హైదరాబాద్‌ సీసీ‘ఠీవీ’ | Comparitech Says Hyderabad Stands First Position In Most Surveilled In India | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ సీసీ‘ఠీవీ’

Published Fri, Jul 24 2020 1:25 AM | Last Updated on Fri, Jul 24 2020 8:05 AM

Comparitech Says Hyderabad Stands First Position In Most Surveilled In India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ మహానగరం మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రతీ వెయ్యి మంది పౌరులకు 29.99 క్లోజ్డ్‌ సర్క్యూట్‌ టీవీ (సీసీటీవీ) సర్వైలెన్స్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా కొత్త రికార్డు సృష్టించింది. ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ రాజధాని టాప్‌ప్లేస్‌లో నిలవగా, ప్రపంచంలో 16వ స్థానం పొందింది. ఈ జాబితాలో ›ప్రపంచ వ్యాప్తంగా టాప్‌–50 నగరాల్లో చెన్నైకు 21, దేశ రాజధాని ఢిల్లీకి 33వ ర్యాంక్‌ లభించాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన వీపీఎన్, యాంటీ వైరస్, యాప్స్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ సంస్థ ‘కంపారిటెక్‌’ ప్రపంచంలోని అధిక జనాభా ఉన్న 150 ప్రధాన నగరా ల్లోని సీసీటీవీల సంఖ్యను సేకరించింది. ప్రభుత్వాల నివేదికలు, పోలీస్‌ వెబ్‌సైట్లు, పత్రికల్లో వచ్చిన కథనాలు, రిపోర్ట్‌లు, ఇతర రూపాల్లో డేటాను సేకరించి, సమాచారాన్ని క్రోడీకరించింది. పోలీస్, ప్రభుత్వ శాఖలు, సంస్థలు ఉపయోగి స్తున్న సీసీటీవీలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ పరిశీలన జరిపినట్టు వార్షిక నివేదికలో ఈ సంస్థ పేర్కొంది.

చైనాలోనే అత్యధికం
ప్రపంచంలోనే అత్యధిక సీసీటీవీ కెమెరాల సర్వైలెన్స్‌ చైనాలోనే ఉన్నట్టు ఈ సంస్థ విశ్లేషించింది. ప్రధానంగా మొదటి 20 నగరాల్లో.. ప్రతీ వెయ్యిమందికి ఎన్ని సీసీటీవీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయన్న విషయంలో లండన్‌ మూడో స్థానంలో, భారత్‌లోని తెలంగాణ రాష్ట్రం 16వ స్థానంలో నిలవగా మిగతా నగరాలన్నీ కూడా చైనాలోనివే కావడం దీనినే స్పష్టంచేస్తోంది. ఐహెచ్‌ ఎస్‌ మార్కిట్‌ తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచం లోని మొత్తం 77 కోట్ల సర్వైలెన్స్‌ కెమెరాల్లో 41.58 కోట్లు (54 శాతం) చైనాలో ఉన్నాయి. 2021కల్లా ప్రపంచంలోని సీసీటీవీలు వంద కోట్లకు చేరుకుంటుండగాఅందులో 54 కోట్లు చైనాలోనే ఉంటాయని ఐహెచ్‌ఎస్‌ అంచనా వేస్తోంది.

అనేక సౌలభ్యాలు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో సీసీటీవీలను నేరాల నివారణ, ట్రాఫిక్‌ పర్యవేక్షణ, క్రమబద్ధీకరణ, మనుషులు పనిచేయడానికి వీలుకాని పరిస్థితుల్లో పారిశ్రామిక కార్యకలాపాల నిర్వహణ వంటి వాటికి నిర్వహిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో పాటు మెరుగైన ఫీచర్లతో కెమెరాలు కూడా చౌకగానే అందుబాటులో లభిస్తున్నాయి. సీసీటీవీలతో నిఘా, పర్యవేక్షణ వల్ల పౌరులకు రక్షణ, భద్రతతో పాటు మరింత సమర్థవంతంగా సేవలందించే వీలు ఏర్పడింది. అయితే పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత హక్కుకు సీసీటీవీల నిఘా వల్ల భంగం వాటిల్లుతుందనే వారూ ఉన్నారు. ఏదేమైనా ప్రపంచవ్యాపంగా వీటి వినియోగం మాత్రం గణనీయంగా పెరుగుతోంది.

పరిశీలన ఇలా..
150 నగరాల్లోని జనాభా, సీసీటీవీల సంఖ్య, ప్రతి వెయ్యి మందికి ఎన్ని కెమెరాలు అందుబాటులో ఉన్నాయి?, క్రైమ్‌రేట్‌ వంటి వాటిపై ‘కంపారిటెక్‌’ దృష్టిపెట్టింది. అయితే సీసీటీవీ కెమెరాల సంఖ్య ఎక్కువగా ఉన్నంత మాత్రాన నేరాల తగ్గుదలతో పాటు పౌరుల భద్రత, రక్షణ బాగా ఉన్నాయని చెప్పడానికి వీల్లేదని పరిశోధకులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement