బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలి
గన్నవరం : టీడీపీ ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసమీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.మధు పిలుపునిచ్చారు. స్థానిక కొత్తపేట రోటరీ ఆడిటోరియంలో సీపీఎం తూర్పు కృష్ణా విభాగం విస్తృత సమావేశం నిర్వహించారు. మధు మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు క్యాపిటల్ పెట్టుబడులకు, ప్రపంచంలో పనికిరాని కెమికల్, ఆక్వా హబ్ వంటి పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు దిగుతుందన్నారు. ఈ పరిశ్రమలు వల్ల వాతావరణ కాలుష్యంతోపాటు భూగర్భ జలాలు దెబ్బతని లక్షలాది ఎకరాల పంట భూములు బీడువారి పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భవిష్యత్‌లో ఆహార కొరతతో పాటు వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు హాని కలిగించే పరిశ్రమలు, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా నవంబర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికి కలిసివచ్చే ప్రతిపక్షపార్టీలు, ప్రజాసంఘాలను కూడా కలుపుకుని ముందుకువెళ్తామని స్పష్టం చేశారు. ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు నిర్భందాలను విధించినప్పటికి లెక్కచేసేది లేదని తెలిపారు. తొలుత సీనియర్ నాయకులు గంగా నాగేశ్వరరావు పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, తూర్పుకృష్ణా కార్యదర్శి ఆర్.రఘు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నరసింహారావు, పిన్నమనేని విజయ, చౌటపల్లి రవి, హరిబాబు, డివిజన్ కార్యదర్శి కళ్లం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.