ఇకపై బ్యాంక్ ఖాతాల్లో..?
► వేతనాలు తీసుకోనున్న ఉపాధి వేతనదారులు
► ప్రతి ఒక్కరికీ ఖాతాలు తప్పనిసరి
► పోస్టాఫీస్ సేవలు బంద్
ఖాతా తప్పనిసరి
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులందరూ బ్యాంకు ఖాతాలు కలిగి ఉండాలి. ఇకపై వేతనదాలు బ్యాంకు ఖాతాలకు జమ అవుతారుు. ప్రస్తుతం 143 పంచాయతీల్లో ఈ విధానం అమలవుతోంది. -పి.ప్రశాంతి, డ్వామా పీడీ, విజయనగరం
విజయనగరం పూల్‌బాగ్: ఉపాధి హామీ పథకం వేతనాల చెల్లింపుల్లో మళ్లీ మార్పు చోటుచేసుకుంది. ఇంతవరకు పోస్టాఫీసుల్లో వేతనాలు తీసుకునేవారు. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానానికి నాంది పలకనున్నారు. వేతనదారుల సొమ్మును బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేతనదారుల ఖాతాల్లో కూలి డబ్బులు జమ చేసేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. గతంలోనే ఈ ఆదేశాలు జారీ అరుునప్పటికీ పూర్తి స్థారుులో జిల్లాలో అమలు కాలేదు. వేతనదారులందరికీ బ్యాంకు ఖాతాలు లేకపోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దశల వారీగా అమలు చేసేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని 921 పంచాయతీలకు గాను 143 పంచాయతీల్లో ప్రస్తుతం బ్యాంకుల ద్వారా సొమ్మును జమ చేస్తున్నారు. విడతల వారీగా 921 పంచాయతీల్లోనూ ఈ విధానం అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఖాతాదారులందరి చేతా బ్యాంకు ఖాతాలు తెరిపించే పనిలో ఉపాధి సిబ్బంది ఉన్నారు.
మొదటి విడతలో 143 గ్రామాల్లో రెండో విడతలో 300.. మూడో విడతలో 478 గ్రామాల్లోని వేతనదారులకు బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించనున్నారు.