అక్రమార్కులకు రూ.లక్షలు సమర్పయామీ..!
దండుకున్నోళ్లకు దండుకున్నంత..
దోచుకున్నోళ్లకు దోచుకున్నంత..
దాచుకున్నోళ్లకు దాచుకున్నంత..
దిగమింగేవాళ్లకు దిగమింగినంత..
ఆగండి.. ఆగండి.. ఈ అవకాశం ఎక్కడనుకుంటున్నారా..?
అదే నండీ..! చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వంలో!
పల్లె..పట్టణం..నగరం.. ఎక్కడైనా
మీరు యథేచ్చగా దోచుకోవచ్చు.
అర్హత మీరు తెలుగు తమ్ముళ్లు కావడమే!
- కాంట్రాక్టర్లు, అటవీ అధికారుల కుమ్మక్కు
- కుంటలు, కందకాలు తీసిన జేసీబీలు
- ఉపాధి కూలీల నోట్లో మట్టి
- రూ.30 లక్షలు హాంఫట్
గుడ్లూరు : అటవీ అధికారులు.. కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారు. పనులు జేసీబీతో చేయించి ఉపాధి కూలీల నోట్లో మట్టికొట్టారు. అందరూ కలిసి రూ.30 లక్షలు దిగమింగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గుడ్లూరు మండలం మోచర్ల, పోట్లూరు, నరసాపురం, అడవిరాజుపాలెం, గుడ్లూరు గ్రామాల్లో అటవీశాఖకు భూములున్నాయి. వాటిల్లో కుంటలు, కందకాలు తీసేందుకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ (ఉపాధి పథకం) కింద రూ.30 లక్షలు అటవీశాఖకు మంజూరయ్యాయి. పంచాయతీల్లో తీర్మానాలు చేయించి ఆయా గ్రామాల్లో ఉన్న ఉపాధి కూలీలతో పనులు చేయించాలి.
జేసీబీలను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించ కూడదు. ఇది ప్రభుత్వ నిబంధన. అటవీ అధికారులు ఎవరికీ తెలియకుండా పనులను కందుకూరుకు చెందిన కాంట్రాక్టర్ (తెలుగు తమ్ముడు)కు అప్పగించి ఉపాధి కూలీల నోట్లో మట్టి కొట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి అటవీశాఖలో కిందిస్థాయి అధికారి నుంచి ఉన్నతాధికారుల వరకూ అందరికీ చేతులు తడిసినట్లు సమాచారం.
అన్నీ అక్రమాలే
అటవీ అధికారుల సహకారంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఒక్క చోట కూడా కూలీలతో పనులు చేయించకుండా జేసీబీల ద్వారే కుంటలు, కందకాలు తీయించారు. ఐదు గ్రామాల్లో ఐదు రోజుల్లోనే పనులు ముగించారు. నిధులు నేరుగా డ్రా చేసుకునేందుకు అధికారులు, కాంట్రాక్టర్లకు వీల్లేదు. ఉపాధి కూలీల పేరుతో ఉన్న జాబ్‌కార్డుల ఆధారంగా పోస్టాఫీసుల్లో నగదు తీసుకోవాలి. నరసాపురంలో 4 కుంటలు, కందకానికి సంబంధించి మొదటి విడత రూ.4 లక్షలు గుడ్లూరు పోస్టాఫీసులో జమయ్యాయి.
ప్రశ్నించిన కూలీలు
తమ అకౌంట్లలో ఉన్న నగదును మీరు ఎలా తీసుకుంటారని కూలీలు మధ్యవర్తిని ప్రశ్నించారు. నగదు తమకు ఇచ్చినట్లు పేస్లిప్పులు ఇవ్వడం ఏమటని నిలదీశారు. ఫొటోకు ఫోజు ఇవ్వగానే డబ్బులు వస్తాయా.. అని కూలీలను మధ్యవర్తి ఎద్దేవా చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తమకు తెలియకుండానే 18 రోజులు పని చేసినట్లు తెల్ల పేపర్లుపై సంతకాలు పెట్టించుకొని మోసం చేశారని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుంటలు పరిశీలిస్తాం : మందారావు, డీఆర్వో
కుంటలు, కందకాలను కూలీలతోనే తీయించాలని చెప్పాం. జేసీబీలతో పనులు చేయించిన సంగతి నాకు తెలియదు. కొన్ని గ్రామాల్లో నగదు ఇంకా పోస్టాఫీసుల్లో జమ కాలేదు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం.
తిమ్మిని బమ్మిని చేసి..
పోస్టాఫీసులో నగదు డ్రా చేసేందుకు కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు. 15 రోజుల క్రితం గుడ్లూరులోని 6 గ్రూపులకు చెందిన ఉపాధి కూలీలను ట్రాక్టర్‌లో నరసాపురం అడవికి తీసుకెళ్లి ఆ కుంటల వద్ద వారు పనులు చేసినట్లు ఫొటోలు తీయించారు. 60 మంది కూలీల అకౌంట్లలో పోస్టాఫీసులో నగదు జమ చేయించారు. ఒక్కో కూలీ 18 రోజులు పని చేసినట్లు చూపి రూ.2 వేలు నుంచి రూ.6 వేలు చొప్పున కూలీల అకౌంట్లలో నగదు జమ చేయించారు. కాంట్రాక్టరు పెట్టుకొన్న మధ్యవర్తి నాలుగు రోజుల నుంచి కూలీలను పోస్టాఫీసు వద్దకు తీసుకెళ్లి వారితో వేలిముద్రలు వేయించుకొని నగదు తీసుకున్నట్లు పేస్లిప్పులు ఇవ్వడంతో కూలీలు అవాక్కయ్యారు.
ఇక్కడా.. అంతే
గుడ్లూరులోనే కాకుండా మోచర్లలో కూడా కందుకూరు మండలానికి చెందిన కూలీలను తీసుకొచ్చి ఫొటోలు తీసినట్లు తెలుస్తోంది. పోట్లూరులో 2, మోచర్లలో 4, నరసాపురంలో 4, అడవిరాజుపాలెంలో 2, గుడ్లూరులో 2 కుంటలు జేసీబీతో తవ్వించారు. ఒక్కో కుంటకు రూ.1.50 లక్షలు లెక్కన 14 కుంటలకు రూ. 21 లక్షలు, కందకాలకు రూ.9 లక్షలు చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇవి తవ్వినందుకు జేసీబీలకు రూ.5 నుంచి రూ.10 లక్షలకు మించి ఖర్చు కాదని అంచనా.