sansabad
-
వాళ్లకు బుద్ధొస్తే మంచిది.. రాకపోతే ఇంకా మంచిది!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ వల్ల కాదనే ప్రజలు టీఆర్ఎస్కు అధికారం కట్టబెట్టారని, కాంగ్రెస్ వాళ్లకు బుద్ది వస్తే మంచిది.. రాకపోతే ఇంకా మంచిదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారవు అన్నారు. మంగళవారం శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ వాళ్లు చేపట్టిన ప్రాజెక్ట్‌ల పనులను చూసి నత్తలు కూడా సిగ్గు పడుతున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ నేలను సస్యశ్యామలం చేయటం కోసం వేగంగా ప్రాజెక్టు పనులను చేపడుతున్నామని తెలిపారు. తెలంగాణలో ఇప్పుడు ఏమైతదో దేశమంతా అదే చేస్తరు అనే విధంగా ఉందన్నారు. యాబై ఏళ్ల దరిద్రం నాలుగేళ్లలో పోవటం సాద్యం కాదని, దానికి కొంచెం టైం పడుతుందని అన్నారు. కేటీఆర్ సుడిగాలి పర్యటన హైదరాబాద్ : రాజేంద్రనగర్ నియోజక వర్గంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సుడిగాలి పర్యటన చేశారు. మంగళవారం వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, సబ్ స్టేషన్లు, కిస్మత్పూర్లో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ సీ.నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తెల్లారిన బతుకులు
శంషాబాద్, న్యూస్‌లైన్ : తెల్లవారకముందే వారి జీవితాలు తెల్లారిపోయాయి. రాత్రి కుటుంబీకులతో మాట్లాడి నిద్రలోకి జారుకున్న కార్మికులు అంతలోనే కానరాని లోకాలకు తరలిపోయారు. నలుగురు కార్మికుల సజీవ దహనంతో శంషాబాద్ ఉలిక్కిపడింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందంగా ఈ దుర్ఘటనలో కంపెనీ యాజమాన్యం, అధికారులు పాలుపంచుకున్నారు. అనుమతి లేని పరిశ్రమలపై దాడులు చేయాల్సిన అధికారులు మిన్నకుండిపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడే నేతలు మీడియా ప్రచారం కోసం ప్రగల్భాలు పలికి తర్వాత పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. గగన్‌పహాడ్, సాతంరాయి పారిశ్రామిక వాడలో అనుమతుల్లేని పరిశ్రమల కోకొల్లలు. గురువారం తెల్లవారుజామున అశ్రీత రబ్బరు పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు బీహారీ కార్మికులు సజీవ దహనమవడంతో శంషాబాద్‌లో ఆందోళన నెలకొంది. రసాయనాలు సరఫరా చేసే పైపులైన్ లీకేజీ అవడంతో మంటలు ఎగిసిపడి ప్రమాదం చోటుచేసుకుంది. కన్నెత్తి చూడని అధికారులు అశ్రీత పరిశ్రమలో అన్నీ నిబంధనలకు విరుద్ధమే. ఈ కంపెనీకి పీసీబీ అధికారుల అనుమతి లేదు. సకాలంలో అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటే నాలుగు ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి కావు. 15 రోజుల క్రితం స్థానికంగా లియో ఫ్లైవుడ్ పరిశ్రమలో రసాయన రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో త్రుటిలో నలుగురికి ప్రాణాపాయం తప్పింది. ఆయిల్ పరిశ్రమల నుంచి వచ్చే వరిపొట్టుతో గగన్‌పహాడ్ వాసులు కూడా ఊపీరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఇక్కడి నుం చి తరలించాలని రెండేళ్ల కిందటే నోటీసులు జారీ అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రాణాలకు వెల.. ఇక్కడి పరిశ్రమల్లో ఎక్కువ మంది బీహార్, ఒడిశా కార్మికులు పనిచేస్తున్నారు. కంపెనీలో తరచూ ప్రమాదాలు జరిగి ప్రా ణాలు కోల్పోతే యాజమాన్యం ఎంతోకొంత పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. పరిశ్రమల యజమానులకు కొందరు ఖాకీలు సహకరిస్తుండటంతో ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కంపెనీ యజమాని అరెస్టు.. కంపెనీ యజమాని కైలాష్ అగర్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ ఠాణాకు తరలించే సమయంలో కార్మిక సంఘాలు అడ్డుపడ్డాయి. మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు చెల్లిస్తానని యజమాని కైలాష్‌అగర్వాల్ ఆందోళనకారులను హామీ ఇచ్చారు. అనంతరం అతడిని పీఎస్‌కు తరలించారు. నలుగురి సజీవ దహనం సంఘటనతో కోపోద్రిక్తులైన గగన్‌పహాడ్ వాసులు స్థానికంగా ఉన్న ఆయిల్ పరిశ్రమలపై దాడులు చేశారు. కొన్ని వాహనాల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. మృతుల్లో ఒకరు జైకిషన్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో ఉంటున్నాడు. ఈయనకు భార్య గీత, పిల్లలు రవికుమార్, దుర్గ ఉన్నారు. జైకిషన్ బీహార్ నుంచి పదేళ్ల క్రితం వలస వచ్చాడు. 2008లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతులమీదుగా లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో ఇల్లు తీసుకున్నాడు. -
జోనల్ ఆఫీసర్లకు టాటా ?
సాక్షి,సిటీబ్యూరో: మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) జోనల్ అధికారుల వ్యవస్థ ఉద్వాసనకు రంగం సిద్ధమైంది. జోనల్ అధికారులపై కుప్పలు తెప్పలుగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఆ పోస్టులను రద్దు చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అంతర్గతంగా ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీరి సేవలను మరోరకంగా వినియోగించుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 25న జరిగే ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో ఈ అంశాన్ని చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు. ఒకవేళ ఇదే జరిగితే..జోనల్ కార్యాయాల్లో ఇకపై జోనల్ ఆఫీసర్ ఉండరు. వీరిని ఓఆర్ఆర్లో భూసేకరణ తదితర విభాగాల్లో నియమిస్తారు. జోనల్ కార్యాలయంలో అనుమతులిచ్చే అధికారాన్ని రద్దుచేసి..కేవలం దరఖాస్తులు స్వీకరించేందుకే పరిమితం చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. హెచ్ఎండీఏ సేవలను ప్రజలకు మరింత చేరువలోకి తీసుకె ళుతూ 2009లో శంషాబాద్, శంకర్పల్లి, మేడ్చల్, ఘట్కేసర్లలో జోనల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. గతంలో కేంద్ర కార్యాలయానికే పరిమితమైన కొన్ని అధికారాలను జోనల్ కార్యాలయాలకు కట్టబెడుతూ 2010లో హెచ్ఎండీఏ నిర్ణయం తీసుకుంది. అయితే కొందరు అవినీతిపరుల వల్ల ఇవి అక్రమాలకు అడ్డాలుగా మారిపోయాయి. అక్రమాలు బయటపడకుండా శంకర్పల్లి జోనల్ కార్యాలయంలో ఏకంగా ఫైళ్లనే తగులబెట్టాగా, ఘట్కేసర్ కార్యాలయంలో నకిలీ ఎల్ఆర్ఎస్/బీపీఎస్ పత్రాల జారీవెలుగు చూశాయి. అలాగే శంషాబాద్ కార్యాలయంలో ఇష్టారీతిన అనుమతులిచ్చి సంస్థ ఆదాయానికి గండికొట్టగా, మేడ్చల్ కార్యాలయంలో బీపీఎస్ కింద రావాల్సి ఫీజు మొత్తాన్ని తగ్గించి మరీ ఫైళ్లు క్లియర్ చేశారు. ఇదే కార్యాలయంలో కొందరు సిబ్బంది బరితెగించి ఏకంగా ప్రగతినగర్‌లోని పార్కు స్థలాన్ని క్రమబద్ధీకరించి అడ్డంగా దొరికిపోయారు. జోనల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ అక్రమాలు జరిగినట్లు తేలడంతో ఆయా కార్యాలయాల్లో జోనల్ అధికారుల పోస్టును రద్దు చేయాలని కమిషనర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసలుకే మోసం : నగరానికి చేరువలో ఉన్న శివారు గ్రామాలన్నీ హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. నాలుగుజిల్లాల పరిధిలో నగరానికి చేర్చి ఉన్న వివిధ ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణకు, కొత్త నిర్మాణాలు, లేఔట్ల అనుమతులకు సంబంధించి నిర్ణీత రుసుం హెచ్ఎండీఏకు చెల్లించాల్సి ఉంటుంది. స్థానికంగానే ఈ సేవలు అందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించి జోనల్ కార్యాలయాలకే అనుమతులు, ఇతర ఫీజుల వ సూళ్ల బాధ్యతను అప్పగించారు. ఇందుకోసం జోనల్ ప్లానింగ్ కమిటీలను కూడా ఏర్పాటు చేసి పక్షానికోసారి సమీక్షించి నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. అయితే... కమిటీ సభ్యులు కేంద్ర కార్యాలయానికే పరిమితం కావడం.. ఇక్కడికొచ్చే దరఖాస్తుదారులనుజోనల్ కార్యాలయానికి పంపిస్తుండటంతో స్థానిక సిబ్బంది చేతివాటం ప్రదర్శించడం ప్రారంభించారు. ఫలితంగా ఎల్ఆర్ఎస్-బీపీఎస్ కింద హెచ్ఎండీఏకు వందల కోట్ల రూపాయలు ఆదాయం రావాల్సి ఉండగా ఇంటిదొంగల కారణంగా అసలుకే ఎసరు వచ్చి పడింది. ముగ్గురికి మెమోలు జారీ : ఎల్ఆర్ఎస్/బీపీఎస్లలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై మేడ్చల్ జోనల్ ఆఫీసర్ బాలాజీరంజిత్ ప్రసాద్, ఏజడ్వో నిరంజన్‌బాబు (ప్రస్తుతం ఘట్కేసర్లో ఉన్నారు), జేపీవో రామకృష్ణారెడ్డిలకు శనివారం ఛార్జీ మెమో ఇస్తూ హెచ్ఎండీఏ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రత్యేకించి బీపీఎస్ కింద రెగ్యులరైజ్ చేసిన 10ఫైళ్లలో నిర్ణీత ఫీజు తగ్గింపు, నిబంధనలకు విరుద్ధంగా ప్రగతినగర్ పార్కును క్రమబద్ధీకరించినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు అందులో స్పష్టం చేశారు.