first position
-
LinkedIn Top Companies 2024: ఉత్తమ కంపెనీల్లో టీసీఎస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లింక్డ్ఇన్ ఉత్తమ కంపెనీల జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తొలి స్థానంలో నిలిచింది. యాక్సెంచర్, కాగి్నజెంట్, మక్వారీ గ్రూప్, మోర్గాన్ స్టాన్లీ, డెలాయిట్ వరుసగా ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ భారత్‌లోని టాప్ కంపెనీల జాబితాను మంగళవారం విడుదల చేసింది. 2024 సంవత్సరానికిగాను టాప్ 25 పెద్ద కంపెనీలతో పాటు ఈసారి టాప్ 15 మధ్యతరహా కంపెనీల అదనపు జాబితాను కూడా చేర్చింది. తదుపరి స్థాయికి వెళ్లే సామర్థ్యం, నైపుణ్యాల పెరుగుదల, సంస్థ స్థిరత్వం, కంపెనీ వెలుపల అవకాశాలు, సంస్థ అనుబంధం, లింగ వైవిధ్యం, విద్యా నేపథ్యం, ఉద్యోగుల ఉనికి వంటి కెరీర్లో పురోగతికి దారితీసే ఎనిమిది స్తంభాలపై ఆధారపడి కంపెనీల ర్యాంకింగ్‌లు ఉన్నాయని లింక్డ్ఇన్ తెలిపింది. -
‘చెంచు’ చిచ్చరపిడుగు
పది లక్షల మందిలో ప్రథముడు ఊహ తెలియకముందే అమ్మ ప్రేమకు దూరమయ్యాడు.. నాలుగేళ్లకే మంటలంటుకొని కాళ్లు, చేతులు, శరీరం కాలిపోయింది.. 60 శాతం గాయాలతో ఆస్పత్రికి తీసుకెళితే..బతకడమే కష్టమని డాక్టర్లు అన్నారు.. ఆరేళ్ల ప్రాయంలోనే 3 మేజర్ సర్జరీలు జరిగాయి. ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లోకి రాలేదు... ఈ పరిచయమంతా ఓ నల్లమల కుర్రాడి గురించి... లోకం పోకడనే తెలియని.. ఇప్పటికీ నాగరికతకు దూరంగా ఉండే చెంచుల నుంచి ఓ చిచ్చర పిడుగు జాతీయస్థాయిలో ప్రతిభ చాటాడు. పదిలక్షల మంది విద్యార్థులు పోటీ పడగా, అందరికంటే ముందువరుసలో నిలిచాడు.. అతడే ’మిలియనీర్ ’దినేశ్. సాక్షి, ప్రత్యేకప్రతినిధి/నాగర్‌కర్నూల్ : వ్యక్తిగత పరిశుభ్రతపై దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో నల్లమలకు చెందిన విద్యార్థి ప్రతిభ చాటాడు. అపోలో హాస్పిటల్, డెటాల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన టోటల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతపై పరీక్ష జరగ్గా, ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న దినేష్ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచాడు. దినేష్ బతకడమే కష్టమన్నారు... నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరుకు చెందిన దినేష్ తండ్రి కరమ్‌చంద్ కొన్నాళ్లు కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేశాడు. ఈయన భార్య మహేశ్వరి దినేష్‌కు ఊహ తెలియకముందే కన్నుమూసింది. తల్లి ప్రేమకు దూరమై పెరిగిన దినేష్ నాలుగేళ్ల వయసులో ఇంట్లో స్టవ్ దగ్గర ఆడుకుంటుండగా ప్రమాదం జరిగింది. ముఖం, కాళ్లు, చేతులు 60 శాతం కాలిపోయాయి. చికిత్స చేసే ముందే డాక్టర్లు దినేష్ బతకడమే కష్టమన్నారు. ఐదేళ్లకు ఒక ఆపరేషన్, ఆరేళ్ల వయసులో దినేష్‌కు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. తర్వాత కొంతవరకు శరీరం సాధారణ స్థితికి వచ్చింది. ఇప్పటికీ ముఖం, చేతులు మామూలు స్థితికి చేరుకోలేదు. కాళ్లు పూర్తి స్థాయిలో పనిచేయడానికి మరో శస్త్రచికిత్స చేయాలని డాక్డర్లు చెప్పారు. ఐదో తరగతి నుంచి ‘ట్రైబల్ వేల్ఫేర్’లోకి మన్ననూర్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో దినేష్ ఐదోతరగతిలో చేరాడు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. క్లాస్‌లో తనే టాపర్. ఆంగ్లంపై ఉన్న మక్కువ, పట్టు గుర్తించిన టీచర్లు ఉదయ్‌కుమార్, ఆంజనేయులు దినేష్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అతడి పరిజ్ఞానాన్ని పెంచుతున్నారు. ఫలితంగా ట్రైబల్ సొసైటీ సారథ్యంలో జరిగిన పలు డిబేట్లు, ఇగ్నైట్ ఫెస్ల్లో అనేక బహుమతులు పొందాడు. 2500 పాఠశాలలు...పదిలక్షల మంది విద్యార్థులు డెటాల్ సంస్థ అపోలో ఫౌండేషన్‌తో కలిసి బాలబాలికల్లో స్వీయ, పరిసరాల పరిశుభ్రతతో పాటు కాలుష్య నియంత్రణపై అవగాహనకు ప్రతి ఏటా హైజిన్ ఒలింపియాడ్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 4–15 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరిగింది. ఒకటి నుంచి పదోతరగతి వరకు ప్రతి రెండు తరగతులను ఒక కేటగిరిగా చేసి మొత్తంగా ఐదు కేటగరిలో పరీక్ష నిర్వహిస్తారు. 9–10 తరగతుల కేటగిరిలో దేశ వ్యాప్తంగా 2500 పాఠశాలల నుంచి పది లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 50 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష జరిగింది. దినేష్ పూర్తి మార్కులతో పాటు చేతిరాత, పరీక్ష రాసిన విధానం ఆధారంగా అదనపు మార్కులతో కలిపి 51 మార్కులు సాధించాడు. దీంతో జాతీయస్థాయిలో దినేష్‌కు ప్రథమస్థానం వచ్చినట్లు డెటాల్ సంస్థ ప్రకటించింది. అక్టోబర్ 2న ముంబైలో జరిగే కార్యక్రమంలో దినేష్ రూ. లక్ష నగదుతోపాటు పురస్కారం అందుకోనున్నాడు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యార్థి దినేష్‌ను నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్‌కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మన్ననూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి, ఉపాధ్యాయులు ఆంజనేయులు, చంద్రశేఖర్, గణేష్, విద్యార్థి తండ్రి కరంచంద్ పాల్గొన్నారు. నిక్ వుజిసిక్ నాకు స్ఫూర్తి తన అంగవైకల్యాన్ని అధిగమించి ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్‌గా మారిన నిక్ వుజిసిక్ నాలో స్ఫూర్తి నింపారు. అవకాశాలు అనేవి అందరికీ సమానమే. వాటిని అందిపుచ్చుకోవడమే మనవంతు అని నేర్చుకున్నా. అదే స్ఫూర్తితో ముందుకు వెళుతున్నా. చదువుతోపాటు క్రికెట్ నా హాబీ. బెస్ట్ కీపర్‌గా నా మార్కు చూపిస్తున్నా. సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించాలని అనుకుంటున్నా. – దినేష్ -
రికార్డు స్థాయిలో ‘క్రెడిట్ కార్డ్’ వినియోగం
ముంబై: క్రెడిట్ కార్డుల వినియోగం దేశంలో పెద్ద ఎత్తున పెరుగుతోంది. మే నెలలో క్రెడిట్ కార్డులపై రూ.1.4 లక్షల కోట్లు వ్యయం చేయడమే ఇందుకు నిదర్శనం. క్రెడిట్ కార్డులపై బకాయిలు గత ఆర్థిక సంవత్సరంలో స్థిరంగా ఉండగా, ఈ ఏడాది ప్రతీ నెలా 5 శాతం చొప్పున పెరుగుతూ వస్తున్నట్టు ఆర్బీఐ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి క్రెడిట్ కార్డుల సంఖ్య 50 లక్షలకు పైగా పెరిగింది. మే చివరికి మొత్తం 8.74 కోట్లకు కార్డుల సంఖ్య చేరింది. కొత్తగా జారీ అయిన క్రెడిట్ కార్డుల్లో 20 లక్షల యూజర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే గణనీయంగా వినియోగించారు. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలో యాక్టివ్ (వినియోగంలో ఉన్నవి) క్రెడిట్ కార్డుల సంఖ్య 8.24 కోట్లు కాగా, ఫిబ్రవరిలో 8.33 కోట్లు, మార్చి చివరికి 8.53 కోట్లు, ఏప్రిల్ చివరికి 8.65 కోట్లు చొప్పున పెరుగుతూ వచి్చంది. 2022–23లో ఏడాది అంతటా క్రెడిట్ కార్డులపై వినియోగం ప్రతి నెలా సగటున రూ.1.1–1.2 లక్షల కోట్లుగా ఉంటూ వచి్చంది. ఈ ఆర్థిక సంవత్సరం మే నెలకు వచ్చే సరికి రూ.1.4 లక్షల కోట్లకు పెరిగింది. ఒక్కో కార్డుపై సగటు వ్యయం రూ.16,144గా ఉంది. మొదటి స్థానంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మే చివరి నాటికి 1.81 కోట్ల కార్డులతో (వినియోగంలో ఉన్న) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. క్రెడిట్ కార్డు రుణాల పరంగానూ 28.5 శాతం వృద్ధితో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 1.73 కోట్ల కార్డులతో ఎస్బీఐ కార్డ్ రెండో స్థానంలో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ 1.46 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ 1.24 కోట్ల కార్డులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సిటీ బ్యాంక్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడంతో, 1,62,150 లక్షల కొత్త కార్డులు యాక్సిస్ బ్యాంక్ పోర్ట్‌ఫోలియోకు తోడయ్యాయి. మరోవైపు క్రెడిట్ కార్డు రుణాలు గణనీయంగా వృద్ధి చెందుతుండడంతో, ఈ విభాగంలో నిరర్థక ఆస్తులు (వసూలు కాని బకాయిలు/ఎన్పీఏలు) 0.66 శాతం పెరిగి ఈ ఏడాది మార్చి నాటికి 2.94 శాతానికి చేరినట్టు ఇటీవలే ట్రాన్స్‌యూనియన్ సిబిల్ ఓ నివేదిక రూపంలో వెల్లడించడం గమనార్హం. -
‘ఉపాధి’లో మళ్లీ ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దాదాపు పూర్తిగా ఆగిపోయే వేసవి కాలంలో పేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. పనులు దొరకక పేదలు నగరాలకు వలస పోయే దుస్థితి లేకుండా సొంత ఊళ్లలోనే వారికి పనులు కలి్పంచడంలో ఏపీ ఏటా ముందుంటోంది. ప్రత్యేకించి వేసవి రోజుల్లో ఉపాధి పనుల కల్పనలో గత నాలుగేళ్లగా మన రాష్ట్రమే దేశంలో తొలి స్థానంలో నిలుస్తోంది. ఈ వేసవిలో కూడా ఏప్రిల్ 1 నుంచి శనివారం (మే 20) వరకు 6.83 కోట్ల పనిదినాల పాటు రాష్ట్ర ప్రభుత్వం పనులు కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 99 శాతం గ్రామ పంచాయతీలు అంటే.. 13,132 గ్రామ పంచాయతీల్లో కేవలం 50 రోజుల్లోనే మొత్తం 31.70 లక్షల కుటుంబాలకు పని దొరికింది. ప్రభుత్వం కల్పించిన పనులతో ఈ కుటుంబాలు రూ.1,657.58 కోట్ల మేర లబ్ధి పొందడం విశేషం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన తమిళనాడు 50 రోజుల కాలంలో 5.20కోట్ల పనిదినాలపాటు పనులు కలి్పంచింది. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఉన్నాయి. ఒక్కొక్కరికి రోజుకు రూ.245 ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు ఈ ఏడాది అధిక మొత్తంలో కూలి సైతం గిట్టుబాటు అయ్యింది. ఈ 50 రోజుల్లో కూలీలకు సరాసరిన రోజుకు రూ.245 చొప్పున కూలి లభించింది. మరోవైపు ఈ పనులకు 60 శాతానికి పైగా మహిళలే హాజరై ఉపాధి పొందారు. అలాగే మొత్తం 6.83 కోట్ల పనిదినాల పాటు ఉపాధి పొందిన వారిలోనూ దాదాపు 32% మేర ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు తెలిపారు. -
Burgundy Private Hurun India 500: విలువలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నంబర్ 1
ముంబై: దేశంలో అత్యంత విలువైన (మార్కెట్ విలువ ఆధారితంగా) లిస్టెడ్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదటి స్థానంలో నిలిచింది. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. ‘2022 బర్గండి ప్రైవేట్ హరూన్ ఇండియా 500’ కంపెనీల జాబితా గురువారం విడుదలైంది. 500 కంపెనీల ఉమ్మడి విలువ రూ.226 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్ మార్కెట్ విలువ రూ.17.25 లక్షల కోట్లు. రెండో స్థానంలో ఉన్న టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.11.68 లక్షల కోట్లుగా ఉంది. రూ.8.33 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మూడో స్థానంలో నిలిచింది. ఇన్ఫోసిస్ (రూ.6.46 లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.6.33 లక్షల కోట్లు), ఎయిర్టెల్ (రూ.4.89 లక్షల కోట్లు), హెచ్డీఎఫ్సీ (రూ.4.48 లక్షల కోట్లు), ఐటీసీ (రూ.4.32 లక్షల కోట్లు), అదానీ టోటల్ గ్యాస్ (రూ.3.96 లక్షల కోట్లు), అదానీ ఎంటర్ప్రైజెస్ రూ.3.81 లక్షల కోట్ల విలువతో టాప్–10లో ఉన్నాయి. అదానీ కంపెనీలు ఎనిమిది.. ‘‘గౌతమ్ అదానీకి సంబంధించి ఏడు కంపెనీలు ఇందులో ఉన్నాయి. అంబుజా సిమెంట్స్ కొనుగోలుతో ఎనిమిదో కంపెనీ వచ్చి చేరింది. ఉపఖండంలో అత్యంత సంపన్నుడు కావడందో ఇదేమీ ఆశ్చర్యాన్నివ్వలేదు. టాటా సన్స్ నుంచి ఆరు కంపెనీలు, సంజీవ్ గోయెంకా నుంచి మూడు, కుమార మంగళం బిర్లా నుంచి మూడు చొప్పున కంపెనీలు జాబితాలో ఉన్నాయి’’అని హరూన్ ఇండియా ఎండీ అనాస్ రెహమాన్ జునైద్ తెలిపారు. లిస్టులో తెలంగాణ సంస్థల సంఖ్య రెండు పెరిగి 31కి చేరింది. టాప్ 10 యంగెస్ట్ కంపెనీల జాబితాలో సువెన్ ఫార్మా, మెన్సా బ్రాండ్స్ చోటు దక్కించుకున్నాయి. -
ఐఐటీ–మద్రాస్ అత్యుత్తమం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో అత్యుత్తుమ విద్యా సంస్థల జాబితాలో ఐఐటీ–మద్రాస్ వరసగా నాలుగో ఏడాది తొలి స్థానంలో నిలిచింది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)–బెంగళూరు తొలి స్థానం దక్కించుకుంది. ఫార్మసీ విభాగంలో నైపర్–హైదరాబాద్ రెండో ర్యాంకు, న్యాయ విద్యలో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా నాలుగో ర్యాంకు సాధించాయి. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) కింద 11 విభాగాల్లో ర్యాంకుల జాబితాను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం విడుదల చేశారు. 2016 నుంచి కేంద్ర విద్యా శాఖ ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. విశ్వవిద్యాలయాల విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీకి 22వ ర్యాంకు, ఆంధ్ర యూనివర్సిటీ 36వ ర్యాంకు లభించింది. టాప్–100 ఇంజనీరింగ్ కాలేజీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 9 కాలేజీలున్నాయి. టాప్–100 ఫార్మసీ కాలేజీల్లో రెండు రాష్ట్రాలకు చెందిన 15 కాలేజీలున్నాయి. పరిశోధన విభాగంలో ఐఐటీ–హైదరాబాద్ 12వ ర్యాంకు సాధించింది. మెడికల్ విభాగంలో 50 ర్యాంకులు ప్రకటించగా తెలంగాణ, ఏపీలోని కళాశాలలకు స్థానం దక్కలేదు. ఓవరాల్ ర్యాంకింగ్ ఐఐటీ–మద్రాస్ (87.59 స్కోరు) తొలిస్థానంలో నిలవగా, 83.57 స్కోరుతో ఐఐఎస్సీ–బెంగళూరు రెండోస్థానంలో 82.35 స్కోరుతో ఐఐటీ–బాంబే మూడో స్థానంలో నిలిచాయి. ఐఐటీ–హైదరాబాద్ 62.86 స్కోరుతో 14వ ర్యాంకు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 59.67 స్కోరుతో 20వ ర్యాంకు, ఎన్ఐటీ–వరంగల్ 50.61 స్కోరుతో 45వ ర్యాంకు, ఉస్మానియా యూనివర్సిటీ 50.60 స్కోరుతో 46వ ర్యాంకు సాధించాయి. కాలేజీల విభాగంలో ఆంధ్రా లయోలా కాలేజ్ (విజయవాడ) 52.38 స్కోరుతో 94వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్ ఐఐటీ మద్రాస్ 90.94 స్కోరుతో తొలిస్థానం, ఐఐటీ న్యూఢిల్లీ 88.12 స్కోరుతో రెండో స్థానం, ఐఐటీ బాంబే 83.96 స్కోరుతో మూడో స్థానంలో నిలిచాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఐటీ హైదరాబాద్ 68.03 స్కోరుతో తొమ్మిదో స్థానం, ఎన్ఐటీ వరంగల్ 60 స్కోరుతో 21వ ర్యాంకు, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 44వ ర్యాంకు, ఐఐటీ తిరుపతి 48.16 స్కోరుతో 56వ ర్యాంకు, ఐఐఐటీ–హైదరాబాద్ 46.41 స్కోరుతో 62వ ర్యాంకు, జేఎన్టీయూ–హైదరాబాద్ 42.77 స్కోరుతో 76వ ర్యాంకు సాధించాయి. మేనేజ్మెంట్ ఐఐఎం–అహ్మదాబాద్ 83.35 స్కోరుతో తొలి ర్యాంకు, ఐఐఎం–బెంగళూరు 82.62 స్కోరుతో 2వ ర్యాంకు, ఐఐఎం–కలకత్తా 78.64 స్కోరుతో మూడో ర్యాంకు సాధించాయి. ఇక్ఫాయ్ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్–హైదరాబాద్ 54.88 స్కోరుతో 32వ ర్యాంకు, ఐఐఎం–విశాఖపట్నం 54.36 స్కోరుతో 33వ ర్యాంకు, కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 51.27 స్కోరుతో 47వ ర్యాంకు సాధించాయి. ఫార్మసీ జామియా హమ్దర్ద్–న్యూఢిల్లీ 79.50 స్కోరుతో తొలి ర్యాంకు, నైపర్–హైదరాబాద్ 79.46 స్కోరుతో రెండో ర్యాంకు సాధించగా, హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ 47.38 స్కోరుతో 44వ ర్యాంకు సాధించింది. -
హైదరాబాద్ సీసీ‘ఠీవీ’
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరం మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రతీ వెయ్యి మంది పౌరులకు 29.99 క్లోజ్డ్ సర్క్యూట్ టీవీ (సీసీటీవీ) సర్వైలెన్స్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా కొత్త రికార్డు సృష్టించింది. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ రాజధాని టాప్‌ప్లేస్‌లో నిలవగా, ప్రపంచంలో 16వ స్థానం పొందింది. ఈ జాబితాలో ›ప్రపంచ వ్యాప్తంగా టాప్–50 నగరాల్లో చెన్నైకు 21, దేశ రాజధాని ఢిల్లీకి 33వ ర్యాంక్ లభించాయి. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన వీపీఎన్, యాంటీ వైరస్, యాప్స్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ ‘కంపారిటెక్’ ప్రపంచంలోని అధిక జనాభా ఉన్న 150 ప్రధాన నగరా ల్లోని సీసీటీవీల సంఖ్యను సేకరించింది. ప్రభుత్వాల నివేదికలు, పోలీస్ వెబ్సైట్లు, పత్రికల్లో వచ్చిన కథనాలు, రిపోర్ట్లు, ఇతర రూపాల్లో డేటాను సేకరించి, సమాచారాన్ని క్రోడీకరించింది. పోలీస్, ప్రభుత్వ శాఖలు, సంస్థలు ఉపయోగి స్తున్న సీసీటీవీలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ పరిశీలన జరిపినట్టు వార్షిక నివేదికలో ఈ సంస్థ పేర్కొంది. చైనాలోనే అత్యధికం ప్రపంచంలోనే అత్యధిక సీసీటీవీ కెమెరాల సర్వైలెన్స్ చైనాలోనే ఉన్నట్టు ఈ సంస్థ విశ్లేషించింది. ప్రధానంగా మొదటి 20 నగరాల్లో.. ప్రతీ వెయ్యిమందికి ఎన్ని సీసీటీవీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయన్న విషయంలో లండన్ మూడో స్థానంలో, భారత్‌లోని తెలంగాణ రాష్ట్రం 16వ స్థానంలో నిలవగా మిగతా నగరాలన్నీ కూడా చైనాలోనివే కావడం దీనినే స్పష్టంచేస్తోంది. ఐహెచ్ ఎస్ మార్కిట్ తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచం లోని మొత్తం 77 కోట్ల సర్వైలెన్స్ కెమెరాల్లో 41.58 కోట్లు (54 శాతం) చైనాలో ఉన్నాయి. 2021కల్లా ప్రపంచంలోని సీసీటీవీలు వంద కోట్లకు చేరుకుంటుండగాఅందులో 54 కోట్లు చైనాలోనే ఉంటాయని ఐహెచ్ఎస్ అంచనా వేస్తోంది. అనేక సౌలభ్యాలు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో సీసీటీవీలను నేరాల నివారణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, క్రమబద్ధీకరణ, మనుషులు పనిచేయడానికి వీలుకాని పరిస్థితుల్లో పారిశ్రామిక కార్యకలాపాల నిర్వహణ వంటి వాటికి నిర్వహిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో పాటు మెరుగైన ఫీచర్లతో కెమెరాలు కూడా చౌకగానే అందుబాటులో లభిస్తున్నాయి. సీసీటీవీలతో నిఘా, పర్యవేక్షణ వల్ల పౌరులకు రక్షణ, భద్రతతో పాటు మరింత సమర్థవంతంగా సేవలందించే వీలు ఏర్పడింది. అయితే పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత హక్కుకు సీసీటీవీల నిఘా వల్ల భంగం వాటిల్లుతుందనే వారూ ఉన్నారు. ఏదేమైనా ప్రపంచవ్యాపంగా వీటి వినియోగం మాత్రం గణనీయంగా పెరుగుతోంది. పరిశీలన ఇలా.. 150 నగరాల్లోని జనాభా, సీసీటీవీల సంఖ్య, ప్రతి వెయ్యి మందికి ఎన్ని కెమెరాలు అందుబాటులో ఉన్నాయి?, క్రైమ్‌రేట్ వంటి వాటిపై ‘కంపారిటెక్’ దృష్టిపెట్టింది. అయితే సీసీటీవీ కెమెరాల సంఖ్య ఎక్కువగా ఉన్నంత మాత్రాన నేరాల తగ్గుదలతో పాటు పౌరుల భద్రత, రక్షణ బాగా ఉన్నాయని చెప్పడానికి వీల్లేదని పరిశోధకులు పేర్కొన్నారు. -
ట్విటర్లో ప్రధాని మోదీ టాప్
న్యూఢిల్లీ: ప్రధానిమోదీ ట్విటర్లో దూసుకుపోతున్నారు. తాజా గణాంకాల ప్రకారం ట్విటర్లో మోదీ 2.21 కోట్ల మంది ఫాలోవర్లతో తొలిస్థానంలో ఉండగా, తర్వాతి స్థానంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఉన్నారు. అమితాబ్‌కు ట్విటర్లో 2.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ట్విటర్లో ఎక్కువ మంది ఫాలో అయ్యే భారతీయుడిగా మోదీ రికార్డులకెక్కారు. మూడో స్థానంలో షారుక్‌ఖాన్‌లు ఉన్నారు. -
ఆస్తి పన్ను వసూలులో ఫస్ట్
పన్నుల వసూలులో బొబ్బిలి పురపాలక సంఘం సత్తాచాటింది. రాష్ర్టస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి 98.81 శాతం పన్నులు వసూలు చేసి శెభాష్ అనిపించుకుంటున్నారు. బొబ్బిలి: పట్టణాల్లో ఆస్తి పన్ను వసూలులో బొబ్బిలి పురపాలక సంఘం ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో అన్ని పురపాలక సంఘాల్లో కంటే బొబ్బిలిలో ఈ ఏడాది 98.81 శాతం పన్నులు వసూలు చేశారు. ఏటా మార్చి నెలకు పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. కోర్టు కేసులు, ప్రభుత్వ భవనాలు వంటి కారణాలతో వసూలులో జాప్యం ఉంటుంది. అయినా బొబ్బిలిలో మాత్రం 98 శాతం దాటి పన్నులు వసూలు చేయడంతో ఉద్యోగులను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. కమిషనర్ హెచ్.శంకరరావు, ఆర్వో రమేష్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఇలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేసి లక్ష్యాన్ని చేరుకున్నారు. లక్ష్యం రూ.4.72 కోట్లు.. సాధించింది రూ.4.66 కోట్లు పట్టణంలో 11,767 ఇళ్లు ఉన్నాయి. వాటి ద్వారా 4 కోట్ల 72 లక్షల రూపాయలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటిలో రూ.4 కోట్ల 66 లక్షలు వసూలు చేసి 98.81 శాతంతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచా రు. ప్రతి వార్డుకు కొన్ని బృందాలను నియమించి బకాయిలు లేకుండా పూర్తిస్థాయిలో పన్నులు వసూలు చేశా రు. మొండి బకాయిదారుల వద్దకు కమిషనర్ శంకరరావుతో పాటు అధికారులు వెళ్లి అవగాహన కల్పించి అక్కడికక్కడే వసూలు చే శారు. ప్రత్యేక వ్యాను ద్వా రా ఉద్యోగులు ఊరంతా తిరిగి మైక్ ద్వారా ప్రచారం చేసి వసూలు చే యడంలో సఫలీకృతమయ్యారు. ఏటా మార్చి నెలాఖరు న పన్ను చెల్లింపుల్లో వడ్డీ రాయితీ ఇవ్వడం ప్రభుత్వం అలవాటు చేసింది. రెండేళ్లుగా ఆ పద్ధతి లేకపోవడంతో ఆఖరి నిమిషం వరకూ బకాయిదారులకు, ఆశతో ఉండేవారికి మున్సిపల్ ఉద్యోగులు కల్పించారు. అలాగే బకాయిలు కట్టడానికి పదే పదే తిప్పుతున్న వారింటికి వెళ్లి దండోరా మంత్రం ప్రయోగించడం కూడా ఫలితమిచ్చింది. సమష్టి కృషికి ఫలితమిది... బొబ్బిలి పురపాలక సంఘ ఉద్యోగుల సమష్టి కృషికి ఫలితమిది. లక్ష్యాలను ముందు నుంచి చేరుకోవాలని ప్రణాళిక ప్రకారం వెళ్లాం. రాత్రింబవళ్లు కష్టపడ్డాం. రాజకీయ నాయకులు పన్నులు చెల్లించడానికి పూర్తిగా సహకరించారు. పట్టణ ప్రజలు కూడా పన్నుల చెల్లింపునకు ముందుకొచ్చారు. -హెచ్.శంకరరావు, కమిషనర్, బొబ్బిలి -
టీడీపీ సభ్యత్వాల్లో జిల్లాకు ప్రథమస్థానం : పర్వత
సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీ సభ్యత్వ నమోదులో జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందని ఆ పార్టీ జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్ పర్వత చిట్టిబాబు చెప్పారు. ఆదివారం రాత్రి కాకినాడలో జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీ అధిష్టానం రెండులక్షల 70వేల సభ్యత్వాలు లక్ష్యంగా నిర్ణయించగా 3.74 లక్షలు నమోదు చేశామని చెప్పారు. యువతతోపాటు మహిళలు సభ్యత్వాలు తీసుకునేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారన్నారు. జిల్లాలో సభ్యత్వాల నమోదు ద్వారా రూ.మూడు కోట్ల 79 లక్షలు సమకూరిందని, సభ్యత్వం తీసుకున్న ప్రతివారికీ ప్రమాదబీమా సౌకర్యం కల్పించామని చెప్పారు. వచ్చే నెలాఖరుకల్లా జిల్లాలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్‌గా నియమించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరి సహకారంతో పార్టీని ముందుకు తీసుకు వెళ్తానని చెప్పారు. కార్యాలయ కార్యదర్శి మందాల గంగసూర్యనారాయణ, ఉల్లి రాజబాబు, కత్తిపూడి శివ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాలలో భార త్ మొదటి స్థానం
స్కూల్ బస్సుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం వోల్వో బస్సు యజమానులకు కట్టుదిట్టమైన సూచనలు చేశాం : మంత్రి రామలింగారెడ్డి బెంగళూరు, న్యూస్‌లైన్ : ప్రమాదాలు సృష్టించడంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో నిలవడం చాలా బాధాకరంగా ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ... గత ఏడాది దేశంలో 34,93,803 ప్రమాదలు జరిగాయని, అందులో 1,38,250 మంది మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. అదే విధంగా అదే ఏడాది కర్ణాటకలో 36,395 ప్రమాదాలు జరిగాయని 8,051 మంది మరణించాని అన్నారు. బెంగళూరు నగరంలో 5,217 ప్రమాదాలు జరిగితే అందులో 767 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి ఎక్కువ వాహనాలు ఉన్న దేశాలలో భారత్ 12వ స్థానంలో ఉందని అన్నారు. అయితే ప్రమాదాలు సృష్టించడంలో కూడా ప్రపంచ దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉందని విచారం వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ప్రమాదాలు తగ్గించడానికి అనేక జాగృతి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని రామలింగారెడ్డి చెప్పారు. స్కూల్ పిల్లలను తీసుకు వెళ్లే వాహనాలలో నియమాలు ఉల్లంఘించే వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని రావాణ శాఖ మంత్రి రామలింగారెడ్డి హెచ్చరించారు. ఇటీవల నాలుగు వోల్వో బస్సు ప్రమాదాలు జరిగాయని అన్నారు. వోల్వో బస్సుల లోపాల వలన ప్రమాదాలు జరిగాయా, డ్రైవర్ల నిర్లక్షం కారణంగా ప్రమాదాలు జరిగాయా అని దర్యాప్తు జరుగుతోందన్నారు. వోల్వో బస్సులలో డీజిల్ ట్యాంక్‌లు, ఏసీ మిషన్లు నాసిరకంగా ఉన్నాయని విచారణలో వెలుగు చూశాయని చెప్పారు. వోల్వో బస్సులలో ఎమర్జెన్సీ డోర్లు, వాటర్ ట్యాంక్‌లు ఏర్పాటు చెయ్యాలని వోల్వో బస్సు కంపెనీ ప్రతినిధులకు సూచించామని అన్నారు. నియమాలు ఉల్లంఘించి బస్సులు తయారు చేస్తే వాటిని రోడ్డు మీద తిరగడానికి అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. ప్రయాణికులను సురక్షితంగా తరలించడానికి ఇప్పటికే వాహన యజమానులకు 13 షరతులు విధించామని చెప్పారు. షరతులు ఉల్లంఘంచిన వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎమర్జెన్సీ డోర్లలో ప్రకటనల బోర్డులు ఏర్పాటు చెయ్యడం పూర్తిగా నిషేధించామని మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. సమావేశంలో రాష్ట్ర రోడ్డు రావాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.