వలంటీర్లపై ఈసీ నిర్ణయం దురదృష్టకరం  | YSRCP leaders responds after EC decision On Volunteers: AP | Sakshi
Sakshi News home page

వలంటీర్లపై ఈసీ నిర్ణయం దురదృష్టకరం 

Published Sun, Mar 31 2024 5:29 AM | Last Updated on Sun, Mar 31 2024 7:58 AM

YSRCP leaders responds after EC decision On Volunteers: AP - Sakshi

ఎన్నికల కమిషన్‌ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి

సీఎం వైఎస్‌ జగన్‌పై కక్షతో పేదల్ని ఇబ్బంది పెట్టేలా 

చంద్రబాబు వ్యవహరిస్తున్నారు: మంత్రి అంబటి రాంబాబు 

వలంటీర్ల సేవలు నిలిపివేయించిన నీచుడు చంద్రబాబు: మంత్రి కారుమూరి 

చంద్రబాబు పెత్తందారీ పోకడలతో ప్రజలకు ఇబ్బందులు: 

ఎంపీ కేశినేని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్‌

వలంటీర్లను నియంత్రించడం ప్రజలను ఇబ్బందులు పెట్టడమే: ఎమ్మెల్యే కన్నబాబు   

సాక్షి, అమరావతి/సత్తెనపల్లి: వలంటీర్లపై ఎన్నికల కమిషన్‌ తీసుకున్న నిర్ణయం వల్ల పెన్షన్‌ తీసుకునే అవ్వాతాతలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడతారని, ఈసీ నిర్ణయం దురదృష్టకరమని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈసీ నిర్ణయంపై శనివారం రాత్రి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కక్షతో పేదలను ఇబ్బంది పెట్టేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. వలంటీర్లపై చంద్రబాబు, పవన్‌ అనేక పర్యాయాలు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.

ఇప్పుడు ఏకంగా నిమ్మగడ్డ రమేష్కుమార్‌ సాయంతో ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు ఫిర్యాదు చేయించారన్నారు. వారి వత్తిడికి తలొగ్గి వలంటీర్లను సంక్షేమ పథకాలు పంపిణీ చేయకుండా ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. కుట్రలతో చంద్రబాబు వలంటీర్లను బలి చేయాలనుకున్నారన్నారు. చంద్రబాబు తీరుతో రాష్ట్రంలో బలౌతున్నది వలంటీర్లు కాదని, అవ్వాతాతలు, వికలాంగులు, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబి్ధదారులని మంత్రి అన్నారు. ఇప్పటికైనా ఈసీ తన నిర్ణయాన్ని పునరాలోచన చేసి వృద్ధులు, వికలాంగులకు అవస్థలు లేకుండా చూడాలని కోరారు.   

చంద్రబాబుకు బుర్రదొబ్బింది 
అత్యంత ఖరీదైన నేటి రాజకీయ పరిస్థితుల్లో సామాన్యులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టికెట్లు ఇస్తున్న చాణక్యతను, ఎత్తుగడలను అర్థం చేసుకోలేక చంద్రబాబుకు బుర్ర దొబ్బిందని మంత్రి రాంబాబు ఎద్దేవా చేశారు. విద్యావంతుడు, దళితుడు, టిప్పర్‌ డ్రైవర్‌గా జీవనం వెళ్లదీస్తున్న వీరాంజనేయులుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ ఇవ్వడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. చంద్రబాబు డబ్బున్న కోటీశ్వరులకు, ఎన్నారైలకు,  సంపన్నులకు టికెట్లు ఇస్తుండగా.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత సామాన్యులకు టికెట్లు ఇస్తూ సరికొత్త సంప్రదాయాన్ని తీసుకొస్తున్న వీరుడన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన మోసగాడని విమర్శించారు. 

వృద్ధులు, వికలాంగులకు తీరని ద్రోహం: కారుమూరి 
వలంటీర్ల విధులు నిర్వహించకుండా జిత్తుల మారిన నక్కలా చంద్రబాబు అడ్డుకుని వృద్ధులు, వికలాంగులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు తీరని ద్రోహం చేస్తున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. ఈసీ నిర్ణయంపై స్పందిస్తూ.. నిమ్మగడ్డ రమేష్‌ ద్వారా ఎలక్షన్‌ కమిషన్‌కు లేఖ రాయించి వలంటీర్ల సేవలు నిలిపి వేయించిన నీచుడు చంద్రబాబు అన్నారు. ప్రజలకు మేలు చేసే ఏ కార్యక్రమమైనా చంద్రబాబుకు ద్వేషమే అన్నారు. ఎవరైనా ఏడుస్తుంటే  చంద్రబాబు ఆనందిస్తాడని, ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు ఏడుస్తాడని అన్నారు. వలంటీర్లు రాకపోవడంతో ఎండల్లో గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడి పెన్షన్‌ తీసుకునే అవ్వాతాతలు సొమ్మసిల్లి పడిపోతే చంద్రబాబుకు సంతోషమని మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన తోక పారీ్టలకు ఏనాడూ వలంటీర్లంటే ఇష్టం లేదని, వారిపై కక్షగట్టి విధులికప అడ్డుకుని ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు.  

‘నిమ్మగడ్డ రమేష్కుమార్‌తో ఫిర్యాదు చేయించడం దుర్మార్గం’ 
పెన్షన్‌ పంపిణీపై నిమ్మగడ్డ రమేష్కుమార్‌తో చంద్రబాబు ఫిర్యాదు చేయించడం దుర్మార్గమని, చంద్రబాబు పెత్తందారీ పోకడలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీని వాస్‌ మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్నది పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధమేనన్నారు. పేదలకు అందించే పెన్షన్లు నిలుపుదల చేయడం చాలా దారుణమన్నారు. మేధావుల ముసుగులో 64 లక్షల మంది పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారన్నారు.

నిమ్మగడ్డ రమేష్తో పాటు మరికొందరు చంద్రబాబు ఏజెంట్లుగా, తొత్తులుగా మారారన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పెన్షన్లు ఇవ్వొద్దని చెప్పిం­చారన్నారు. దీనికి టీడీపీ కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందేనని అన్నా­రు. చంద్రబాబు పాలనలో మూడు రోజులు క్యూలో నిలబడితేనే పెన్షన్లు వచ్చేవి కాదని,  జగన్‌ పాలనలో ఇప్పుడు నేరుగా ఇంటికే అందిస్తున్నా చంద్రబాబు అండ్‌ కో కుట్రలు చేస్తున్నారన్నారు. వృద్ధుల ఉసురు బాబుకు కచ్చితంగా తగులుతుందన్నారు. పెన్షన్ల పంపిణీ అంశంపై ఎన్నికల కమిషన్‌ పునరాలోచించుకోవాలన్నారు.  

వృద్ధుల్ని కష్టపెడతారా: వాసిరెడ్డి పద్మ 
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇంటిగడప వద్దకే చేరుస్తున్న వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, ఆయన బ్యాచ్‌ మొదటినుంచీ కుట్రలు చేస్తున్నారని, చివరకు ప్రజలకు సంక్షేమం అందకుండా చేయడానికి కూడా వెనుకాడలేదని వైఎస్సార్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్కుమార్‌ ఫిర్యాదుతో సంక్షేమ పథకాల పంపిణీలో వలంటీర్లను ఉపయోగించవద్దంటూ శనివారం ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు ఇవ్వడంపై వాసిరెడ్డి పద్మ స్పందించారు.  ఇంట్లో మగాళ్లు లేనప్పుడు వలంటీర్లు వచ్చి తలుపులు కొడతారని, వలంటీర్లు మీ ఇంటికి వస్తే తరిమేయాలని చంద్రబాబు గతంలో అనేక మాటలు అన్నారన్నారు. చంద్రబాబు ,పవన్‌ , పచ్చ మీడియా కలిసి మొత్తం వలంటీర్ల వ్యవస్థనే తుంచేసే కుట్రలు చేశారన్నారు. ఎన్నికల కమిషన్‌ సైతం ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోకుండా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు.    

‘వలంటీర్లపై ఫిర్యాదు చేయడానికి సిగ్గులేదా’ 
చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేస్తున్న కొంతమంది మేధావుల ముసుగులో వలంటీర్లపై కుట్రలు చేస్తున్నారని శాసనమండలిలో విప్‌ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. వలంటీర్లు జీతాలు కోసం కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబు సహా ప్రతిపక్ష నాయకులంతా వలంటీర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్వచ్ఛంద సంస్థల ముసుగులో కుహనా మేధావులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడానికి వీలు లేదంటూ వలంటీర్లపై కంప్లైంట్స్‌ చేయటం దారుణమన్నారు. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటం కోసం నిమ్మగడ్డ రమేష్‌ పనిచేస్తున్నారన్నారు. పేదల కోసం పనిచేసే వలంటీర్లపై ఫిర్యాదు చేయటానికి సిగ్గు లేదా అని ప్రశి్నంచారు.  

ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే: ఎమ్మెల్యే కన్నబాబు 
వలంటీర్లను నియంత్రించేందుకు చంద్రబాబు అండ్‌కో చేసిన ప్రయత్నాలు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాయని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. వలంటీర్లు ప్రజలకు గొప్పగా సేవలు అందిస్తున్నారన్నారు. ఈ ఐదేళ్ళ కాలంలో వలంటీర్లు లాంటి వ్యవస్థ పెట్టడానికి వేరే రాష్ట్రం ధైర్యం చేయలేకపోయిందన్నారు. ప్రజలకు గొప్ప సేవలందించే వలంటీర్లను నియంత్రించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు, పవన్‌  వలంటీర్లపై దుర్మార్గమైన కామెంట్లు చేశారన్నారు. తాజాగా ఎన్నికల కమిషన్‌కు నిమ్మగడ్డ ద్వారా వలంటీర్లపై పిర్యాదు చేశారు. ఈ రెండు నెలలు పెన్షన్లు అందకుండా చేశామని చంద్రబాబు పండుగ చేసుకుంటున్నాడన్నారు. వలంటీర్లను నియంత్రిస్తే వైఎస్సార్‌సీపీని నియంత్రించామని అనుకోవడం చంద్రబాబు భ్రమ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement