంగా ప్రకటించిన దళితబంధును సరిగా అమలుచేయకుండా దళిత సమాజాన్ని వంచించారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment