గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా జగనన్న సేవకులుగా పనిచేసిన వైనం
ఎన్నికల ముందు టీడీపీ కుట్రలను నిరసిస్తూ రాజీనామాలు
వైఎస్సార్‌సీపీలో చేరి ఎన్నికల్లో ప్రత్యక్షంగా ప్రచారం
తాజాగా వరుసపెట్టి ఆ పార్టీ నేతలపై ఫిర్యాదులు చేయిస్తున్న వైనం
నెల్లూరు సిటీ: అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజా సేవ కంటే ప్రతీకారేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తోంది. వెలకట్టలేని అభిమానంతో గత ప్రభుత్వంలో జగనన్న సైన్యంలా వలంటీర్లు పని చేశారు. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రంలా వలంటీర్లుగా పనిచేసి వారిని లక్ష్యంగా చేసుకుని రాజకీయ క్రీడకు తెరతీశారు. వలంటీర్లు అందరూ సామాన్యులే. ఇటువంటి వారిని భయపెట్టి వలంటీర్ల వ్యవస్థనే నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికీ అందేలా, ఇంటింటికి వెళ్లి అందించడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు.
నెల్లూరునగరంలోని రూరల్ నియోజకవర్గ పరిధిలో 26 డివిజన్లలో మొత్తం 1,148 మంది వలంటీర్‌లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ముందు టీడీపీ నాయకులు ఈసీని అడ్డు పెట్టుకుని పింఛన్లు పంపిణీని వలంటీర్ల ద్వారా చేయనీయకుండా అడ్డుకున్నారు. ప్రజలకు సేవ చేయలేని విధుల్లో తాము కొనసాగలేమని దాదాపు 442 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. తమకు ఇంతటి గౌరవాన్ని కల్పించిన జగనన్నకు మద్దతుగా వలంటీర్లందరూ ఆదాల ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. అయితే అప్పట్లో కొందరు వలంటీర్లకు తాయిళాలు ఎరవేసి టీడీపీలో చేర్చుకున్నారు. ఆ రోజు పార్టీలో చేరిని వారిని లక్ష్యంగా చేసుకుని వారి వేళ్లతో వారి కళ్లు పొడుకునే విధంగా టీడీపీ నాయకులు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు.
అధికారం రావడంతో...
టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్నికల ముందు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి వైఎస్సార్‌సీపీలో చేరిన వలంటీర్లను అడ్డం పెట్టుకుని అప్పట్లో వైఎస్సార్‌సీపీ నేతలు తమను బెదిరించి రాజీనామా చేయించారంటూ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయిస్తున్న వైనం చూస్తుంటే టీడీపీ నీచ రాజకీయాలు, కుట్రలు ఏ స్థాయికి వెళ్లాయో అర్థమవుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం 41 డివిజన్, ఆదివారం 21వ డివిజన్ వైఎస్సార్‌సీపీ నాయకులపై ఫిర్యాదులు చేయించారు.
మాజీ వలంటీర్ల ఫిర్యాదు
నెల్లూరు(క్రైమ్): గతంలో వైఎస్సార్‌సీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు మాజీ వలంటీర్లు ఆదివారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడిచిన రెండు రోజులుగా పలు పోలీసుస్టేషన్లలో వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కార్పొరేటర్లు, నేతలపై వలంటీర్లు వరుస పెట్టి ఫిర్యాదులు చేయడం వెనుక ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు ఓ పథకం ప్రకారమే వైస్సార్‌సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
గత ప్రభుత్వంలో జగనన్న సేవకులుగా పనిచేసిన వలంటీర్లను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయ కుట్రలకు, వేధింపులకు తెర తీసింది. ఎన్నికలకు ముందు వలంటీర్లపై టీడీపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి విధులకు దూరం చేసింది. దీంతో టీడీపీ కుట్రలను నిరసిస్తూ వలంటీర్లు కొందరు తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి తమ ఆరాధ్య నేత వైఎస్ జగన్ సైన్యంగా ఎన్నికల విధుల్లో కీలకంగా పాల్గొన్నారు. ఇదే టీడీపీకి రుచించలేదు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు వారిని భయపెట్టి, ప్రలోభపెట్టి వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయిస్తుండడంపై చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment