సాక్షి,సిటీబ్యూరో: మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) జోనల్ అధికారుల వ్యవస్థ ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. జోనల్ అధికారులపై కుప్పలు తెప్పలుగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఆ పోస్టులను రద్దు చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అంతర్గతంగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీరి సేవలను మరోరకంగా వినియోగించుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 25న జరిగే ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో ఈ అంశాన్ని చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు.
ఒకవేళ ఇదే జరిగితే..జోనల్ కార్యాయాల్లో ఇకపై జోనల్ ఆఫీసర్ ఉండరు. వీరిని ఓఆర్‌ఆర్‌లో భూసేకరణ తదితర విభాగాల్లో నియమిస్తారు. జోనల్ కార్యాలయంలో అనుమతులిచ్చే అధికారాన్ని రద్దుచేసి..కేవలం దరఖాస్తులు స్వీకరించేందుకే పరిమితం చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. హెచ్‌ఎండీఏ సేవలను ప్రజలకు మరింత చేరువలోకి తీసుకె ళుతూ 2009లో శంషాబాద్, శంకర్‌పల్లి, మేడ్చల్, ఘట్‌కేసర్‌లలో జోనల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు.
గతంలో కేంద్ర కార్యాలయానికే పరిమితమైన కొన్ని అధికారాలను జోనల్ కార్యాలయాలకు కట్టబెడుతూ 2010లో హెచ్‌ఎండీఏ నిర్ణయం తీసుకుంది. అయితే కొందరు అవినీతిపరుల వల్ల ఇవి అక్రమాలకు అడ్డాలుగా మారిపోయాయి. అక్రమాలు బయటపడకుండా శంకర్‌పల్లి జోనల్ కార్యాలయంలో ఏకంగా ఫైళ్లనే తగులబెట్టాగా, ఘట్‌కేసర్ కార్యాలయంలో నకిలీ ఎల్‌ఆర్‌ఎస్/బీపీఎస్ పత్రాల జారీవెలుగు చూశాయి.
అలాగే శంషాబాద్ కార్యాలయంలో ఇష్టారీతిన అనుమతులిచ్చి సంస్థ ఆదాయానికి గండికొట్టగా, మేడ్చల్ కార్యాలయంలో బీపీఎస్ కింద రావాల్సి ఫీజు మొత్తాన్ని తగ్గించి మరీ ఫైళ్లు క్లియర్ చేశారు. ఇదే కార్యాలయంలో కొందరు సిబ్బంది బరితెగించి ఏకంగా ప్రగతినగర్‌లోని పార్కు స్థలాన్ని క్రమబద్ధీకరించి అడ్డంగా దొరికిపోయారు. జోనల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ అక్రమాలు జరిగినట్లు తేలడంతో ఆయా కార్యాలయాల్లో జోనల్ అధికారుల పోస్టును రద్దు చేయాలని కమిషనర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అసలుకే మోసం : నగరానికి చేరువలో ఉన్న శివారు గ్రామాలన్నీ హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. నాలుగుజిల్లాల పరిధిలో నగరానికి చేర్చి ఉన్న వివిధ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు, కొత్త నిర్మాణాలు, లేఔట్ల అనుమతులకు సంబంధించి నిర్ణీత రుసుం హెచ్‌ఎండీఏకు చెల్లించాల్సి ఉంటుంది. స్థానికంగానే ఈ సేవలు అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించి జోనల్ కార్యాలయాలకే అనుమతులు, ఇతర ఫీజుల వ సూళ్ల బాధ్యతను అప్పగించారు.
ఇందుకోసం జోనల్ ప్లానింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసి పక్షానికోసారి సమీక్షించి నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. అయితే... కమిటీ సభ్యులు కేంద్ర కార్యాలయానికే పరిమితం కావడం.. ఇక్కడికొచ్చే దరఖాస్తుదారులనుజోనల్ కార్యాలయానికి పంపిస్తుండటంతో స్థానిక సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం ప్రారంభించారు. ఫలితంగా ఎల్‌ఆర్‌ఎస్-బీపీఎస్ కింద హెచ్‌ఎండీఏకు వందల కోట్ల రూపాయలు ఆదాయం రావాల్సి ఉండగా ఇంటిదొంగల కారణంగా అసలుకే ఎసరు వచ్చి పడింది.
ముగ్గురికి మెమోలు జారీ : ఎల్‌ఆర్‌ఎస్/బీపీఎస్‌లలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మేడ్చల్ జోనల్ ఆఫీసర్ బాలాజీరంజిత్ ప్రసాద్, ఏజడ్‌వో నిరంజన్‌బాబు (ప్రస్తుతం ఘట్‌కేసర్‌లో ఉన్నారు), జేపీవో రామకృష్ణారెడ్డిలకు శనివారం ఛార్జీ మెమో ఇస్తూ హెచ్‌ఎండీఏ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రత్యేకించి బీపీఎస్ కింద రెగ్యులరైజ్ చేసిన 10ఫైళ్లలో నిర్ణీత ఫీజు తగ్గింపు, నిబంధనలకు విరుద్ధంగా ప్రగతినగర్ పార్కును క్రమబద్ధీకరించినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు అందులో స్పష్టం చేశారు.
జోనల్ ఆఫీసర్లకు టాటా ?
Published Sun, Sep 22 2013 3:39 AM | Last Updated on Thu, Mar 28 2019 6:26 PM
Advertisement