రికవరీ ఉత్తిమాటే..
-
ఉద్యోగుల కుటుంబాలకు ‘ఆసరా’
-
అనర్హులకు..రూ.3కోట్లు!
-
రికవరీకి ఆదేశాలు..
-
ఫలితం దక్కేనా..?
కోరుట్ల : ఉద్యోగుల కుటుంబసభ్యులకు అందిన పింఛన్ల రికవరీ కోసం అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. 2014 నవంబర్‌లో ప్రభుత్వం ఆసరా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. సమగ్ర కుటుంబ సర్వే నివేదికను ఆధారంగా చేసుకుని సర్కార్ పింఛన్లు అందించింది. ఆ సమయంలో ఉద్యోగాలు ఉన్న కుటుంబాలకు చెందిన వారి వివరాలు సక్రమంగా నమోదు కాకపోవడంతో అనర్హులకూ ఆసరా పింఛన్లు అందాయి. ఈ విషయం సర్కార్ దృష్టికి రాగా 2015లోనే ఉద్యోగులపై ఆధారపడి ఉండి పింఛన్లు పొందిన వారి నుంచి డబ్బుల రికవరీకి ఆదేశించినా ఫలితం దక్కలేదు.
2,932 మంది..
జిల్లాలో సుమారు 5.40 లక్ష మందికి వివిధ వర్గాల కింద ఆసరా పింఛన్లు అందుతున్నాయి. వీరిలో 2,932 మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులు పింఛన్లు పొందుతున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. 2015లోనే ఈ రీతిలో పింఛన్లు పొందుతున్న వారి వివరాలు సేకరించిన డీఆర్‌డీఏ అధికారులు సదరు వ్యక్తుల పింఛన్లను నిలిపివేసి వారి నుంచి డబ్బుల రికవరీకి సంకల్పించారు. ఈ దిశలో కిందిస్థాయి అధికార యంత్రాంగం ముందుకు వెళ్లిన దాఖలాలు కనబడలేదు. ఫలితంగా రికవరీ ఉత్తి మాటే అయింది. 2016 జూలై వరకు లెక్కలు తీసిన అధికారులు ఆగస్టు నెలాఖరులో మరోసారి ఉద్యోగుల కుటుంబాలపై ఆధారపడి పింఛన్లు పొందుతున్న వారి నుంచి డబ్బుల రికవరీకి ఆదేశించారు. మొదట నోటీసులు ఇచ్చి ఆ తరువాత డబ్బులు వసూలు చేయాలని చెప్పారు. కిందిస్థాయి అధికార యంత్రాంగం అనర్హులుగా గుర్తించిన వారందరికీ నోటీసులు జారీ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది.
రికవరీ రూ.3కోట్లు!
ఉద్యోగుల కుటుంబాలపై ఆధారపడిన వ్యక్తులు సుమారు రెండు సంవత్సరాల్లో రూ.3కోట్ల వరకు ఆసరా పింఛన్ల కింద పొందినట్లు అధికారులు లెక్కతేల్చారు. వీరిలో కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కోరుట్ల, హుజూరాబాద్, హుస్నాబాద్, మెట్‌పల్లి, జమ్మికుంట, వేములవాడ మున్సిపాల్టీల్లోనే దాదాపు రూ.కోటిన్నర రికవరీ కావాల్సి ఉండగా.. మిగిలిన మండలాల్లో సుమారు రూ.కోటిన్నర డబ్బులు వసూలు కావాలి. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇంత డబ్బువసూలు చేయడం అధికార యంత్రాంగానికి తలకు మించిన భారంగా మారింది. ఒక్కసారి ఆసరా పింఛన్లు పొందిన వారు మళ్లీ ఆ డబ్బులు వాపస్‌చేయడం అయ్యే పని కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు డబ్బుల రికవరీకి అక్రమంగా పింఛన్లు పొందిన వారికి నోటీసులు జారీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఫలితం ఎలా ఉంటుందన్న అంశం మున్ముందు తేలనుంది.