హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్యతాపం ధాటికి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి పలువురు అపస్మారకస్థితికి జారుకుని మృతి చెందుతున్నారు. కొద్ది రోజులుగా ఉపాధి హామీ కూలీలు మృత్యువాత పడుతున్నారు.
తలమడుగు(ఆదిలాబాద్)
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి పనులకు వెళ్లిన ఇద్దరు కూలీలు ఎండ తీవ్రతకు తాళలేక ప్రాణాలొదిలారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్‌లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సీతారాం(45), దేవరావ్(50) తోటి వారితో కలిసి పొలాల్లో ఉపాధి హామీ పనులు చేసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఎండ వేడిమికి తీవ్ర అస్వస్థతకు గురైన వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.
ధర్మవరం(అనంతపురం)
ఆంధ్ర ప్రదేశ్ లోసైతం ఎండ వేడిమికి తాళలేక ఓ ఉపాధి హామీ కూలీ ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం కునుటూరు గ్రామానికి చెందిన వెంకటేశ్(65) మంగళవారం ఉపాధి పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన అతడు నీరు తాగిన కొద్దిసేపటికే చనిపోయాడు. అతడికి భార్య, కూతురు ఉన్నారు.