తెల్లారిన బతుకులు | Since food | Sakshi
Sakshi News home page

తెల్లారిన బతుకులు

Published Fri, Dec 27 2013 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

తెల్లారిన బతుకులు

తెల్లారిన బతుకులు

శంషాబాద్, న్యూస్‌లైన్ : తెల్లవారకముందే వారి జీవితాలు తెల్లారిపోయాయి. రాత్రి కుటుంబీకులతో మాట్లాడి నిద్రలోకి జారుకున్న కార్మికులు అంతలోనే కానరాని లోకాలకు తరలిపోయారు. నలుగురు కార్మికుల సజీవ దహనంతో శంషాబాద్ ఉలిక్కిపడింది. ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్న చందంగా ఈ దుర్ఘటనలో కంపెనీ యాజమాన్యం, అధికారులు పాలుపంచుకున్నారు. అనుమతి లేని పరిశ్రమలపై దాడులు చేయాల్సిన అధికారులు మిన్నకుండిపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఏదైనా ఘటన జరిగినప్పుడే నేతలు మీడియా ప్రచారం కోసం ప్రగల్భాలు పలికి తర్వాత పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. గగన్‌పహాడ్, సాతంరాయి పారిశ్రామిక వాడలో అనుమతుల్లేని పరిశ్రమల కోకొల్లలు. గురువారం తెల్లవారుజామున  అశ్రీత రబ్బరు పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు బీహారీ కార్మికులు సజీవ దహనమవడంతో శంషాబాద్‌లో ఆందోళన నెలకొంది. రసాయనాలు సరఫరా చేసే పైపులైన్ లీకేజీ అవడంతో మంటలు ఎగిసిపడి ప్రమాదం చోటుచేసుకుంది.
 
కన్నెత్తి చూడని అధికారులు
 
అశ్రీత పరిశ్రమలో అన్నీ నిబంధనలకు విరుద్ధమే. ఈ కంపెనీకి పీసీబీ అధికారుల అనుమతి లేదు. సకాలంలో అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటే నాలుగు ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి కావు. 15 రోజుల క్రితం స్థానికంగా లియో ఫ్లైవుడ్ పరిశ్రమలో రసాయన రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో త్రుటిలో నలుగురికి ప్రాణాపాయం తప్పింది. ఆయిల్ పరిశ్రమల నుంచి వచ్చే వరిపొట్టుతో గగన్‌పహాడ్ వాసులు కూడా ఊపీరి పీల్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఇక్కడి నుం చి తరలించాలని రెండేళ్ల కిందటే నోటీసులు జారీ అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.  
 
ప్రాణాలకు వెల..
 
ఇక్కడి పరిశ్రమల్లో ఎక్కువ మంది బీహార్, ఒడిశా కార్మికులు పనిచేస్తున్నారు. కంపెనీలో తరచూ ప్రమాదాలు జరిగి ప్రా ణాలు కోల్పోతే యాజమాన్యం ఎంతోకొంత పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. పరిశ్రమల యజమానులకు కొందరు ఖాకీలు సహకరిస్తుండటంతో ప్రమాదాలు నిత్యకృత్యం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.  
 
కంపెనీ యజమాని అరెస్టు..

 
కంపెనీ యజమాని కైలాష్ అగర్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ ఠాణాకు తరలించే సమయంలో కార్మిక సంఘాలు అడ్డుపడ్డాయి. మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు చెల్లిస్తానని యజమాని కైలాష్‌అగర్వాల్ ఆందోళనకారులను హామీ ఇచ్చారు. అనంతరం అతడిని పీఎస్‌కు తరలించారు. నలుగురి సజీవ దహనం సంఘటనతో కోపోద్రిక్తులైన గగన్‌పహాడ్ వాసులు స్థానికంగా ఉన్న ఆయిల్ పరిశ్రమలపై దాడులు చేశారు. కొన్ని వాహనాల అద్దాలను కూడా ధ్వంసం చేశారు. మృతుల్లో ఒకరు జైకిషన్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో ఉంటున్నాడు. ఈయనకు భార్య గీత, పిల్లలు రవికుమార్, దుర్గ ఉన్నారు. జైకిషన్ బీహార్ నుంచి పదేళ్ల క్రితం వలస వచ్చాడు. 2008లో దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేతులమీదుగా లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పలో ఇల్లు తీసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement