
పెద్ద నోట్లు రద్దు..
రూ.500, రూ.1,000 నోట్లు ఇక చెల్లవు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమలు
నల్లధనం, నకిలీ నోట్లు అరికట్టేందుకు కేంద్రం సంచలన నిర్ణయం
వచ్చే 72 గంటల్లో ఏం చేయాలి?
ప్రభుత్వాసుపత్రులు, రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లు, ప్రభుత్వ బస్సులు, విమానాశ్రయాల్లోని ఎరుుర్‌లైన్‌స కౌంటర్లలో, ప్రభుత్వ రంగ సంస్థల అధీనంలో నడిచే పెట్రోల్, డీజిల్, గ్యాస్ స్టేషన్లలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో నడిచే సహకార కేంద్రాలు, పాల కేంద్రాల్లో.. శ్మశానాల్లోనూ 500, 1,000 నోట్లను స్వీకరిస్తారు.
తర్వాత ఏం చేయాలి
ఆర్బీఐ కేంద్రాలు, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రూ.500, రూ.1,000 నోట్లను నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు ఎలాంటి పరిమితి లేకుండా అకౌంట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ అకౌంట్లోకి సరైన ఆధారాలు చూపించి బదిలీ చేయవచ్చు. అరుుతే బ్యాంకుల్లోని కేవైసీ (నో యువర్ కస్టమర్) ఫారాలను అసంపూర్తిగా నింపిన వారు కేవలం గరిష్టంగా రూ.50 వేల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోవచ్చు.
► కొద్ది రోజుల వరకు బ్యాంకుల నుంచి విత్ డ్రాయల్ పరిమితి రోజుకు రూ.10 వేలు, వారానికి రూ.20 వేలుగా నిర్ణరుుంచారు. నవంబర్ 24న సమీక్ష తర్వాత ఈ పరిమితిని పెంచనున్నారు.
► ఏటీఎంల్లో విత్ డ్రాయల్ (నవంబర్ 18 వరకు) కార్డుపై రోజుకు రూ.2 వేలు మాత్రమే. తర్వాత దీన్ని రూ.4 వేలకు పెంచనున్నారు.
► బ్యాంకులు, ప్రభుత్వ ఖజానా కార్యాలయాలు బుధవారం (నేడు) మూసి ఉంటారుు. ఏటీఎంలు నేడు, రేపు పనిచేయవు.
► నవంబర్ 24 వరకు ఐడీ ప్రూఫ్ చూపించి హెడ్ పోస్టాఫీసులు, బ్యాంకుల్లో రోజుకు 500, 1000 నోట్లను రూ.4 వేల వరకు మార్చుకో వచ్చు. ఈ పరిమితిపై 15 రోజుల తర్వాత సమీక్షిస్తారు.
► చెక్, డీడీ, క్రెడిట్ కార్డులు, ఎలక్ట్రానిక్ ట్రాన్‌సఫర్ ద్వారా జరిగే లావాదేవీలపై ఆంక్షలు లేవు.
► డిసెంబర్ 30 వరకు బ్యాంకుల్లో రూ.500, రూ.1000 నోట్లను డిపాజిట్ చేయలేని వారు మార్చి 31, 2017 వరకు ఆర్బీఐ కేంద్రాల్లో సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించి బదిలీ చేసుకోవచ్చు.
ఆర్బీఐ గవర్నర్ ఏం చెప్పారు?
కొత్త రూ.500, రూ2000 నోట్ల తయారీ ఊపందుకుంది. మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్న నోట్ల స్థానంలో నవంబర్ 10 నుంచి వీటిని ప్రవేశపెడతాం. రూ.వెరుు్య నోట్లను త్వరలో ప్రవేశపెడతాం. నల్లధనం, ఉగ్రమూకలకు ఆర్థిక సాయాన్ని అరికట్టేందుకు ఇది చాలా గొప్ప నిర్ణయం. నోట్లు మార్చుకునే విషయంలో ప్రజల సౌకర్యార్థం అన్ని బ్యాంకుల్లో కొత్త కౌంటర్లు ఏర్పాటుచేస్తాం. దీనికితోడు బ్యాంకులు ఎక్కువ సమయం పనిచేస్తారుు. ప్రజల అపోహలు, ఆందోళనల పరిష్కారానికి ముంబై కేంద్రంగా కౌంటర్లు, కాల్ సెంటర్లు ఏర్పాటుచేస్తాం. బ్యాంకుల వద్ద కొత్త నోట్లు చేరే క్రమాన్ని బట్టి విత్ డ్రాయల్ పరిమితిని పెంచుతాం.
అవినీతిని ఊడ్చేద్దాం..
రూ. 500, 1,000 చిత్తు కాగితాలతో సమానం: మోదీ
► నేడు(బుధవారం) బ్యాంకులు పనిచేయవు. ఇది మీకు ఇబ్బందే. అయితే దేశ చరిత్రలో జాతి నిర్మాణానికి సంబంధించిన ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్నే వస్తాయి. అందులో పాలు పంచుకునే క్రమంలో ఈ చిన్న చిన్న కష్టాలు పట్టించుకోకండి.
► {పభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్యాంకులు, పోస్టాఫీస్ సిబ్బంది సహకరించాలి. రాజకీయ పార్టీల కార్యకర్తలు, మీడియా, సామాజిక సంస్థలు సహకరిస్తాయని ఆశిస్తున్నాం.
► ఉగ్రవాదం, నల్లధనం, అవినీతిని కూకటివేళ్లతో పెకలించాలి. ఈ జాడ్యాలు దేశానికి మానని పుండులా మారాయి. జాతిని తొలిచేస్తున్నాయి. వీటిపై పకడ్బందీగా యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది.
► చట్ట వ్యతిరేక ఆర్థిక కార్యకలాపాలు దేశానికి అతిపెద్ద ముప్పు.
న్యూఢిల్లీ : సంచలనం..! పెను సంచలనం..!! దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టించే అత్యంత కీలక నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపారు. నల్లధనం, నకిలీ కరెన్సీ నోట్లు, అవినీతి జాడ్యాలను కూకటివేళ్లతో పెకిలించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్ఘాటించారు. మంగళవారం తొలిసారిగా మోదీ టెలివిజన్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. బ్లాక్‌మనీ, అవినీతి, నకిలీ నోట్లపై దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడారు. రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేస్తున్నామని, నేటి రాత్రి(మంగళవారం) నుంచి అవి పనికిరాని చిత్తు కాగితాలతో సమానమని చెప్పారు. తమ వద్ద ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను ఈ నెల 10 నుంచి డిసెంబర్ 30లోపు(50 రోజుల గడువు) బ్యాంకులు, పోస్టాఫీసు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ప్రజలకు సూచించారు. రూ.100, రూ.50, రూ.20, రూ.10, రూ.5, రూ.2, ఒక రూపారుు నోట్లు, అన్ని నాణేలు ఎప్పట్లాగే చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు.
కొత్తగా రూ.2,000, రూ.500 నోట్లను ప్రవేశపెడతామని తెలిపారు. ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకోవడంపైనా ప్రధాని పలు ఆంక్షలను ప్రకటించారు. కొద్దిరోజులపాటు రోజుకు ఏటీఎం నుంచి గరిష్టంగా రూ.2 వేలు మాత్రమే తీసుకోవచ్చన్నారు. తర్వాత దీన్ని రూ.4 వేల వరకు పెంచుతామని చెప్పారు. అలాగే బ్యాంకుల ద్వారా కొద్దిరోజులపాటు ఒక్కరోజులో గరిష్టంగా రూ.10 వేలు, వారంలో రూ.20 వేలు మాత్రమే తీసుకోవచ్చని తెలిపారు. మున్ముందు ఈ పరిమితిని పెంచుతామన్నారు. కొత్త నోట్ల సరఫరాను దృష్టిలో ఉంచుకొని ఈ ఆంక్షలు విధించినట్లు వివరించారు. అలాగే బుధవారం బ్యాంకులు, ఏటీఎంలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కొన్నిచోట్ల గురువారం కూడా ఇవి పనిచేయవని తెలిపారు. బ్యాంకులు, పోస్టాఫీసు సిబ్బంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు, కార్యకర్తలు, మీడియా, సామాజిక సంస్థలు కూడా సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
