Executive Meeting
-
కేసీఆర్ మార్క్ పాలిటిక్స్‌ను తిప్పికొట్టాలి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ మార్క్ రాజకీయాలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు రాష్ట్ర పార్టీ సన్నద్ధం కావాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జి సునీల్‌బన్సల్ పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపించే కొద్దీ కేసీఆర్ తనదైన పద్ధతుల్లో బీజేపీని జాతీయ, రాష్ట్రస్థాయిల్లో ఇరుకున పెట్టేందుకు చేసే ప్రయత్నాలను నీరుగార్చాలని సూచించారు. వచ్చే నెల 10 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలో నిర్వహించనున్న 9 వేల వీధి సమావేశాల (స్ట్రీట్‌కార్నర్ మీటింగ్స్)ను విజయవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసి, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో సునీల్ బన్సల్ మాట్లాడారు. పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు జాతీయ నాయకత్వం నిర్దేశించిన కార్యక్రమాలన్నింటినీ తు.చ. తప్పకుండా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అంతకుముందు మాట్లాడిన నేతలంతా కేసీఆర్ రాజకీయాలు చేస్తారని ప్రస్తావించగా, బీజేపీ కూడా రాజకీయ పార్టీయేనని కేసీఆర్‌కు తగ్గట్టుగా మన వ్యూహాలు ఉండాలని చెప్పారు. అవిశ్రాంత పోరాటం.. బీజేపీ తీర్మానం కేసీఆర్ సర్కార్ అవినీతి, అరాచకపాలనపై బీజేపీ అవిశ్రాంత పోరాటం చేస్తుందని రాష్ట్ర కార్యవర్గం స్పష్టంచేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర, ప్రజాగోస–బీజేపీ భరోసా వంటి కార్యక్రమాలతో బీఆర్ఎస్పై జరిపే పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచి్చంది. అన్ని రంగాల్లో విఫలమైన బీఆర్ఎస్ సర్కార్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేలా బీజేపీని గెలిపించాలని కోరింది. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ తెలంగాణవాదాన్ని విడిచిపెట్టి బీఆర్ఎస్గా రూపాంతరం చెందిందని పేర్కొంది. ప్రజాక్షేత్రంలో తమ వైఫల్యాలు చర్చకు రాకుండా చేసేందుకు కేసీఆర్ రాజకీయ కుట్రకు తెరలేపారని బీజేపీ మండిపడింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసమే పుట్టినట్టుగా చెప్పుకునే పార్టీ పేరులోంచి తెలంగాణ పదాన్ని తొలగించి ప్రజలను దారుణంగా వంచించిందని ధ్వజమెత్తింది. జీహెచ్ఎంసీ, పౌరసరఫరాలు, విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టేశారని, ప్రభుత్వరంగ కార్పొరేషన్లు అప్పులతోనే నడుస్తున్నాయని ఆరోపించింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈమేరకు ప్రతిపాదించిన రాజకీయతీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రతిపాదించగా, పార్టీ నేతలు ఏపీ జితేందర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి బలపరిచారు. కాళేశ్వరంలో అవినీతి.. కేసీఆర్ నేతృత్వంలోని అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలనతో ఎనిమిదిన్నరేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీసులు తమ విధులు నిర్వహించకుండా ప్రత్యర్థి రాజకీయ పార్టీలపై తప్పుడు కేసులు బనాయించే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. మహిళలపై హత్యాచారాలు పెరగడంతోపాటు ఆత్మహత్యలు పెరిగాయని ఆందోళన వెలిబుచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి ముమ్మాటికి నిజమని, ఇది బీఆర్ఎస్ నేతలకు ఏటీఎంగా మారిందనే ఆరోపణకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో వ్యవసాయరంగం తీరు తెన్నులపై రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.గంగిడి మనోహర్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా, ఈటల రాజేందర్, డీకే అరుణ, సంకినేని వేంకటేశ్వర రావు బలపరిచారు. స్వతంత్ర భారతంలో తొలిసారిగా జీ–20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం తెచ్చినందుకు ప్రధాని మోదీకి అభినందనలు తెలుపుతూ మరో తీర్మానం ఆమోదించారు. బడుగు వర్గాలను మోసం చేశారు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాల ప్రజలను బీఆర్ఎస్ మోసం చేస్తోందని ఈ భేటీలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, డా.జి.విజయరామారావు, రవీంద్రనాయక్‌లు ఆయా వర్గాల వారీగా ప్రస్తావించారు. ఉప ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు దళితులు, బీసీలు, ఎస్టీలు గుర్తుకొస్తారని మండిపడ్డారు. హుజురాబాద్ ఎన్నికలప్పుడు ఆర్భాటంగా ప్రకటించిన దళితబంధును సరిగా అమలుచేయకుండా దళిత సమాజాన్ని వంచించారని ధ్వజమెత్తారు. -
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా కొనసాగింపు?
