రక్తదానం చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు ముందున్నారు. రాష్ట్ర జనాభాలోని 14.61 శాతం మంది ప్రజలు 2023లో రక్తదానం చేసి, తమ సామాజిక సేవా భావాన్ని చాటుకున్నారు. రక్తదానం చేయడంలో యూపీ తర్వాత మహారాష్ట్ర రెండో స్థానంలో నిలవగా, గుజరాత్ మూడో స్థానంలో నిలిచింది.
ఆర్టీఐ కార్యకర్త విపుల్ శర్మ దరఖాస్తుకు ప్రతిస్పందనగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఈ-రక్తకోష్ పోర్టల్ డేటాను షేర్ చేసింది. దీనిలోని వివరాల ప్రకారం కరోనా మహమ్మారి తర్వాత దేశంలో రక్తదానం చేసేవారి సంఖ్య ప్రతి ఏటా 50 శాతానికి పైగా పెరుగుతోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ 2021లో 45 లక్షల యూనిట్ల రక్తం సేకరించగా, అది 2022 నాటికి 80 లక్షల యూనిట్లకు పెరిగింది. 2023లో దేశంలోని మూడు వేలకు పైగా బ్లడ్ బ్యాంక్‌లలో మొదటిసారిగా 1.29 కోట్ల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. వీటిలో అత్యధికంగా 18.11 లక్షల యూనిట్ల రక్తాన్ని ఉత్తరప్రదేశ్‌లోని 400కు పైగా బ్లడ్ బ్యాంకులు అందించాయి.
మహారాష్ట్రలో 15.20 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించగా, గుజరాత్‌లో 10.51 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అమెరికన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళ సగటున 4.3 లీటర్ల రక్తాన్ని కలిగి ఉంటుంది. ఒక పురుషునిలో సగటున 5.7 లీటర్ల రక్తం ఉంటుంది. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి రోజూ 400 నుండి రెండు వేల మిల్లీలీటర్ల రక్తాన్ని ఉత్పత్తి చేస్తాడు. ఒక వ్యక్తి ఒకసారి అర లీటరు రక్తాన్ని దానం చేయవచ్చు. 2018లో దేశంలోని 124 బ్లడ్ బ్యాంకులు ఈ-రక్తకోష్ పోర్టల్‌లో నమోదయ్యాయి. ఆ ఏడాది వీటిలో మొత్తంగా 35 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించారు. 2019లో రక్తదానం 43 లక్షల యూనిట్లకు పెరిగింది. అయితే 2020లో కరోనా మొదటి వేవ్ సమయంలో కేవలం 40 లక్షల యూనిట్ల రక్తాన్ని మాత్రమే సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment