వలంటీర్ల కొనసాగింపు, వేతనాల పెంపుపై వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్న
నేడు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో చర్చ
ప్రభుత్వ ఉద్దేశంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం
వలంటీర్లను కొనసాగిస్తామని, వేతనం పెంచుతామని ఎన్నికల్లో బాబు హామీ
అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టిన బాబు సర్కారు
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కిత్రం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించే అలోచనలో ఉందా లేదా అన్న అంశంపై మంగళవారం శాసన సభ సమావేశాల ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో చర్చ జరగనుంది. మంగళవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ముందుగా నిర్ణయించిన పది ప్రశ్నల్లో ఈ అంశం మూడోది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, బి. విరూపాక్షి లేవనెత్తిన ఈ ప్రశ్నకు సాంఘిక సంక్షేమ శాఖ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖల మంత్రి డోలా బాల వీరాంజనేయులు సమాధానం చెప్పనున్నారు.
ఈ సందర్బంగా సభలో జరిగే చర్చలో వలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వ ఆలోచనలు, సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా.. వారి గౌరవ వేతనం పెంపు హామీని నిలబెట్టుకుంటారా అన్న విషయాలపై చాలా వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
త్రిశంకుస్వర్గంలో వలంటీర్ల వ్యవస్థ
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి, వారికి అన్ని విధాలా సహకరించేందుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 ఆగస్టులో వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడేవారు. దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి మాట మార్చేశారు. వలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ. 10 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఊసే ఎత్తడంలేదు.
పైగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జులై ఒకటి నుంచి చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లను తప్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేశారు. వలంటీర్లు ప్రతి నెలా కీలకంగా నిర్వహించే విధుల్లో పింఛన్ల పంపిణీ ప్రధానమైనది. అటువంటి కార్యక్రమానికే దూరంగా పెట్టడంతో వలంటీర్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు ఏమిటన్న విషయంపై అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుందా లేదంటే ఇంకేమైనా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవే అనుమానాలతో రాష్ట్రంలో పలుచోట్ల వలంటీర్లు ఆందోళనలు చేస్తున్నారు. సోమవారం విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద ప్రస్తుతం అధికారికంగా విధుల్లో కొనసాగుతున్న పలువురు వలంటీర్లు నిరసన తెలియజేశారు. వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం గౌరవ వేతనం రూ. 10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment