Union leadership job
-
సంఘటితమైతేనే సమస్యల పరిష్కారం
♦ ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయం ♦ 4న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వస్తే తమ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని భావించామని, కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి ఓ ప్రత్యేక వేదికగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యోగ జేఏసీ పునర్నిర్మాణం కావాలన్నారు. నాంపల్లి టీజీఓ భవన్లో బుధవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వి.మమత అధ్యక్షతన జరిగిన సమావేశంలో 58 ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం నవంబర్ 4న ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని తీర్మానించారు. ఒకే వేదికపైకి రావాలి... సమావేశంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... ‘ఉద్యోగ సంఘాల్లో ఒకప్పుడు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు. సంఘాలన్నీ విడివిడిగా ప్రభుత్వం వద్దకు వెళ్లి వినతులు అందజేస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల పట్ల చులకన భావనతో ఉంది. ఈ తరుణంలో ఉద్యోగ సంఘాల నాయకులందరూ ఒకే వేదికపైకి వచ్చి సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది’ అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి నారాయణ మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడేలా ఉన్నాయి. సమస్యలు పరిష్కారం కాకున్నా ప్రజల్లో మాత్రం ఉద్యోగులకు ఏవేవో జరిగిపోయాయనే సందేశం వెళ్లింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇందుకు ఉద్యోగ జేఏసీ పునర్నిర్మాణం జరగాలి. ఇప్పటివరకు జేఏసీ చైర్మన్‌గా కారం రవీందర్‌రెడ్డి ఉన్నారని భావిస్తున్నారు. కానీ ఆయన్ను ఏ సభలోనూ చైర్మన్‌గా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో జేఏసీ చైర్మన్‌ను తక్షణమే ఎన్నుకోవాలి’ అన్నారు. మమత మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి ఏడాదన్నరయినా ఇప్పటి వరకు ఉద్యోగుల విభజన పూర్తి కాలేదన్నారు. హెల్త్ కార్డుల అమలు అగమ్యగోచరంగా ఉందన్నారు. సకల జనుల సమ్మె కాలాన్ని వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, టీఆర్టీయూ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి, టీఆర్టీఎఫ్ నాయకుడు మల్లయ్య పాల్గొన్నారు. -
‘స్థానికత’కు డెడ్‌లైనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన రాజధానిలో కనీస వసతులు లేకుండా ఉద్యోగుల తరలింపుపై గడువు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. 2017 జూన్ 2 తర్వాత కొత్త రాజధానికి తరలి వెళ్లే వారికి(ఉద్యోగులు, వారి పిల్లలు సహా) స్థానికత వర్తించదంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.స్పష్టమైన కార్యాచరణ లేకుండా హడావుడి నిర్ణయాల వల్ల ఉద్యోగుల్లో అయోమయం పెరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. స్థానికత కల్పనకు డెడ్‌లైన్ విధించడాన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఉద్యోగ సంఘాల నేతలు బహిరంగంగా వ్యతిరేకించలేకపోతున్నారు. కేడర్ నుంచి ఒత్తిడి వస్తున్నా... ప్రభుత్వంతో అంటకాగుతుండటం వల్ల గట్టిగా నిలదీయలేకున్నారు. ఉద్యోగుల్లో అనుమానాలు ఇవీ.. ►అమరావతిని రాజధానిగా ప్రకటించిన ప్రభుత్వం.. అక్కడ కనీసం మౌలిక వసతులు కల్పించలేదు. సీఎం కార్యాలయాన్ని కూడా విజయవాడలో ఏర్పాటు చేశారు. సీఆర్డీఏలో పనిచేస్తున్న సిబ్బంది గుంటూరు లేదా విజయవాడలో ఉంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా గుంటూరుకు గడువులోగా తరలి వెళితే స్థానికత లభిస్తుందా? రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా స్థానికత లభిస్తుందా? ►ఉద్యోగుల బదిలీ ఉత్తర్వుల తేదీని బట్టి వారి పిల్లల స్థానికత నిర్ణయిస్తారా? విద్యాసంస్థల్లో పిల్లల ప్రవేశాల తేదీని బట్టి నిర్ణయిస్తారా? కోర్సు మధ్యలో వెళ్లడానికి వీల్లేని విద్యార్థుల పరిస్థితి ఏమిటి? స కొత్త రాజధానిలో అన్ని రకాల వసతులు ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారనే విషయంలో డెడ్‌లైన్ ప్రకటిస్తే బాగుంటుంది. స పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తరలి వెళితే.. అందుకు తగిన విధంగా స్కూళ్లు, కాలేజీలు ఉండాలి. వలసల వల్ల అద్దెలు, స్కూళ్ల ఫీజులు భారీగా పెరుగుతున్నాయి. వాటి పెరుగుదలను నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? లేక పెరిగిన అద్దెలు, ఫీజులు చెల్లించే బాధ్యతను తీసుకుంటుందా? సస్థానికత ఉద్యోగుల పిల్లలకే వర్తిస్తుందా? ప్రైవేటు ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? 10 ఏళ్లపాటు హైదరాబాద్ మీద ఉన్న హక్కును కాదనుకొని డెడ్‌లైన్ తర్వాత ఏపీకి వెళితే.. స్థానికత లభించదా? -
ఉద్యాన శాఖ కార్యాలయంలో కంప్యూటర్ ధ్వంసం
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సమ్మెలో ఉంటూనే విధులు నిర్వర్తిస్తున్నారని మండిపడుతూ పలువురు సమైక్యవాదులు మంగళవారం స్థానిక ఉద్యానశాఖ ఏడీ-1 కార్యాలయంలో కంప్యూటర్ను ధ్వంసం చేశారు. కార్యాలయాలు వెంటనే మూసివేయాలని ఉద్యాన శాఖతో పాటు ఏపీఎంఐపీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఏడీ-1 కార్యాలయంలో సమైక్యవాదులు, సిబ్బంది మధ్య వాదోపవాదాలు శ్రుతి మించడంతో ఆగ్రహించిన ఉద్యమకారులు ఒక కంప్యూటర్ను పగులగొట్టారు. దీంతో వెంటనే కార్యాలయాలకు తాళాలు వేశారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది సమైక్య సమ్మెలో లేకున్నా ఉద్యమ తీవ్రత నేపథ్యంలో విధులకు హాజరుకావడం లేదని ఆ శాఖ అధికారులు తెలిపారు. అయితే... అత్యవసర పనుల నిమిత్తం ఒకరిద్దరు కొంతసేపు ఉండి వెళుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని సమైక్యవాదులు, అన్ని ఉద్యోగ సంఘాల జేఏసీలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో కూడా ఒకరిద్దరు పనిచేస్తుండగా సమైక్యవాదులు, ఉద్యోగ సంఘాల నేతలు వెళ్లి గొడవపడిన విషయం తెలిసిందే.