కూలీ డబ్బుల కోసం జాగారం
పోస్టాఫీస్ వద్దనే నిద్రిస్తున్న ఉపాధి కూలీలు
సదాశివనగర్: మండుటెండలో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలు.. చేసిన పనికి కూలీ తీసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కూలీ డబ్బుల కోసం పొద్దస్తమానం ఎండలో నిలబడడమే కాకుండా రాత్రి వేళ పోస్టాఫీస్ వద్దనే నిద్రపోతున్నారు. ఈ తంతు నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో జరుగుతోంది. మండలంలోని 115 గ్రూపులకు సంబంధించి ఉపాధి హామీ కూలీలకు ఇక్కడి పోస్టాఫీస్‌లోనే అందించాల్సి ఉంది.
పోస్టాఫీస్‌లో ఒకటే బయోమెట్రిక్ మిషన్ ఉండడం... ఒకేసారి వందల మంది డబ్బుల కోసం వస్తుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే పోస్టాఫీస్ సిబ్బంది రోజుకు 50 మందికి మాత్రమే డబ్బులు ఇస్తామని నిబంధన పెట్టింది. ఇదేమంటే ఇష్టమున్న చెప్పుకోమని బెదిరిస్తున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉపాధి హామీ కూలీలు తమ ఖాతా పుస్తకాలను పోస్టాఫీసు ముందు వరుసలో పెట్టి.. అక్కడే రోడ్డుపై నిద్రిస్తున్నారు.
వారం సంది ఇక్కడే పడుకుంటున్నా...
పోస్టాఫీస్ దగ్గర్నే వారం సంది పండుకుంటున్నా. ఇంకా పైసలు ఇయ్యలేదు. ఎవళ్లూ పట్టించుకుంటలేరు. నాలుగు వారాల పైసలు రావాలే. డబ్బుల కోసం గోస పడుతున్నం.
-కువైట్ బీరయ్య, ఉపాధి కూలీ, సదాశివనగర్
రోడ్డు మీదనే పడుకుంటున్నం
నాలుగు రోజుల సంది పొద్దుందాక వరుసలో నిలబడ్డ, రాత్రి ఇక్కడే పడుకున్న పైసలు అస్తలేవు. నాలుగు వారాల పైసలు రావాలే. రోజు గిదే తిప్పలు పడుతున్నం. ఈ పోస్టాపీస్ దగ్గర గీ రోడ్డు మీదనే పడుకుంటున్నం.
ఇట్టబోయిన చిన్న బాలయ్య, ఉపాధి కూలీ సదాశివనగర్
కూలీల మీదికి కోపానికొస్తుండ్రు..
మా పైసలు మాకు ఇయ్యమంటే ఈ పోస్టాపీస్‌లో పని చేసేటోళ్లు కూలీలను ఇష్టమొచ్చినట్లు తిడుతుండ్రు. రోజు 50 మందికే పైసలిస్తాండ్రు. మధ్యాహ్నం ఒంటి గంటకు పైసలు ఇయ్యడం చాలు జేసి 3 గంటలకు తినడానికి పోతడు. మళ్ల అయిదు గంటలకు బందు జేస్తుండ్రు.
-మర్రి ఆశిరెడ్డి, కూలీ, సదాశివనగర్