కొండవెలగాడలో ఉపాధి పనులు చేపడుతున్న వేతనదారులు
నెల్లిమర్ల:ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులకు తీపి కబురు. ఇప్పటివరకు అమలులో ఉన్న ఏడాదికి వంద పనిదినాల గండం గట్టెక్కింది. రోజుకు ఎంత కనిష్టంగా వేతనం వచ్చినా ఒకరోజుగా లెక్కించేవారు. ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్తి పలకనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రోజుకు రూ. 197 గరిష్ట వేతనాన్ని దృష్టిలో ఉంచుకుని వేతనాన్ని బట్టి పనిదినాలను లెక్కించే విధానం అమల్లోకి వచ్చింది. దీంతో ఒకే జాబ్‌కార్డులో ఉండే ఒకే కుటుంబానికి చెందిన వేతనదారులకు ప్రయోజనం చేకూరనుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా వ్యాప్తంగా ఉన్న 34 మండలాల్లో సుమారు నాలుగు లక్షల జాబ్‌కార్డులున్నాయి.
ఈ జాబ్‌కార్డుల ద్వారా మొత్తం 6 లక్షల మంది వేతనదారులు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సగటున రూ. 125 వేతనంగా అందుతోంది. ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి మార్చి వరకు సుమారు లక్ష జాబ్‌కార్డులకు వంద పని దినాలు పూర్తవుతున్నాయి. దీంతో సుమారు 1.5 లక్షల మంది వేతనదారులకు ఒకటి,రెండు నెలలు పని లేకుండా పోతోంది. వాస్తవానికి ఉపాధిహామీ వేతనదారులకు కేంద్రప్రభుత్వం నిర్ణయించిన సగటు వేతనం రూ 197. ఒక్కో జాబ్‌కార్డుకు ఏడాదికి వందరోజుల పనిదినాలు కల్పించి రూ. 20 వేలు వేతనంగా అందించాలనేది పథకం లక్ష్యం.
అయితే గరిష్ట వేతనం అందకుండానే పనిదినాలు పూర్తవడంతో వేతనదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వం నూతన విధానం అమలుకు సన్నాహాలు ప్రారంభించింది. పనికి వెళ్లే రోజులను లెక్కలోకి తీసుకోకుండా గరిష్ట వేతనాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. ఈ విధానం ప్రకారం ఒక జాబ్‌కార్డులోని వేతనదారులకు 197 రూపాయల వేతనం వచ్చినప్పుడే ఒక పనిదినంగా లెక్కగడతారు. ఉదాహరణకు ఒక జాబ్‌కార్డులో ఒకే వ్యక్తి వేతనదారుగా ఉంటే ఆర్థిక సంవత్సరంలో వేతనంగా పొందే మొత్తం రూ 19,700 అయితేనే వంద పనిదినాలు పూర్తయినట్లు లెక్కిస్తారు. అదే గతంలో అయితే వేతనంతో గాకుండా పనిదినాలను మాత్రమే లెక్కించేవారు. దీంతో వేతనదారులు ఇబ్బందిపడేవారు. పూర్తిస్థాయిలో వేతనాలు అందుకోకుండా వంద రోజులు పూర్తయ్యే లక్ష కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గరిష్ట వేతనం రూ. 197 వస్తేనే ఒక పనిదినంగా లెక్కించడం వల్ల మొత్తమ్మీద పనిది నాలు తగ్గిపోతాయని క్షేత్రసహాయకులు అంటున్నారు.
ఎంతో ప్రయోజనం
వేతనం కొలమానంగా పనిదినాలు లెక్కించడం వల్ల ఒకే జాబ్‌కార్డుతో పనిచేసే కుటుంబ సభ్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గతంలో వేతనం ఎంత తక్కువగా వచ్చినా వంద రోజులు పూర్తవగానే పని కల్పించలేకపోయేవాళ్లం. అయితే ఈ విధానంతో ఒక జాబ్‌కార్డుకు ఏడాదిలో రూ. 20వేలు ఆదాయం కల్పించాలన్నది మా లక్ష్యం. కొత్త విధానంతో జిల్లాకు చెందిన సుమారు 1.5లక్షల మంది వేతనదారులకు ప్రయోజనం చేకూరుతుంది.–బొడ్డేపల్లి రాజగోపాలరావు, డ్వామా పీడీ
ప్రచారం చేయాలి
వేతనాలు కొలమానంగా పనిదినాలు లెక్కించే విధానం మంచిదే. అయితే వేతనదారులు ఈ విధానంతో గందరగోళానికి గురయ్యే అవకాశముంది. వారంలో ఆరురోజులు పనికి వెళ్లినా గరిష్టంగా వేతనం రాకపోతే పనిదినాలు తగ్గిపోతాయి. దీనిపై సంబంధిత అధికారులు ప్రచారం చేయాలి. క్షేత్రసహాయకులు కూడా వేతనదారులకు అవగాహన కల్పించాలి.
–జీనపాటి శ్రీనివాసరావు, క్షేత్రసహాయకుల సంఘ జిల్లాఉపాధ్యక్షుడు.
Comments
Please login to add a commentAdd a comment