రాష్ట్రంలో కుటుంబపాలన
బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరైన కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో మోదీ సభకు జన సమీకరణపై చర్చ
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తోంది. ప్రతిపక్షాలు లేకుండా చేస్తూ కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారు.. ప్రజావ్యతిరేక పాలనపై పోరాటానికి ఈ నెల 7న జరిగే మోదీ సభలో బీజేపీ శంఖారావం పూరిస్తాం. ఎంసెట్-2 లీకేజీతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతూ ప్రజల గొంతుకై సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి. - బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డి
శంషాబాద్ రూరల్: టీఆర్‌ఎస్ పాలనతో రాష్ట్రంలో విద్యా రంగ వ్యవస్థ నిర్వీర్యం అయిందని బీజేపీ శాసనసభా పక్షనేత జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. శంషాబాద్ మండలంలోని బహదూర్‌గూడ సమీపంలో ఉన్న ఓ ఫంక‌్షన్‌హాలులో మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్‌ల నియామకం, ఎంసెట్-2 లీకేజీ వ్యవహారాలతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గ్రామాల్లో ఇసుక, ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా రాజ్యాంగ విరుద్దంగా పాలన కొనసాగిస్తున్నారని, టీడీపీలో 15 మంది ఎమ్మెల్యేలుంటే ఇద్దరుముగ్గుర్ని వదిలి అందర్నీ చేర్చుకున్నారన్నారు. రెండు పడకల ఇళ్లు పథకం సచివాలయం దాటి రావడంలేదన్నారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలనపై పోరాటం చేయడంతో పాటు టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతూ ప్రజల గొంతుకై సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతామన్నారు. ఇందుకు ఈ నెల 7న జరిగే మోదీ సభను వేదికగా చేసుకుంటామని చెప్పారు. 2019లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
రాహుల్‌తో కాంగ్రెస్ ముక్తీ భారత్..
ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ ముక్తీ భారత్‌గా ఉంటుందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం పోయిందని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు. హిమాచల్, ఉత్తరాంచల్, కర్ణాటకలో ఎప్పడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుపు ఖాయమన్నారు. మోదీ నేతృత్వంలో భారత్ అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తుందన్నారు.
మోదీ సభను విజయవంతం చేద్దాం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాని హోదాలో మోదీ మొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించే సభను విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. 2013లో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటి సభను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించామని, అదేస్థాయిలో ఇప్పుడు సభకు భారీగా జన సమీకరణ చేపట్టాలన్నారు. అన్ని వర్గాల వారిని సభకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి కృష్ణదాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి ఎండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రేమ్‌రాజ్, అంజన్‌కుమార్, నాయకులు నందకిషోర్, ప్రశాంత్, మండల అధ్యక్షుడు వెంకటయ్య, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.