మార్పిడికి గుర్తింపు కార్డులివ్వాలి
బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఖాతాలు ఉన్నవారు రూ.500, రూ,1,000 నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి ఏమీ ఉండదు. (రూ.50వేలు దాటితే పాన్‌కార్డు నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి జనం బ్యాంకుల్లో వేసే మొత్తం ఆదాయపు పన్ను లెక్కల్లోకి వస్తుంది) డిపాజిట్లు, నోట్ల మార్పిడికి వచ్చే జనం తాకిడికి అనుగుణంగా బ్యాంకులు అదనపు కౌంటర్లు తెరుస్తాయని ప్రధాని చెప్పారు. ‘‘బ్యాంకులో డిపాజిట్ చేసుకున్న తర్వాత మీ డబ్బులు మీకే ఉంటారుు. దీనిపై ఏం ఆందోళన చెందనక్కర్లేదు. డిపాజిట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు’’ అని అన్నారు. ఇక ఖాతాలు లేనివారు నిర్దేశిత బ్యాంకులు, పోస్టాఫీసులో ఈ నెల 10 నుంచి 24వ తేదీ వరకు ఆ నోట్లను ఇచ్చి అంతేమొత్తంలో ఇతర నోట్లను పొందవచ్చని ప్రధాని సూచించారు. ఈ మార్పిడిపైనా ఆంక్షలు విధించారు. రోజుకు గరిష్టంగా రూ.4 వేలు మాత్రమే పొందవచ్చని తెలిపారు. నవంబర్ 25 తర్వాత ఎక్కువమొత్తం తీసుకోవచ్చని సూచించారు. అరుుతే అందుకు పాన్, ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు వంటి పత్రాలను సమర్పించాలన్నారు.
తుది గడువు మార్చి 31
డిసెంబర్ 30లోగా 500, 1,000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోలేనివారు వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆ నోట్లను నిర్దేశిత ఆర్‌బీఐ కార్యాలయాల్లో జమ చేయవచ్చు. అరుుతే జాప్యానికి గల కారణాన్ని పక్కా ఆధారాలతో సహా వివరిస్తూ ఒక డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.
ఈ నెల 11 వరకు నోట్ల చెల్లుబాటు
విమాన టికెట్లు, రైల్వే టికెట్లు, ప్రభుత్వ బస్ టికెట్ కౌంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రులు, పెట్రోలు, డీజిల్, సీఎన్‌జీ స్టేషన్లు, ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాల కేంద్రాలు, శ్మశాన వాటికల్లో ఈ నెల 11 అర్ధరాత్రి వరకు రూ.500, రూ.1,000 నోట్లు చెల్లుబాటు అవుతాయని ప్రధాని తెలిపారు. ఎరుుర్‌పోర్టుల్లో ప్రయాణికుల నుంచి రూ.5 వేలకు మించకుండా రూ.500, రూ.వెరుు్య నోట్లను తీసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు, ఆసుపత్రుల్లో రోగులు, ఇతర అత్యవసరమైన పనులు ఉన్నవారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే ఈ వెసులుబాటు కల్పించినట్లు వివరించారు.
ఈ కష్టాలను పట్టించుకోకండి
‘‘రేపు(బుధవారం) బ్యాంకులు పనిచేయవు. ఇది మీకు ఇబ్బందే. అరుుతే దేశ చరిత్రలో జాతి నిర్మాణానికి సంబంధించిన ఇలాంటి సందర్భాలు ప్రతి ఒక్క రి జీవితంలో కొన్నే వస్తారుు. అందులో పాలుపంచుకునే క్రమంలో ఈ చిన్నచిన్న కష్టాలను పట్టించుకోకండి’’ అని ప్రధాని మోదీ ప్రజలను కోరారు.
ఆ జాడ్యాలను అంతమొందించాలి
జాతిని పట్టిపీడిస్తున్న ఉగ్రవాదం, నల్లధనం, అవినీతి జాడ్యాలను కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ఈ మూడు జాడ్యాలు దేశానికి మానని పుండులా మారారుు. లోపలి నుంచి జాతిని తొలిచేస్తున్నారుు. వీటిపై పకడ్బందీగా యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. చట్ట వ్యతిరేక ఆర్థిక కార్యకలాపాలు దేశానికి అతిపెద్ద ముప్పని చెప్పారు. గత రెండున్నరేళ్లుగా తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నా అంతర్జాతీయ అవినీతి సూచీ ర్యాంకుల్లో భారత్ కేవలం 100వ స్థానం నుంచి 76వ స్థానానికి వచ్చిందని పేర్కొన్నారు. ‘‘దేశంలో అవినీతి ఎలా పాతుకుపోరుుందో చెప్పేందుకు ఈ ర్యాంకులే ఓ ఉదాహరణ. ఒకవైపు ఆర్థిక వృద్ధిలో మనం నంబర్-1 స్థానంలో ఉన్నాం. అదేసమయంలో అవినీతిలోనూ వందో ర్యాంకుకు దగ్గర్లో ఉన్నాం. ఈ అవినీతితో కొందరు అక్రమార్కులు లబ్ధిపొందుతున్నారు. అదే సమయంలో నిజారుుతీపరులైనవారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు’’ అని అన్నారు. ప్రభుత్వ చర్యల ద్వారా ఇప్పటివరకు దేశ, విదేశాల్లోని రూ.1.25 లక్షల కోట్ల నల్లధనం వెలికివచ్చిందన్నారు. నకిలీ కరెన్సీ ఉగ్రవాదానికి సంబంధం ఉందని, దీనిద్వారా కొందరు శత్రువులు దేశానికిహాని తలపెట్టాలని చూస్తున్నారని మోదీ పేర్కొన్నారు.
బ్యాంకులకు సెలవెందుకు?
పాత నోట్లను రద్దు చేస్తున్నారు సరే! మరి బ్యాంకులకెళ్లి కొత్తవి తెచ్చుకోవటానికి ఒకరోజు సమయం ఎందుకు? ఈ సందేహం చాలా మందికి వస్తోంది. అరుుతే బ్యాంకులన్నీ తమ దగ్గరున్న పాత నోట్లను రిజర్వు బ్యాంకుకు అందజేసి... కొత్తవి తెచ్చుకోవటానికి, వాటిని ఏటీఎంలలో పెట్టడానికి వాటికి కొంత సమయం కావాలి. అందుకే ఈ ఒకరోజు ప్రభుత్వం బ్యాంకులకు సెలవుగా ప్రకటించింది. ఏటీఎంలలో డబ్బు మార్చాలి కనక... ఏటీఎంలు కూడా రెండ్రోజులు పనిచేయవని స్పష్టం చేసింది.
భయం వద్దు.. కొత్త నోట్లు సిద్ధం
న్యూఢిల్లీ: కొత్తగా ప్రవేశ పెట్టనున్న రూ.500, రూ.2,000 నోట్ల ముద్రణ కొన్ని నెలల క్రితమే మొదలైందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నారుు. ప్రస్తుతం చలామణిలో ఉన్న నోట్లను అకస్మాత్తుగా ఉపసంహరించాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచినట్లు అధికారులు సీఎన్‌ఎన్-న్యూస్ 18కు విశ్వసనీయ సమాచారమిచ్చారు. ఆ వివరాల ప్రకారం ‘కొత్త నోట్లు రెండు రోజుల క్రితమే ఆర్‌బీఐకి చేరారుు. గత ఆరు నెలల్లో అన్ని స్థాయిల్లోని బ్యాంకు సిబ్బందికి ఈ వ్యవహారంపై శిక్షణ కూడా ఇచ్చారు. మొదట్లో ప్రభుత్వంపై కొంత ఒత్తిడి ఉంటుంది. ఎదుర్కొనేందుకు యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉంది. చిన్న మొత్తాల్లో నోట్లు కావాల్సినన్ని చలామణిలో ఉన్నందున 4-6 వారాల్లో పరిస్థితులు సర్దుకుంటారుు. మరోవైపు ఈ చర్యతో బ్యాంకులకు డిపాజిట్లు వెల్లువెత్తుతాయనీ, పన్నులు వసూలు కావడంతోపాటు డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలు ఊపందుకుంటాయని ప్రభుత్వం భావిస్తోంది’.