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జగత్‌ప్రకాశ్ నడ్డాను కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు మంగళవారం వెల్లడించాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నెల 16, 17న ఢిల్లీలో జరుగనున్నాయి. ఈ ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల సన్నద్ధతపై అగ్రనేతలు సమీక్ష నిర్వహిస్తారని బీజేపీ వర్గాలు తెలియజేశాయి. ఒక రోడ్డుమ్యాప్ సైతం సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: BJP: విజయమే లక్ష్యంగా బరిలోకి.. -
AIADMK: అమ్మ పార్టీలో అల్పపీడనం
సాక్షి, చెన్నై : అమ్మ పార్టీలో ‘అల్పపీడనం’ మరింతగా బలపడి అన్నాడీఎంకే శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్న తరుణంలో బుధవారం పార్టీ కార్యవర్గం సమావేశం అవుతోంది. అన్నాడీఎంకే అధికారం కోల్పోయిన నాటి నుంచి అంతర్గత విబేధాలు మరింత ముదురుతున్నాయి. పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ ఓ పన్నీర్‌సెల్వం, కో–కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి మధ్య మొదలైన ఆధిపత్యపోరు అనేక పరిణామాలకు దారితీస్తోంది. ఇద్దరి కుమ్మలాటల మధ్య కేడర్ నలిగి పోతుండగా మాజీమంత్రి సెంగొట్టయ్యన్ ముచ్చటగా తెరమీదకు వచ్చాడు. పార్టీ శ్రేణుల్లో అధిగశాతం ఓపీఎస్ లేదా ఈపీఎస్ వైపు నిలిచి ఉండగా, సెంగొట్టయ్యన్ ఇద్దరితోనూ విబేధిస్తూ మూడో శక్తిగా ఎదిగిగేందుకు మొదలెట్టిన ప్రయత్నాలు మరో కల్లోలానికి కారణమయ్యాయి. అమ్మ మరణం తరువాత.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత వచ్చిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని చవిచూసింది. అలాగే ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పరాజయం తప్పలేదు. గత కొన్నేళ్లుగా పార్టీకి సారథ్యం వహిస్తున్న ఎడపాడి, పన్నీర్‌సెల్వం ఓపీఎస్, ఈపీఎస్ మధ్య సఖ్యత లేకపోవడం, ఎన్నికల ప్రచారంలో అధికార పక్షంపై చేస్తున్న విమర్శలు చేయడంలో సరిగా విఫలమవడం ఓటమికి ఒక కారణంగా కార్యకర్తలు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో జిల్లా కార్యదర్శుల సమావేశం నవంబరు 24వ తేదీన ఓపీఎస్, ఈపీఎఎస్ అధ్యక్షతన చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. త్వరలో రానున్న కార్పొరేషన్, మున్సిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించాల్సి ఉంది. అయితే ఆ అంశానికి తావులేకుండా పార్టీ నాయకత్వంలో మార్పు, నిర్వాహకుల నియామకాలను కొందరు లేవనెత్తడం సమావేశాన్ని దారిమళ్లించి ఒకరిపై ఒకరు భౌతికదాడులకు పాల్పడే పరిస్థితి తలెత్తింది. మాజీ ఎంపీ అన్వర్‌రాజా మాట్లాడే సమయంలో మాజీమంత్రి సీవీ షణ్ముగం అతడిపైకి దూసుకెళ్లారు. మాజీమంత్రి వైద్యలింగం, సీవీ షణ్ముగం మధ్య వాగ్వాదం ఉద్రిక్తలకు దారితీసింది. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నవారు మాత్రమే లాభపడ్డారని, ద్వితీయశ్రేణి క్యాడర్‌ను ఎవరూ పట్టించుకోలేదని సెంగొట్టయ్యన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తనవైపు బలం కూడగట్టే ప్రయత్నం చేశారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో పార్టీ కార్యకర్గ సమావేశానికి బుధవారం సమాయుత్తం అయ్యారు. అజెండాలోని అంశాలకు అనుగుణంగా సమావేశం సాగేనా ? మరింత గందరగోళ పరిస్థితులకు దారితీసేనా అని అన్నాడీఎంకే శ్రేణులు ఉన్నారు. -
నేడు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్లో జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సమావేశానికి హాజరై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. జూలై నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడంతో.. ఆ దిశగా పార్టీ శ్రేణులను సన్నద్దం చేసే అవకాశం ఉంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా సభ్యత్వ నమోదు గురించి సూచనలు చేయనున్నారు. అలాగే జిల్లా స్థాయిలో పార్టీ కార్యాలయాలు నిర్మించే అంశంపైనా స్పష్టత ఇవ్వనున్నారు. 2018 ఆగస్టులో రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించగా.. జిల్లా స్థాయిలో మాత్రం ఇంకా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికనే కార్యవర్గాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల వారీగా కార్యవర్గాల ఏర్పాటుపైనా చర్చించనున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయలోపంతో ఓట మి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరిన నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జీల నియామకం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. -
టీజీవో అధ్యక్ష, కార్యదర్శులుగా మమత, సత్యనారాయణ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం (టీజీవో) నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వి.మమత, ఎ.సత్యనారాయణ మరోసారి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని సంఘం కార్యాలయంలో మంగళవారం జరిగిన టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారిని మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో వారు 2022 వరకు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతారు. సంఘం అధ్యక్షురాలు మమత అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన వివిధ సమస్యలు, ఇతర అంశాలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. సంఘం చైర్మన్, వ్యవస్థాపక అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్‌కు తెలంగాణ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు సంఘం ధన్యవాదాలు తెలిపింది. రాష్ట్రంలోని 31 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సచివాలయం, హైదరాబాద్ సిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, సంఘం అనుబంధ శాఖల (54) ఫోరమ్‌ల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలను సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే బాధ్యతను కేంద్ర సంఘానికి అప్పగిస్తూ తీర్మానించారు. అలాగే కేంద్ర సంఘం మిగతా కార్యవర్గాన్ని నియమించే అధికారం, అనుబంధ సంఘాలకు నిర్ణీత కాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించే అధికారాన్ని కేంద్ర సంఘానికి అప్పగించారు. ఉద్యోగాలను పణంగా పెట్టారు టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం చైర్మన్, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు తమ ఉద్యోగాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని గుర్తు చేశారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా ఏర్పడిన టీజీవో ముందుడి పోరాటం చేసిందన్నారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయడంలో, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి మేలు చేకూర్చడంలో సంఘం ముందుందని తెలిపారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ప్రథ«మ ప్రాధాన్యం ఇస్తోందని, ఉద్యోగుల అవసరాలు, సమస్యల పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన కేసీఆర్ సరైన సమయంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారన్నారు. -
పరిషత్‌లన్నింటా పాగాకు కసరత్తు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంపూర్ణ ఆధిప్యతం దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పలు వ్యూహాలు సిద్ధం చేసింది. భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఆ తర్వాత అన్ని ఎన్నికల్లోనూ ఇదేరకంగా సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. జనవరిలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అత్యధికచోట్ల టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఏకపక్షంగా విజయం సాధించారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనా టీఆర్ఎస్ ధీమాతో ఉంది. మిత్రపక్షం ఎంఐంఎంతో కలసి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో కచ్చితంగా గెలుపు తమదేనని గట్టిగా చెబుతోంది. అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘన విజయాలు... లోక్‌సభ ఎన్నికల్లో అనుకూల ఫలితాలపై అంచనాలతో ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం, పట్టు సాధించే దిశగా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల పరిషత్‌లను కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. జిల్లాలు, మండలాల పునర్విభజనతో రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ల సంఖ్య 32, మండల పరిషత్‌ల సంఖ్య 535కు పెరిగింది. రాష్ట్రంలో 5,857 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అన్ని జిల్లా పరిషత్‌ల చైర్పర్సన్, అన్ని ఎంపీపీల అధ్యక్ష పదవులను గెలుచుకోవడం లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహం సిద్ధం చేసింది. స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ గెలిస్తేనే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలు పూర్తిగా నెరవేరుతాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. పరిషత్ ఎన్నికల్లో పరిపూర్ణ విజయమే లక్ష్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన అధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్లో సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మొదలయ్యే ఈ సమావేశానికి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీ అభ్యర్థులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనాయకులు హాజరుకానున్నారు. అధికారంలో ఉన్న పార్టీని గెలిపించడం వల్ల స్థానిక సంస్థల్లోనూ అభివృద్ధి వేగంగా జరుగుతుందని, ఈ దిశగా ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నించాలని ఉద్బోధించనున్నారు. గవర్నర్‌తో సీఎం కేసీఆర్ భేటీ... తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ దాదాపు నెలరోజులుగా గవర్నర్‌ను కలవలేదు. వారంలోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అంశాలకు సంబంధించి ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం గురించి వీరు చర్చించినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపైనా వీరిద్దరు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. -
వైఎస్సార్‌టీఎఫ్ కార్యవర్గ సమావేశం
అనంతపురం ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేష¯ŒS మూడు జిల్లా ల కార్యవర్గ సమావేశం బుధవారం సాయంత్రం స్థానిక లిటిల్‌ఫ్లవర్ స్కూల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఓబుâýæపతి హాజరయ్యారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్ధతుతో పోటీ చేస్తున్న వెన్నపూస గోపాల్‌రెడ్డికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకుని వెన్నపూస గోపాల్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్య క్షులు అశోక్‌కుమార్‌రెడ్డి, గౌరవాధ్యక్షులు వెంకటేశులు, ప్రధానకార్యదర్శి ఎ.రాధాకృష్ణా రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గిరిధర్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ పుల్లారెడ్డి, కార్యదర్శి పుల్లయ్య, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనాథరెడ్డితో పాటు జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేత వెన్నపూస రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. -
బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
గన్నవరం : టీడీపీ ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసమీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.మధు పిలుపునిచ్చారు. స్థానిక కొత్తపేట రోటరీ ఆడిటోరియంలో సీపీఎం తూర్పు కృష్ణా విభాగం విస్తృత సమావేశం నిర్వహించారు. మధు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు క్యాపిటల్ పెట్టుబడులకు, ప్రపంచంలో పనికిరాని కెమికల్, ఆక్వా హబ్ వంటి పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు దిగుతుందన్నారు. ఈ పరిశ్రమలు వల్ల వాతావరణ కాలుష్యంతోపాటు భూగర్భ జలాలు దెబ్బతని లక్షలాది ఎకరాల పంట భూములు బీడువారి పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భవిష్యత్‌లో ఆహార కొరతతో పాటు వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలు, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా నవంబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికి కలిసివచ్చే ప్రతిపక్షపార్టీలు, ప్రజాసంఘాలను కూడా కలుపుకుని ముందుకువెళ్తామని స్పష్టం చేశారు. ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు నిర్భందాలను విధించినప్పటికి లెక్కచేసేది లేదని తెలిపారు. తొలుత సీనియర్ నాయకులు గంగా నాగేశ్వరరావు పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, తూర్పుకృష్ణా కార్యదర్శి ఆర్.రఘు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నరసింహారావు, పిన్నమనేని విజయ, చౌటపల్లి రవి, హరిబాబు, డివిజన్ కార్యదర్శి కళ్లం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో కుటుంబపాలన
బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరైన కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో మోదీ సభకు జన సమీకరణపై చర్చ రాష్ట్రంలో టీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తోంది. ప్రతిపక్షాలు లేకుండా చేస్తూ కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారు.. ప్రజావ్యతిరేక పాలనపై పోరాటానికి ఈ నెల 7న జరిగే మోదీ సభలో బీజేపీ శంఖారావం పూరిస్తాం. ఎంసెట్-2 లీకేజీతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతూ ప్రజల గొంతుకై సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి. - బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డి శంషాబాద్ రూరల్: టీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో విద్యా రంగ వ్యవస్థ నిర్వీర్యం అయిందని బీజేపీ శాసనసభా పక్షనేత జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. శంషాబాద్ మండలంలోని బహదూర్‌గూడ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్‌హాలులో మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. యూనివర్సిటీలకు వైస్ చాన్స్లర్ల నియామకం, ఎంసెట్-2 లీకేజీ వ్యవహారాలతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గ్రామాల్లో ఇసుక, ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా రాజ్యాంగ విరుద్దంగా పాలన కొనసాగిస్తున్నారని, టీడీపీలో 15 మంది ఎమ్మెల్యేలుంటే ఇద్దరుముగ్గుర్ని వదిలి అందర్నీ చేర్చుకున్నారన్నారు. రెండు పడకల ఇళ్లు పథకం సచివాలయం దాటి రావడంలేదన్నారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలనపై పోరాటం చేయడంతో పాటు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతూ ప్రజల గొంతుకై సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతామన్నారు. ఇందుకు ఈ నెల 7న జరిగే మోదీ సభను వేదికగా చేసుకుంటామని చెప్పారు. 2019లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాహుల్‌తో కాంగ్రెస్ ముక్తీ భారత్.. ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ ముక్తీ భారత్‌గా ఉంటుందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం పోయిందని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు. హిమాచల్, ఉత్తరాంచల్, కర్ణాటకలో ఎప్పడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుపు ఖాయమన్నారు. మోదీ నేతృత్వంలో భారత్ అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. మోదీ సభను విజయవంతం చేద్దాం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాని హోదాలో మోదీ మొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించే సభను విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. 2013లో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటి సభను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించామని, అదేస్థాయిలో ఇప్పుడు సభకు భారీగా జన సమీకరణ చేపట్టాలన్నారు. అన్ని వర్గాల వారిని సభకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి కృష్ణదాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి ఎండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రేమ్‌రాజ్, అంజన్‌కుమార్, నాయకులు నందకిషోర్, ప్రశాంత్, మండల అధ్యక్షుడు వెంకటయ్య, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
12న బీజేపీ మేధోమథనం
హైదరాబాద్: బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యవర్గ సమావేశం ఏప్రిల్ 12న విశాఖపట్నంలో జరగనుంది. అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ ఇన్చార్జి, కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించి రానున్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో ఒక తీర్మానాన్ని ఖరారు చేయనున్నామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ 'సాక్షి' కి చెప్పారు. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు.. పార్టీ కార్యకర్తలుగా కొత్తగా నమోదు చేసుకున్న వారి కుటుంబాలను పార్టీ నేతలు వ్యక్తిగతంగా కలిసే కార్యక్రమ ప్రణాళిక రూపకల్పన, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయంపై ప్రచారోద్యమం తదితర అంశాలు సమావేశంలో చర్చకు వస్తాయని ఆయన చెప్పారు. -
జోనల్ ఆఫీసర్లకు టాటా ?
సాక్షి,సిటీబ్యూరో: మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) జోనల్ అధికారుల వ్యవస్థ ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. జోనల్ అధికారులపై కుప్పలు తెప్పలుగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఆ పోస్టులను రద్దు చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అంతర్గతంగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీరి సేవలను మరోరకంగా వినియోగించుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 25న జరిగే ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో ఈ అంశాన్ని చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఒకవేళ ఇదే జరిగితే..జోనల్ కార్యాయాల్లో ఇకపై జోనల్ ఆఫీసర్ ఉండరు. వీరిని ఓఆర్ఆర్లో భూసేకరణ తదితర విభాగాల్లో నియమిస్తారు. జోనల్ కార్యాలయంలో అనుమతులిచ్చే అధికారాన్ని రద్దుచేసి..కేవలం దరఖాస్తులు స్వీకరించేందుకే పరిమితం చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. హెచ్ఎండీఏ సేవలను ప్రజలకు మరింత చేరువలోకి తీసుకె ళుతూ 2009లో శంషాబాద్, శంకర్పల్లి, మేడ్చల్, ఘట్కేసర్లలో జోనల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. గతంలో కేంద్ర కార్యాలయానికే పరిమితమైన కొన్ని అధికారాలను జోనల్ కార్యాలయాలకు కట్టబెడుతూ 2010లో హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకుంది. అయితే కొందరు అవినీతిపరుల వల్ల ఇవి అక్రమాలకు అడ్డాలుగా మారిపోయాయి. అక్రమాలు బయటపడకుండా శంకర్పల్లి జోనల్ కార్యాలయంలో ఏకంగా ఫైళ్లనే తగులబెట్టాగా, ఘట్కేసర్ కార్యాలయంలో నకిలీ ఎల్ఆర్ఎస్/బీపీఎస్ పత్రాల జారీవెలుగు చూశాయి. అలాగే శంషాబాద్ కార్యాలయంలో ఇష్టారీతిన అనుమతులిచ్చి సంస్థ ఆదాయానికి గండికొట్టగా, మేడ్చల్ కార్యాలయంలో బీపీఎస్ కింద రావాల్సి ఫీజు మొత్తాన్ని తగ్గించి మరీ ఫైళ్లు క్లియర్ చేశారు. ఇదే కార్యాలయంలో కొందరు సిబ్బంది బరితెగించి ఏకంగా ప్రగతినగర్‌లోని పార్కు స్థలాన్ని క్రమబద్ధీకరించి అడ్డంగా దొరికిపోయారు. జోనల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ అక్రమాలు జరిగినట్లు తేలడంతో ఆయా కార్యాలయాల్లో జోనల్ అధికారుల పోస్టును రద్దు చేయాలని కమిషనర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసలుకే మోసం : నగరానికి చేరువలో ఉన్న శివారు గ్రామాలన్నీ హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. నాలుగుజిల్లాల పరిధిలో నగరానికి చేర్చి ఉన్న వివిధ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు, కొత్త నిర్మాణాలు, లేఔట్ల అనుమతులకు సంబంధించి నిర్ణీత రుసుం హెచ్ఎండీఏకు చెల్లించాల్సి ఉంటుంది. స్థానికంగానే ఈ సేవలు అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించి జోనల్ కార్యాలయాలకే అనుమతులు, ఇతర ఫీజుల వ సూళ్ల బాధ్యతను అప్పగించారు. ఇందుకోసం జోనల్ ప్లానింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసి పక్షానికోసారి సమీక్షించి నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. అయితే... కమిటీ సభ్యులు కేంద్ర కార్యాలయానికే పరిమితం కావడం.. ఇక్కడికొచ్చే దరఖాస్తుదారులనుజోనల్ కార్యాలయానికి పంపిస్తుండటంతో స్థానిక సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం ప్రారంభించారు. ఫలితంగా ఎల్ఆర్ఎస్-బీపీఎస్ కింద హెచ్ఎండీఏకు వందల కోట్ల రూపాయలు ఆదాయం రావాల్సి ఉండగా ఇంటిదొంగల కారణంగా అసలుకే ఎసరు వచ్చి పడింది. ముగ్గురికి మెమోలు జారీ : ఎల్ఆర్ఎస్/బీపీఎస్లలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మేడ్చల్ జోనల్ ఆఫీసర్ బాలాజీరంజిత్ ప్రసాద్, ఏజడ్వో నిరంజన్‌బాబు (ప్రస్తుతం ఘట్కేసర్లో ఉన్నారు), జేపీవో రామకృష్ణారెడ్డిలకు శనివారం ఛార్జీ మెమో ఇస్తూ హెచ్ఎండీఏ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రత్యేకించి బీపీఎస్ కింద రెగ్యులరైజ్ చేసిన 10ఫైళ్లలో నిర్ణీత ఫీజు తగ్గింపు, నిబంధనలకు విరుద్ధంగా ప్రగతినగర్ పార్కును క్రమబద్ధీకరించినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు అందులో స్పష్టం చేశారు.