దొంగనోట్లు !
సాక్షి ప్రతినిధి, విజయనగరం : పండుగ రోజుల్లో పెద్ద ఎత్తు న క్రయవిక్రయాలు జరుగు తూ మార్కెట్లోకి భారీగా సొమ్ము వస్తుండడంతో మాటున కొంతమంది అక్రమార్కులు నకిలీ నోట్లను చెలామణీలోకి తెస్తున్నారు. ఇప్పటికే చిరు, పుట్‌పాత్ వ్యాపారాల్లో భారీ ఎత్తున నకిలీ నోట్లు మార్చేసినట్టు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక వచ్చే పది రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న పేకాట, కోడిపందాల్లో మరింతగా చలామణీ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడంతో కోడి పందాలు కూడా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. దీన్ని అవకాశంగా తీసుకుని అక్రమార్కులు దొంగనోట్లను విచ్చలవిడిగా మార్చేయవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు ఫుట్‌పాత్ వ్యాపారాలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఈ వ్యాపారాల్లో కూడా రూ. 500, రూ. 1000 నోట్ల చలామణీ భారీగానే జరుగుతోంది.
గతంలో ఈ వ్యాపారాలు కేవలం వంద నోట్ల స్థాయిలోనే ఉండేవి. ఇప్పుడు లావాదేవీలను భారీ స్థాయిలో నిర్వహిస్తుండడంతో వీరి వద్ద దొంగ నోట్లను సులువుగా మార్పించుకునే అవకాశం ఉండడంతో అక్రమార్కులు ఈ వ్యాపారులపై కన్నేశారు. ఈ వ్యాపారుల వద్ద దొంగనోట్ల తనిఖీ యంత్రాలు, గుర్తించే పరికరాలు ఉండవు. దీంతో అక్రమార్కులు వీరి వ్యాపారాలపైనే దృష్టి సారించారు. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున దొంగనోట్లు మార్కెట్లోకి వచ్చినట్టు సమాచారం. సంక్రాంతి సందర్భంగా విజయనగరం, నెల్లిమర్ల, ఎస్. కోట, గజపతినగరం, చీపురుపల్లి, కురుపాం నియోజకవర్గాల్లో దాదాపు ప్రతి చోటా కోడిపందాలు, పేకాట నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. దీంతో పందెంరాయళ్లు కోట్లాది రూపాయలు బయటకు తీసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నల్లడబ్బును మార్చేందుకు ఓ ముఠా జిల్లాలో తిరుగుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా జిల్లా కేంద్రంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో ఈ ముఠా దొంగ నోట్లు మారుస్తున్నట్టు సమాచారం.