సాహసోపేత చర్య
నోట్ల రద్దును స్వాగతించిన రాష్ట్రపతి
ప్రజలు ఆందోళనకు గురికావద్దని పిలుపు
న్యూఢిల్లీ: అర్ధరాత్రి నుంచి రూ.1,000, 500 నోట్లను రద్దుచేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన నిర్ణయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వాగతించారు. సాయంత్రమే మోదీ తనను కలసి ప్రభుత్వ నిర్ణయం గురించి చెప్పారన్నారు. దీనివల్ల ఖాతాల్లో చూపని ధనం బయటికి రావడంతోపాటు నకిలీ కరెన్సీ చలామణి నియంత్రణలోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీనివల్ల ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరంలేదని, తమ వద్ద ఉన్న రూ.500, 1000 నోట్ల మార్పిడికి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తే సరిపోతుందని చెప్పారు. ఇప్పుడు రూ.500 కంటే తక్కువ విలువ ఉన్న నోట్లు యథావిధిగా చెల్లుబాటు అవుతాయని గుర్తుచేశారు. ప్రభుత్వమిచ్చిన అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని ప్రణబ్ సూచించారు.
నల్లధనం కట్టడికి..
న్యూఢిల్లీ: 2011 నుంచి 2016 మధ్య దేశంలో చలామణీలో ఉన్న కరెన్సీ నోట్లు 40 శాతం పెరిగినట్లు గుర్తించామని కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రూ. 500 నోట్లు 76 శాతం, రూ.వెరుు్య నోట్లు 109 శాతం పెరిగాయని తెలిపింది. భారత్‌లో అక్రమ నగదు కార్యకలాపాల విలువ జీడీపీలో 20.7 శాతం(1999), 23.2 శాతం(2007)గా ఉన్నట్లు జులై, 2010లో ప్రపంచ బ్యాంకు అంచనా వేసిందని ప్రకటించింది. గత రెండేళ్లలో నల్లధనం సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని, ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశామని, అలాగే భారత్-మారిషస్, భారత్-సైప్రస్‌ల మధ్య డబుల్ టాక్స్ మినహారుుంపు చట్టంలో సవరణలు చేశామని ఆర్థిక శాఖ పేర్కొంది. స్విట్జర్లాండ్‌లోని హెచ్‌ఎస్‌బీసీలో ఉన్న భారతీయుల ఖాతాల వివరాలు తెలుసుకునేందుకు ఆ దేశంతో అవగాహనకు వచ్చామని ప్రకటనలో వెల్లడించింది. నగదు రహిత, డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని, బినామీ వ్యవహారాల చట్టంలో సవరణలు చేశామని, ఆదాయ వెల్లడి పథకం అమలు చేశామని తెలిపింది.
వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే
విదేశాల్లో పోగుబడిన నల్లధనాన్ని వెనక్కి తెస్తామన్న హామీని నెరవేర్చలేక మోదీ డ్రామా ఆడుతున్నారు. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుని ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది పెద్ద ఆర్థిక గందరగోళాన్ని సృష్టిస్తుంది. వారానికి ఒక ఐదొందల నోటు సంపాదించిన పేద కూలీలు రేపు బియ్యం, గోధుమలు, పప్పు ఎలా కొనుక్కుంటారు. దీనికి మోదీ సమాధానం చెప్పాలి.
- మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి
సాహసోపేత నిర్ణయం
రూ.500, 1000 నోట్లను రద్దుచేయడం సాహసోపేత నిర్ణయం. ఇది నల్లధనంపై చేసిన సర్జికల్ దాడులు. నల్లధనం నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద, సాహసోపేత చర్య. పౌరులు దీన్ని అర్థం చేసుకొని నల్లధనంపై పోరుకు సహకారం అందించాలి.
- హస్ముక్ అధియా, కేంద్ర రెవెన్యూ కార్యదర్శి
అవినీతినీ రూపుమాపొచ్చు
నల్లధనాన్ని వ్యవస్థ నుంచి రూపుమాపడానికి మోదీ తీసుకున్న కీలక చర్య. ఇది అవినీతిని తరిమికొట్టడానికి కూడా దోహదం చేస్తుంది. సాహసోపేత నిర్ణయం తీసుకున్నందుకు మోదీకి కృతజ్ఞతలు.
- వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి
సర్జికల్ దాడుల్లాంటివి
నల్లధనం, అవినీతిపై ఇది సర్జికల్ దాడుల్లాంటిది. మోదీ మరోసారి ప్రజలకిచ్చిన హామీని నెరవేర్చి తన నిబద్ధతను చాటారు. హవాలా, నకిలీ కరెన్సీ రాకెట్ల గుట్టు రట్టు చేయడానికేం చేయాలో.. మోదీ సరిగ్గా అదే చేశారు.
- అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు