సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దాదాపు పూర్తిగా ఆగిపోయే వేసవి కాలంలో పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. పనులు దొరకక పేదలు నగరాలకు వలస పోయే దుస్థితి లేకుండా సొంత ఊళ్లలోనే వారికి పనులు కలి్పంచడంలో ఏపీ ఏటా ముందుంటోంది.
ప్రత్యేకించి వేసవి రోజుల్లో ఉపాధి పనుల కల్పనలో గత నాలుగేళ్లగా మన రాష్ట్రమే దేశంలో తొలి స్థానంలో నిలుస్తోంది. ఈ వేసవిలో కూడా ఏప్రిల్ 1 నుంచి శనివారం (మే 20) వరకు 6.83 కోట్ల పనిదినాల పాటు రాష్ట్ర ప్రభుత్వం పనులు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 99 శాతం గ్రామ పంచాయతీలు అంటే.. 13,132 గ్రామ పంచాయతీల్లో కేవలం 50 రోజుల్లోనే మొత్తం 31.70 లక్షల కుటుంబాలకు పని దొరికింది.
ప్రభుత్వం కల్పించిన పనులతో ఈ కుటుంబాలు రూ.1,657.58 కోట్ల మేర లబ్ధి పొందడం విశేషం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన తమిళనాడు 50 రోజుల కాలంలో 5.20కోట్ల పనిదినాలపాటు పనులు కలి్పంచింది. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఉన్నాయి.
ఒక్కొక్కరికి రోజుకు రూ.245
ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు ఈ ఏడాది అధిక మొత్తంలో కూలి సైతం గిట్టుబాటు అయ్యింది. ఈ 50 రోజుల్లో కూలీలకు సరాసరిన రోజుకు రూ.245 చొప్పున కూలి లభించింది. మరోవైపు ఈ పనులకు 60 శాతానికి పైగా మహిళలే హాజరై ఉపాధి పొందారు. అలాగే మొత్తం 6.83 కోట్ల పనిదినాల పాటు ఉపాధి పొందిన వారిలోనూ దాదాపు 32% మేర ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment