నకిలీ రెండు వేల నోటు
సాక్షి, సిటీబ్యూరో : పాత కరెన్సీ పెద్ద నోట్లను రద్దు చేస్తే జన బాహుళ్యంలో ఉన్న దొంగనోట్ల బెడద తప్పుతుందని భావిస్తే.. నకిలీగాళ్లు మాత్రం ‘కొత్త’గా చెలరేగిపోతున్నారు. ప్రభుత్వం సరికొత్త కరెన్సీ నోట్లను అమల్లోకి తెచ్చాక కూడా రాజధాని నగరంలో ఫేక్ కరెన్సీ ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతోంది. డీమానిటైజేషన్ అమలులోకి వచ్చిన 2016లో నకిలీ నోట్ల చలామణిపై 88 కేసులు నమోదు కాగా, గతేడాది 76 కేసులు, ఈ ఏడాది మే వరకు 34 కేసులు సీసీఎస్‌లో నమోదయ్యాయి. ఫేక్ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం ప్రత్యేక దృష్టి సారించింది. నకిలీ నోట్లకు సంబంధించిన ప్రతి ఉదంతాన్నీ హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా బ్యాంకులను ఆదేశించింది. దేశ భద్రతతో ముడిపడిన అంశం కావడంతో ప్రతి కేసుకూ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
కచ్చితంగా ఫిర్యాదు చేయాల్సిందే..
వినియోగదారుల నుంచి బ్యాంకులకు కొన్ని నకిలీ నోట్లు రావడం ఎప్పటి నుంచో ఉంది. కేవలం ఒకటిరెండు నోట్లు వస్తే ఒకప్పుడు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే ఆర్బీఐ గతేడాది కీలక ఆదేశాలు జారీ చేసింది. నకిలీ నోట్లు వెలుగులోకి వచ్చిన ప్రతి ఉదంతం పైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్పష్టం చేసింది. రాజధానిలో బయటపడే కరెన్సీకి సంబంధించి కేసుల నమోదు, దర్యాప్తు బాధ్యతలను సీసీఎస్ పోలీసులు చేపడుతున్నారు. దీంతో బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని కచ్చితంగా పోలీసుల దృష్టికి తీసుకువెళ్తున్నారు.
ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తున్న సీసీఎస్ అధికారులు.. బ్యాంకునకు వచ్చిన వినియోగదారుడి వద్ద ఒక లావాదేవీలో నాలుగు అంతకంటే తక్కువ నకీలీ కరెన్సీ నోట్లు వస్తే దాన్ని నాన్–ఎఫ్‌ఐఆర్ కేసుగా, ఐదు అంతకంటే ఎక్కువ నోట్లు వస్తే ఎఫ్‌ఐఆర్ కేసుగా పరిగణిస్తున్నారు. బ్యాంకులు గుర్తించకుండా, అసలు వాటికి చేరకుండా చెలామణిలో ఉంటున్న ఫేక్ కరెన్సీ.. గుర్తించిన దానికంటే కొన్ని రెట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
క్వాలిటీ బాగుంటే ‘యూఏపీఏ’ కింద
ఆర్బీఐ సహా వివిధ బ్యాంకులు తమ ఫిర్యాదుతో పాటు గుర్తించిన నకిలీ నోట్లను సైతం తీసుకువచ్చి సీసీఎస్ అధికారులకు అప్పగిస్తాయి. నాన్ ఎఫ్‌ఐఆర్, ఎఫ్‌ఐఆర్.. వీటిలో ఏ తరహా కేసు అయినప్పటికీ పోలీసుల ప్రాథమికంగా ఆ నకిలీ నోట్లను మైసూర్‌లోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు పంపిస్తారు. నోట్లను అక్కడి నిపుణులు పరీక్షించి నకిలీ కరెన్సీ క్వాలిటీ నిర్దేశిస్తూ నివేదిక ఇస్తారు. నకిలీ నోట్లు హై క్వాలిటీతో ఉన్నట్లు నివేదిక వస్తే సీసీఎస్ పోలీసులు అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) ను సైతం జోడిస్తున్నారు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టు ఉత్తర్వులకు లోబడి సీసీఎస్ పోలీసులు ఆయా నకిలీ నోట్లను ధ్వంసం చేయడానికి ఆర్బీఐకే అప్పగిస్తున్నారు. ఈ నకిలీ కరెన్సీలో రూ.2 వేల డినామినేషన్‌లో ఉన్నవే ఎక్కువగా ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు.
‘చెస్ట్’ కేసుల్లో దర్యాప్తు కష్టమే..
సీసీఎస్ అధికారులకు బ్యాంకులతో పాటు ఆర్బీఐ నుంచీ ఈ నకిలీ కరెన్సీపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఓ వినియోగదారుడు చేసిన లావాదేవీలపై వచ్చిన ఫిర్యాదుల కేసుల్లో పురోగతి ఉంటోంది. ఆ వ్యక్తిని పిలిచి వాంగ్మూలం నమోదు చేస్తున్న పోలీసులు.. మరికాస్త ముందుకు వెళ్లి కూపీ లాగుతున్నారు. ఇలా బ్యాంకు స్థాయిలో గుర్తించలేని నకిలీ కరెన్సీని ఆయా బ్యాంకులకు చెందిన చెస్ట్‌లకు పంపినప్పుడు అక్కడి సిబ్బంది గుర్తిస్తున్నారు. ఇక్కడా సాధ్యం కాకుంటే ఆర్బీఐ అధికారులు గుర్తిస్తున్నారు. అయితే సదరు కరెన్సీ ఏ బ్యాంకు శాఖ నుంచి వచ్చిందో బ్యాంకు చెస్ట్ నుంచి వచ్చిందో ఆర్బీఐ చెస్ట్ అధికారులు చెప్పగలుగుతున్నారు. ఇంతకు మించి మరే వివరాలు దొరకడం లేదు. ఫలితంగా దర్యాప్తు ముందుకు సాగడం లేదు. ఇలాంటి కేసుల్లో మూతపడుతున్నవే ఎక్కువగా ఉంటున్నాయి.
(చెస్ట్ అంటే.. ఒక బ్యాంకు చెందిన అన్ని శాఖల నుంచి వచ్చిన నగదు నిల్వ కేంద్రం. ఇక్కడి నుంచే కొత్త నోట్లు ఆయా శాఖలకు సరఫరా చేస్తారు)
సీసీఎస్ గణాంకాల ప్రకారం ఫేక్ కరెన్సీపై నమోదైన కేసులు ఇవీ..
ఏడాది ఎఫ్‌ఐఆర్ నాన్– ఎఫ్‌ఐఆర్ గుర్తించిన నోట్లు
2016 9 79 70,823
2017 4 72 22,867
2018 (మే) 3 31 17,740
Comments
Please login to add a commentAdd a comment