బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యవర్గ సమావేశం ఏప్రిల్ 12న విశాఖపట్నంలో జరగనుంది.
హైదరాబాద్: బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యవర్గ సమావేశం ఏప్రిల్ 12న విశాఖపట్నంలో జరగనుంది. అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు నేతృత్వంలో జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించి రానున్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో ఒక తీర్మానాన్ని ఖరారు చేయనున్నామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్ 'సాక్షి' కి చెప్పారు. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు.. పార్టీ కార్యకర్తలుగా కొత్తగా నమోదు చేసుకున్న వారి కుటుంబాలను పార్టీ నేతలు వ్యక్తిగతంగా కలిసే కార్యక్రమ ప్రణాళిక రూపకల్పన, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయంపై ప్రచారోద్యమం తదితర అంశాలు సమావేశంలో చర్చకు వస్తాయని ఆయన చెప్పారు.