
ఉపాధికెళ్తే.. ఊపిరిపోయింది
► ఐచర్ వాహనం బోల్తా
► వృద్ధురాలి దుర్మరణం, మరో ఆరుగురు కూలీలకు గాయాలు
► ఎర్రగుంటపల్లి సమీపంలో ఘటన
తాడిపత్రి రూరల్: ‘ఉపాధి’ వేట ఒకరి ఉసురు తీసింది. మరో ఆరుగురిని ఆస్పత్రిపాలుజేసింది. ఈ ఘటన తాడిపత్రి రూరల్ మండలంలో మంగళవారం జరిగింది. తాడిపత్రి రూరల్ మండలం ఎర్రగుంటపల్లి సమీపంలో ఐచర్ వాహనం బోల్తా పడిన ఘటనలో ఎర్రగుంటపల్లికి చెందిన పుల్లమ్మ(60) అనే ఉపాధి కూలీ మరణించగా, నరసమ్మ(55), రత్నమ్మ(58), లక్ష్మీదేవి(45), తులసి(28), మల్లేశ్వరి(25), శివప్రసాద్(30) అనే కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
ఎలా జరిగిందంటే...
నర్సరీ నుంచి మొక్కలను ఐచర్ వాహనంలో వేసుకుని పెద్దవడగూరు మండలం దిమ్మగుడి పాఠశాలలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో వాహనం అదుపు తప్పి బోల్తాపడటంతో ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. వారొచ్చి బాధితులను తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
రంగంలోకి పోలీసులు
ప్రమాద సమాచారం అందిన వెంటనే తాడిపత్రి రూరల్ ఎస్‌ఐ నారాయణరెడ్డి సిబ్బందితో కలసి అక్కడికి చేరుకున్నారు. ఘటన ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. బాధితులతో మాట్లాడారు. వారి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.